సీపీఎస్ విధానం రద్దు కోసం పోరాటం


Wed,March 20, 2019 12:05 AM

సంగారెడ్డి టౌన్ : ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నష్ట చేస్తున్న సీపీఎస్ విధానం రద్దు కోసం పోరాటం చేస్తామని టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవో భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీల వల్లనే ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ శాపంగా మారిందన్నారు. అదే విధంగా సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురిచేశాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన తర్వాత ఎలాం టి పెన్షన్ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్ విధానం ద్వారా రద్దు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగులకు నష్టం చేస్తున్న పార్టీలపై అప్రమత్తంగా ఉండాలని కోరా రు. రాష్ట్ర ప్రభుత్వం 1-7-2018 నుంచి రావాలసిన పీఆర్‌సీ ఇవ్వాలని కోరారు. పీఆర్‌సీ కమిషన్‌కు 63శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇవ్వాలని, 50శాతం పెరుగుదలతో అలవెన్స్‌లు ఇవ్వాలని నివేదికలు ఇచ్చామన్నారు.

జూన్‌లో పీఆర్‌సీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. ప్రభుత్వం నుంచి పీఆర్‌సీ ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నారని త్వరలో ఉద్యోగులందరికీ నూతన పీఆర్‌సీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారంలో ఉన్న వారికి అండగా నిలబడాలని సూచించారు. ఉద్యోగుల గొంతుక వినిపించేందుకు ఉద్యోగుల నుంచి ప్రతినిధి కావాలని పట్టభద్రుల ఎమ్మెల్సీగా చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ప్రకటించామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనియన్లు ఒక్కతాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడి చంద్రశేఖర్‌గౌడ్ విజయానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్‌గౌడ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. పట్టబద్రుల ఎమ్మెల్సీకి లక్షా 96వేల ఓట్లు ఉన్నాయని అందులో లక్షా 40వేలు ప్రభుత్వ ఉద్యోగులవే ఉన్నాయన్నారు. పట్టబద్రుల ఎమ్మెల్సీగా చంద్రశేఖర్‌గౌడ్ విజయం ఖాయమైందన్నారు. అదే విధంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కాకుండా ఆన్‌లైన్ ద్వారా ఎక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారో అక్కడే ఓటు వినియోగించుకునేలా చూడాలని ఎన్నికల కమిషన్‌ను కోరామని తెలిపారు.

పోస్టల్ ఓట్ల వల్ల ఎవరికి ఓటు వేశారో అనే విషయాన్ని తెలుసుకుని ప్రభుత్వ ఉద్యోగులను బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కామన్‌గా అందరిలాగే ఉద్యోగులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న బూత్‌లోని ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఎన్నికల వద్ద ఉద్యోగులపై దాడులు చేస్తున్నారని, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు. ఎన్నికల విధులు నిర్వహిస్తు న్న ఉద్యోగులు, సిబ్బందికి నూతన పీఆర్‌సీ ప్రకారం రెమ్యూనరేషన్ ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఉద్యోగుల జేఏసీ సంఘం కో-చైర్మన్ మామిళ్ల రాజేందర్, కన్వీనర్ సత్యనారాయణ, భాగ్యనగర్ తెలంగాణ ఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమంతు నాయక్, టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లారెడ్డి, టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రయ్యగౌడ్, టీఎన్‌జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు సుశీల్‌బాబు, ప్రధాన కార్యదర్శి జావేద్ అలీ, మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్యాంరావు, వివిధ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రతాప్, రవి, చంద్రశేఖర్, వెంకటేశం, చందా శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, ఖాదర్ అలీ, బలరాంగౌడ్, ఎంవీ.కృష్ణయాదవ్, వైద్యనాథ్, కృష్ణకుమార్ పాల్గొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...