నామినేషన్ల ప్రక్రియ షురూ..


Tue,March 19, 2019 01:08 AM

-వెలువడిన లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్
-జహీరాబాద్ రిటర్నింగ్ అధికారిగా హనుమంతరావు
-మొదటి రోజు నామినేషన్లు నిల్
సంగాడ్డి చౌరస్తా : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. అదేరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. జిల్లాలోని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హనుమంతరావు వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కింది స్థాయి సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి అవసరమైన కంప్యూటర్ సామక్షిగిని సమకూర్చారు. కలెక్టరేట్‌కు నామినేషన్ వేసేందుకు వివిధ పార్టీల ప్రతినిధులు రానున్నందున పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. నామినేషన్ వేసేందుకు వచ్చేవారి కోసం తాగునీటిని అందుబాటులో ఉంచారు. కలెక్టరేట్ మొదటి ద్వారం వద్దనే ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను నిలిపివేస్తున్నారు. రెండు ముఖ ద్వారాల వైపు నుంచి బారీ కేడ్లు ఏర్పాటు చేసి కలెక్టర్ చాంబర్ వైపు ఎలాంటి వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ‘ఏ’ బ్లాక్ వద్ద సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద నుంచి ఆయన చాంబర్ వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం అంతా నిర్మానుష్యంగా మారింది. కలెక్టరేట్‌లో ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. ఇదిలా ఉండగా మొదటి రోజు నామినేషన్ల స్వీకరణలో భాగంగా ఏ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...