మమ్మేలు.. మల్లన్నస్వామి


Sun,March 17, 2019 11:22 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతున్న కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి మల్లన్న క్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 9వ ఆదివారం సందర్భంగా సుమారు 75వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నట్లు ఆలయ చైర్మన్ సెవెల్లి సంపత్, డిప్యూటీ కమిషనర్ టంకశాల వెంకటేశ్‌లు తెలిపారు. స్వామివారి క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆలయ నిర్వహణలో ఉన్న గదులతో పాటు ప్రైవేటు గదులను కిరాయికి తీసుకొని బస చేస్తున్నారు. శనివారం సాయంత్రం క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం వేకువజాముననే నిద్ర లేచి కోనేరులో పుణ్యస్నానాన్ని ఆచరించి స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి పట్నాలు వేశారు.

కొందరు తాము బస చేసిన గదుల వద్ద మరికొందరు మహామండపంలో ఒగ్గు పూజారులతో మల్లన్నకు పట్నాలు వేయించి మొక్కులు తీర్చుకున్నారు. గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకోవడంతో పాటు కోరిన కోరికలు తీర్చాలని స్వామి వారికి కోరమీసాలను సమర్పించారు. అదేవిధంగా భక్తులు స్వామివారికి భక్తులు ఒడిబియ్యం, అభిషేకం, అర్చనలను చేసి భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ముత్యం నర్సింహులు, జూకంటి కిష్టయ్య, ఉడుత మల్లేశ్‌యాదవ్, బండి తిరుపతిరెడ్డి, బాలేష్‌యాదవ్, ఆలయ ఏఈవో రావుల సుదర్శన్, పర్యవేక్షకులు నీల శేఖర్, సిబ్బంది, అర్చకులు, ఒగ్గుపూజారులు పాల్గొన్నారు. కాగా హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు జాతరలో బందోబస్తును నిర్వహించారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...