16 ఎంపీ సీట్లు గెలిచి.. కేంద్రాన్ని శాసిద్దాం..


Sun,March 17, 2019 11:23 PM

గజ్వేల్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని, కేంద్రంలో కూడా తెలంగాణ కీలకమైతే రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని అవకాశాలు అంది వస్తాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత ఐదేండ్లుగా కేంద్ర నిధులను అనుకున్నంతగా సాధించలేక పోయామని, ఈసారి రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాలను గెలుచుకొని, కేంద్రంలో కీలకం కావడమే కాకుండా నిధులు రాబట్టుకోవాలని అన్నారు. తెలంగాణ సాధించుకున్నాక అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పరుగులు తీస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రం కోసం చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించి మరోసారి భారీ మెజార్టీతో అధికారాన్ని అందించారన్నారు. కేసీఆర్ చేపట్టే అభివృద్ధి పనులు తరతరాలకు ఉపయోగపడుతాయని, ప్రజలు కూడా ఈ అంశాలను గుర్తించి దీవించారన్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి దీవించి, టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే కేంద్రంలో మనం కీలకమవుతామన్నారు.

కేంద్ర నుంచి మన వాటా సాధించడం టీఆర్‌ఎస్‌తోనే తప్ప మరో పార్టీతో కాని పని అని పేర్కొన్నారు. త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల సమస్యల పరిష్కారంలో పాతూరి సుధాకర్‌రెడ్డి నిరంతరం కృషి చేశారన్నారు. ప్రజా సమస్యల్లో భాగస్వాములై, బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలకమయ్యారన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుదాకర్‌రెడ్డి మాట్లాడుతూ తనను గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలకు ప్రభుత్వానికి వారధిగా పని చేసి, అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానన్నారు. మరో సారి తనను గెలిపిస్తే, పెండింగ్ సమస్యల పరిష్కారానికి పని చేస్తానన్నారు. ఈ సమావేశంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పీఆర్టీయూ నాయకులు సత్యనారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు వెంకట నర్సింహరెడ్డి, మహిపాల్‌రెడ్డి, చారి, సాయి శ్రీనివాస్ పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...