ఎండ @ 40 డిగ్రీ


Sat,March 16, 2019 12:27 AM

మెదక్, నమస్తే తెలంగాణ : భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రత పెరిగిపోతుండడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప ఇల్లు విడిచి బయటకు వెళ్లడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు మధ్యాహ్నం భానుడి ప్రభావం ఎక్కువగా ఉండడంతో జనం రోడ్లపైకి రావాలంటే జంకుతున్నారు. మధ్యాహ్నం చేయవాల్సిన పనులన్నీ సాయంత్రం తర్వాత లేదంటే పొద్దున్నే ముగించుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే వారు తప్పకుండా జూస్ స్టాళ్లు, పండ్ల దుకాణాల వద్దకు వెళ్లి తిని ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. రోజు రోజుకు ఎండలు పెరిగిపోవడంతో చిన్న పిల్లలతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది.

ఎండలు అప్పుడే దడ పుట్టిస్తున్నాయి. మార్చి నెల రెండో వారంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకోవడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జిల్లాలోని నర్సాపూర్‌లో అత్యధికంగా 40.0 డిగ్రీలు, హవేళిగనపూర్ మండలంలో 39.3, రామాయంపేట మండలంలో 38.9, మెదక్‌లో 38.5, కొల్చారం మండలంలో 38.2, నార్సింగి మండలంలో 38.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు 40 డిగ్రీలే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. గత సంవత్సరం ఇదే రోజున 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. అంటే గత ఏడాది కంటే 2 డిగ్రీల ఎక్కువగా నమోదయ్యింది. ఉదయం నుంచి మొదలవుతున్న వేడి సాయంత్రం వరకు కొనసాగుతున్నది. ఎండ వేడిమికి పగటి పూట ప్రయాణాలు ప్రజలు తగ్గించుకున్నారు. ఇప్పుడే మండుతున్న సూర్యుడు ఏప్రిల్, మే నెలల్లో ఇంకెంతో భగ భగమంటాడో అంటూ జనాల్లో ఆందోళన నెలకొన్నది. వైద్యులు మాత్రం ఎండ వేడిమికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎండలో తిరుగొద్దంటున్నారు.

ఉదయం నుంచే...
రెండేండ్ల్లుగా జిల్లాలో తీవ్ర వర్షాభావంతో జలాశయాలు ఎండిపోవడం, భూగర్భ జలాలు ఆడుగంటడం తద్వారా వాతవారణంలో తేమ శాతం తగ్గడంలాంటి కారణాలతో ఉదయం 9 నుంచే ఎండ తీవ్రత మొదలవుతున్నది. ఉదయం పది గంటలు దాటితే బానుడు భగ్గుమంటున్నాడు. గతేడాదితో పోలిస్తే ఏకంగా రెండు, మూడు డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

చల్లదనం కోసం ఆరాటం..
భగభగ మండే ఎండలకు ఉక్కబోత భరించలేక ప్రజలు చల్లదనం కోసం ఆరాటపడుతున్నారు. నిమ్మసోడ, చెరుకు రసాలు తదితర శీతల పానీయాల వద్ద ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కొబ్బరి బోండాల నిర్వాహకులకు గిరాకీ మొదలైంది. ముందస్తుగా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నారు.

మధ్యాహ్నం వేళ రోడ్లన్ని ఖాళీ..
నాలుగైదు రోజులుగా బానుడి భగభగకు జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లన్ని మధ్యాహ్నం వేళ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులపై మాత్రమే తలకు టోపీలు ధరిస్తూ, ముఖాలకు గుడ్డలు రక్షణగా కట్టుకుని బయటకు వస్తున్నారు.

222
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...