రేపటి నుంచి తునికి నల్లపోచమ్మ జాతర


Fri,March 22, 2019 12:14 AM

కౌడిపల్లి: ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏడుపాయల తరువాత రెండో జాతరగా పేరుగాంచిన తునికి నల్లపోచమ్మ జాతరకు సన్నద్ధమైంది. ప్రతి యేటా హోలీ పండుగ తర్వాత మూడో రోజు తునికి నల్లపోచమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. జాతర జరుగనుండడంతో అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర ఉత్సవాలకు కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనదీప్తిలతో పాటు పలువురు ప్రముఖులు జాతర ఉత్సవాల్లో పాల్గొంటున్నారని దేవాదాయ శాఖ సిబ్బంది తెలిపారు.

నల్లపోచమ్మ ఆలయ చరిత్ర...
42సంవత్సరాల క్రితం తునికి గ్రామ ప్రజలు కరువు కాటకాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో గ్రామానికి చెందిన ఓ మహిళకు నల్లపోచమ్మ కలలో వచ్చి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో, చెట్టు కింద తన శిలా విగ్రహాం ఉందని, దానిని ఊరేగింపుగా తీసుకవచ్చి ఊరిలో ప్రతిష్ఠించి పూజలు చేసినచో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారని ఆ మహిళ ప్రజలకు చెప్పింది. గ్రామస్తులు ఆ మహిళ చెప్పిన విధంగానే అటవీ ప్రాంతంలో ఉన్న నల్లపోచమ్మ విగ్రహాన్ని ఎడ్ల బండిపై తీసుకుని ఊరేగింపుతో తీసుకవస్తుండగా ఊరిచివరికి రాగానే ఎడ్లబండి కదులకుండా ఆగిపోయింది.

దీంతో గ్రామస్తులు అమ్మవారి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తరువాత మొదటగా గ్రామానికి చెందిన వైశ్యుడు నాలుగు బండ్లతో జాతర ఉత్సవాలను ప్రారంభించాడు. ఈ క్రమంలో కొన్నేళ్ల తర్వాత ఇదే గ్రామానికి చెందిన ముచ్చర్ల లింగారెడ్డి, బొంతయ్య, నాయబ్‌సాబ్, జంగం శివ్వయ్యలు జాతర నిర్వహణకు సిద్ధమయ్యారు. అప్పటి నుంచి వేడుకలు కొనసాగిస్తూ వస్తున్నారు..జాతరకు ఉమ్మడి జిల్లా, జంట నగరాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ యేడు జాతర ఉత్సవాలకు సుమారుగా మూడు, నాలుగు రోజుల్లో రెండున్నర లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

జాతర ఏర్పాట్లు ముమ్మరం..
తునికి నల్ల పోచమ్మ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చిన తర్వాత మూడోసంవత్సరం కానుండడంతో జా తర నిర్వహించడంతో పకడ్భందీగా ఏ ర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి, మండపానికి, స్వాగత తోరణానికి రంగులు వేసి విద్యుత్తు దీపాలతో అందంగా అలంకరించారు. అలాగే బోనాలు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా షెడ్డును ఏర్పాటు చేశారు. అగ్ని గుండాల స్థలాన్ని కొత్తగా నిర్మించారు. అలాగే మొత్తం అయిదు చోట్ల పార్కింగ్ కోసం స్థలాలను ఏర్పాటు చేశారు. జాతరలో 24గంటల విద్యుత్, జన్‌రేటర్లు, స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదు లు, వైద్య శిబిరం, 108 , ఫైరింజన్‌తో పాటు తదితర భక్తుల సౌ కర్యం భారీ స్థాయిలోనే ఏర్పాటు చేశారు.

నాలుగు రోజుల పాటు జరుగనున్న జాతర
కౌడిపల్లి మండలం తునికి గ్రామ ంలోని నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు వేడుకలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి

జాతరలో బండ్ల ప్రదర్శన విశేషం..
తునికి నల్లపోచమ్మ జాతరలోఎడ్ల బండ్ల ప్రదర్శన, శివసత్తుల విన్యాసాలు ప్రధానమైనది. జాతర ప్రారంభమైనప్పుడు కేవలం నాలుగు బండ్లతో ప్రారంభమైన జాతర ఇప్పుడు వందకు పైగా జాతరలో ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించడం విశేషం

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...