పోలింగ్ శాతాన్ని పెంచండి


Wed,April 10, 2019 12:16 AM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, పార్లమెంట్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేసిన రోజే మెదక్‌లో ప్రచారం ప్రారంభించామని, రోడ్‌షో, ర్యాలీతో మెదక్‌లోనే ప్రచారం ముగించామన్నారు. మెదక్ పార్లమెంట్‌లోని 7 శాసన సభ నియోజకవర్గాల్లోని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో సభలు, కార్యకర్తల సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహించామన్నారు. ప్రభాకర్‌రెడ్డి గెలుపు నామినేషన్ రోజే ఖాయమైందని, ప్రచారం ముగింపు రోజు... గత 20 రోజులుగా ప్రచారం నిర్వహించిన తీరును చూస్తుంటే 5 లక్షల మెజార్టీ ఖాయంగా కనిపిస్తుందన్నారు. ఎక్కడా కూడా కాంగ్రెస్, బీజేపీ జాతీయ నాయకులు ప్రచారంలో పాల్గొనలేదని, ఎన్నికలకు ముందే కాంగ్రెస్ బీజేపీలు చేతులెత్తేశాయన్నారు.

కార్యకర్తలు, నాయకులు, యువకులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. అందరూ ఓటు వేసేలా కార్యకర్తలు చూడాలని పిలుపునిచ్చారు. ఇది ఒక సువర్ణ అవకాశమని, మెజార్టీని పెంచి మెదక్‌ను జాతీయస్థాయిలో రికార్డు సాధించేందుకు లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. అదే విధంగా రాష్ట్రస్థాయిలో సైతం మెజార్టీలో రికార్డు సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. పోలింగ్ శాతం పెంచిన గ్రామాలకు ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు హరీశ్‌రావు ప్రకటించారు. పోలింగ్ శాతాన్ని పెంచగలిగితే అమేథి అంటే రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్‌గాంధీ, వారణాసి అంటే ప్రధాన మంత్రి మోడీలకు వచ్చిన మెజార్టీలను బద్దలు కొట్టాలన్నారు. దేశంలో అత్యధిక మెజార్టీ వచ్చిన వారిలో ప్రీతం ముండే 6లక్షల 96వేలు, 5 లక్షల 80వేల ఓట్లతో పీవీ నర్సింహారావు, 5 లక్షల 70వేలతో మోడీ, 5 లక్షల 40 వేలు వైఎస్ జగన్‌లు మెజార్టీ సాధించారని, ఈ మెజార్టీలను బద్దలు కొట్టవచ్చని, ఆ దిశగా కార్యకర్తలు, నాయకులు కష్టించి పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ 20 రోజులుగా అన్ని మండలాల్లో ప్రచారం ముమ్మరంగా సాగిందన్నారు. ప్రచారాన్ని మొదటగా మెదక్‌లోనే ప్రారంభించామని, ముగింపును సైతం రోడ్‌షో, భారీ ర్యాలీతో మెదక్‌లో ముగించామన్నారు. ప్రభాకర్‌రెడ్డి గెలుపు ఖాయమైందని, మెజార్టీయే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ప్రజల్లో సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉన్నదన్నారు. హరీశ్‌రావు ఆధ్వర్యంలో 7 శాసన సభ నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరంగా సాగిందన్నారు. ఓటింగ్ పెంచే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, పట్టణ అధ్యక్షుడు గంగాధర్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రచారం చివరి రోజు 2 గంటలకు ప్రారంభించిన ర్యాలీ గంటన్నర పాటు సాగింది. 4.15 నిమిషాల వరకు రోడ్‌షో, ర్యాలీతో 10 నిమిషాల ముందే ప్రచారాన్ని ముగించారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...