ప్రచారం సమాప్తం


Wed,April 10, 2019 12:18 AM

- చివరి రోజు టీఆర్‌ఎస్ అభ్యర్థుల విస్తృత ప్రచారం
- మెదక్, నర్సాపూర్‌లలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిల రోడ్‌షోలు
- ఖేడ్‌లో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ రోడ్ షో..
- నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రచారం
- భారీ మెజార్టీయే లక్ష్యంగా గులాబీ దళం ప్రచారం

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధానప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి మైకులు మూగబోయాయి. అధికార పార్టీ ఈ ఎన్నికల్లో విస్త్రత ప్రచారంతో దూసుకుపోగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేశామా..? అంటే చేసినట్లు మామా అనిపించాయి. చివరి రోజు మంగళవారం జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మెదక్, నర్సాపూర్ పట్టణా ల్లో అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణంలో కొత్త ప్రభాకర్‌రెడ్డి మార్నింగ్ వాకర్లతో ముచ్చటించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నారాయణఖేడ్ పట్టణంలో బీబీ పాటిల్ భారీ ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో 10అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు రోడ్‌షోలు, ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తంగా చివరి రోజు గులా బీ దళం ఉత్సాహంగా ప్రచారం చేసింది. కాగా ఈ నెల 11న పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి వైన్స్‌లు మూసివేశారు. మిగిలిన ఉన్న బుధవారం ఒక్క రోజును ఆయా గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఓటర్లను కలుసుకునే ఏర్పాట్లు చేసుకున్నారు.

చివరి రోజు జోరుగా ప్రచారం...
అధికార పార్టీ చివరి రోజైన మంగళవారం జోరుగా ప్రచారం నిర్వహించింది. సిద్దిపేట పట్టణంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పోలింగ్ శాతం పెంచేలా వారికి దిశా నిర్ధేశం చేశారు. డివిజన్ కేంద్రమైన నర్సాపూర్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమానిక వేలాది మంది హాజరయ్యా రు. రోడ్‌షో తరువాత మదన్‌రెడ్డి కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మెదక్‌లో హరీశ్‌రావు, పద్మ, ప్రభాకర్‌రెడ్డిలు రోడ్‌షోలో పాల్గొన్నారు. వేలాదిగా తరలిరావడంతో పట్టణంలో మొత్తంగా గులాబీమయంగా మారిపోయింది. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ముత్తంగి, జిన్నారం, బొల్లారంలలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ప్రచారం, రోడ్‌షోలో పాల్గొన్నా రు. సంగారెడ్డి, సదాశివపేటలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కార్యకర్తలతో సమావేశమై పోలింగ్ రోజు ఏం చేయాలో వివరించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో కార్పొరేషన్ చైర్మ న్లు భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, డా. యాద వరెడ్డిలు ప్రచారం చేశారు. దుబ్బాకలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. భారీ మెజార్టీ లక్ష్యంగా, పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని కార్యకర్తలకు తగు సూచనలు చేశారు. జోగిపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ రోడ్‌షో నిర్వహించారు. జహీరాబాద్ నియోకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే మాణిక్‌రావు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి భరత్‌కుమార్, కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్‌లు పస్తాపూర్‌లో రోడ్ షో నిర్వహించారు. ఎక్కడికక్కడ 10అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్‌ఎస్ శ్రేణులంతా ప్రచారంలోనే పాల్గొన్నాయి.

రెండు స్థానాల్లో 22మంది బరిలో...
ఈ పార్లమెంట్ ఎన్నికల బరిలో జహీరాబాద్, మెదక్ స్థానా ల్లో మొత్తం 22మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ బరిలో 12, మెదక్ బరిలో 10మంది బరిలో ఉన్న విషయం తెలిసిందే. గత నెల మార్చి 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచే ప్రచారం మొదలైంది. అభ్యర్థుల ప్రకటన వెలువడిన తరువాత ప్రచారం మరింత ఊపందుకున్నది. 18నుంచి 25వరకు నామినేషన్లు స్వీకరించిన విషయం తెలిసిందే. మెదక్‌కు కలెక్టర్ ధర్మారెడ్డి, జహీరాబాద్‌కు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావులు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్నారు. జహీరాబాద్ పరిధిలో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నా యి. మెదక్ పరిధిలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నా యి. కాగా 11న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగు నీటి సౌకర్యం కల్పించడంతో పాటు వికలాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మోడల్ పోలింగ్ కేంద్రం, సఖీ పేరుతో మహిళా ఉద్యోగులే నిర్వహించే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా వీడియో చిత్రీకరణ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక తనిఖీ బృందాలు ఎప్పటికప్పుడు పరిశీలించేలా ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు ధర్మారెడ్డి, హనుమంతరావులు తెలిపారు.

హెలీప్యాడ్ స్థల పరిశీలన
సిద్దిపేట రూరల్ : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ తన స్వగ్రామమైన చింతమడకలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు మంగళవారం సిద్దిపేట అడిషనల్ డీసీపీ నర్సింహ్మరెడ్డి చింతమడకలో హెలీప్యాడ్, పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సీఎం చింతమడకకు రానున్న సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద, హెలీప్యాడ్ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట ఏసీ పీ రామేశ్వర్, సిద్దిపేట రూరల్ సిఐ వెంకటరామయ్య, ఎస్‌ఐ కోటేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ డీఈ రవి, ఇరిగేషన్ ఏఈ ఖజా, విద్యుత్ శాఖ ఏఈ రవీందర్, సర్పంచు హంసకేతన్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

129
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...