ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి


Thu,April 11, 2019 12:15 AM

తూప్రాన్ రూరల్: తూప్రాన్ మండంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వాహణ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. తూప్రాన్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, ఇతర పోలింగ్ సామగ్రి, ఎన్నికల నిర్వాహణ సిబ్బంది బుధవారం సాయంత్రం చేరుకుంది. పటిష్టవంతమైన పోలీసు బలగాల మధ్య బ్యాలెట్ బ్యాక్స్‌లు ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా మండలంలో 40 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వాహణకు ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఆఫీసర్(పీవో),అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్(ఏపీవో)తో పాటు ఇద్దరు అదర్ పోలింగ్ ఆఫీసర్‌లు నియమితులయ్యారు. ఒకే పోలింగ్ కేంద్రంలో 1000 మంది కంటే ఎక్కువ మంది ఓటర్లున్నట్లయితే ముగ్గురు అదర్ పోలింగ్ ఆఫీసర్‌లు నియమితులయ్యారు. మండలంలోని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ వసతులు ఏర్పాటు చేశారు.

మహిళా ఓటర్లే అధికం..
తూప్రాన్ మండలంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. తూప్రాన్ పట్టణంతో పాటు మండలంలోని 14 గ్రామపంచాయతీల్లో 30,323 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 15,277 మంది, పురుషులు 15,046 మంది ఓటర్లున్నారు.

పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
చేగుంట: ఈ నెల11న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్నీ ఏర్పాట్లు పూర్తియైనట్లు చేగుంట, నార్సింగి ఎన్నికల అధికారులు గోవర్దన్, కె కృష్ణవేణిలు బుధవారం పేర్కొన్నారు. చేగుంట మండలంలో మొత్తం 43 పోలింగ్ బూత్‌లకు గానూ దాదాపుగా రెండువందల మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు, మండలంలో మొత్తం 33వేల మంది ఓటర్లు తమతమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తహసీల్దార్ గోవర్దన్ తెలిపారు. నార్సింగి మండలంలో 18 పోలింగ్ బూత్‌లకు 80మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు, మండలంలో 18 బూతులకు గానూ మొత్తం12480 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తహసీల్దార్ కృష్ణవేణి తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్‌ల వద్ద తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, వికలాంగులకు, వృద్ధుల కోసం విల్‌చైర్లు, ర్యాంపులను ఏర్పాటు చేసినట్లు వారుత తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు, పోలీసులు తెలిపారు.

వెల్దుర్తిలో....
వెల్దుర్తి: నేడు జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు మండల ఎన్నికల అధికారి, తహసీల్దార్ జానకి తెలిపారు. మండలంలో మొత్తం 45 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, మండలాన్ని నాలుగు రూట్లుగా విభజించి అధికారులను నియమించామన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక పోలింగ్ అధికారి, నలుగురు సహాయ పోలింగ్ అధికారులు, ఒక వెబ్ కాస్టింగ్ సిబ్బంది ఉంటారన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కెమరాలను ఏర్పాటు చేసి పోలింగ్ జరుగుతున్న తీరును రికార్డు చేయనున్నట్లు తెలిపారు. అలాగే పోలింగ్ కేంద్రాలలో విద్యుత్, ఫ్యాన్లు, ఇతర సదుపాయాలు అన్ని కల్పించామన్నారు. వేసవి కాలం కావడం, ఎండలు మండుతుండడంతో పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు వేయించడంతో పాటు వృద్ధ్దులు, వికలాంగులు కూర్చోడానికి కుర్చీలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందరూ అధికారుల సమన్వయంతో ఎన్నికల ఏర్పాట్లు చేశామన్నారు.

నాలుగు పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం
మండలంలో నాలుగు పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం సాయంత్ర వెల్దుర్తిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది నియామకం, చేపట్టిన చర్యలపై స్థానిక ఎస్‌ఐ గంగరాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎలాంటి సమస్య వచ్చిన వెంటనే సమాచారం అందించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విధులలో నిర్లక్ష్యం వహించరాదని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో 60 మంది సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. వెల్దుర్తి, కుకునూర్, మంగళపర్తి, మానేపల్లి గ్రామాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.

పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఈవీఎంలు
మనోహరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, సంబంధిత అధికారులు బుధవారం సాయంత్రం చేరుకున్నారు. మనోహరాబాద్ మండలంలో 22 పోలింగ్ కేంద్రాలు ఉండగా, రెండు రూట్‌ల వారీగా పోలింగ్ కేంద్రాలను విభజించారు. రూట్ నెంబర్ 8 లో చెట్లగౌరారం, రంగాయిపల్లి, కోనాయిపల్లి పీటీ, దండుపల్లి, ముప్పిరెడ్డిపల్లి, కొండాపూర్, కాళ్లకల్ గ్రామాలు ఉండగా, రూట్ నెంబర్ 11 లో కూచారం, జీడిపల్లి, మనోహరాబాద్, పాలాట, రామాయిపల్లి, ఇమాంపూర్, లింగారెడ్డిపేట గ్రామాలు ఉన్నాయి. మండలంలో ఆయా గ్రామాల్లో కలిసి 15,893 మంది ఓటర్లు ఉండగా అందులో 8044 మంది పురుషులు, 7849 మంది స్త్రీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...