ఏడుపాయలలో భక్తుల సందడి


Sun,March 17, 2019 11:22 PM

మెదక్, నమస్తే తెలంగాణ/పాపన్నపేట: ఏడుపాయల వనదుర్గ భవానీమాతను ఆదివారం ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏడుపాయల దేవస్థాన చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఈవో మోహన్‌రెడ్డిలు ఎమ్మెల్సీ ఎన్నికైన తరువాత తొలిసారిగా దైవదర్శనానికి రావడంతో ఆలయ మర్యాదలతో పాలకవర్గ సభ్యుల అంజిరెడ్డితో కలిసి ఘన స్వాగతం పలికారు. ఆలయ గోపురం నుంచి గర్భగుడి వద్దకు తీసుకెళ్లారు. వేద బ్రహ్మణులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సుభాష్‌రెడ్డి దంపతులను ఆలయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు.

కేసీఆర్ ఆశీర్వాదంతోనే...
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ సమమయంలో, పార్టీలో కష్టించి పనిచేసే వారికి తప్పుండా పదవులు వస్తాయన్నారు. కేసీఆర్ కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలను గుర్తించి తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తారన్నారు. ఎమ్మెల్సీగా ఈప్రాంత అభివృద్ధికి, దేవాలయ అభివృద్ధికి నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి పని చేస్తానన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా విజయానికి సహకరించిన ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడే అవకాశం ఉందని, ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీవచ్చే అవకాశం లేదని ప్రాంతీయ పార్టీల కీలకం కానున్నాయని సుభాష్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మిత్రపక్షం ఎంఐఎం కలుపుకొని 17 స్థానాలను గెలుచుకొని కేంద్రంలో కేసీఆర్ ప్రధాన పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికైన సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవటానికి కుటుంబ సమేతంగా వచ్చినట్లు ఈ సందర్బంగా చెప్పారు.

మెదక్, నమస్తే తెలంగాణ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవానీ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు మంజీరానదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఈవో మోహన్‌రెడ్డి, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, బోనాలు, తలనీలాలు సమర్పించారు. ఏడుపాయల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాపన్నపేట ఎస్‌ఐ ఆంజనేయులు తమ సిబ్బందితో పోలీసు బందొబస్తు ఏర్పాటు చేశారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...