కాళేశ్వరంతో ప్రాజెక్టులు నింపుతాం


Sat,March 16, 2019 12:26 AM

సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ: అన్నదాతల పంటపోలాలకు నీళ్లందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సింగూరు, మంజీరా ప్రాజెక్టులు నింపి సేద్యానికి నీరందిస్తామని ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కంది మండల పరిధిలోని గేట్‌వే మానోర్స్ విల్లాలోని భవనంలో పూజలుచేసి పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతులు రెండు పంటలు పండించేందుకు సాగునీరందించే లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణాలను ముఖ్యమంత్రి చేపట్టారని గుర్తు చేశారు. సాగునీటి కోసం భవిష్యత్ తరాలకు చెరువులు కుంటలు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా తలపించాలని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కాలువలతో సింగూరు, మంజీరా ప్రాజెక్టులను నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంటు సభ్యులందరం పోరాటం చేస్తామని ప్రకటించారు. అందుకోసం త్వరలో జరుగునున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించేందుకు 16 ఎంపీ సీట్లను తప్పకుండా ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాల ఖిల్లాగా పేరుగాంచిన మెదక్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు సారథ్యం వహించడం ప్రజల అదృష్టమన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మెదక్ జిల్లా ప్రజల సాగునీటి ఆశలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారన్నారు.

అందుకోసం అడుగడుగునా ఉన్న చెరువులను నింపేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ పనులను చేపట్టి బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యమ స్ఫూర్తితో సాధించిన తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే మార్గదర్శకంగా చేసి ప్రజల కష్టాలను తీర్చేందుకు సాగునీటి పథకాలు చేపట్టడం తెలంగాణ సర్కారుకే దక్కిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 టీఆర్‌ఎస్ ఎంపీ సీట్లు, ఒక ఎంఐఎం సీటును గెలిపిస్తే ప్రాజెక్టులకు జాతీయ హోదా, లక్ష కోట్ల నిధులు, జాతీయ రహదారుల విస్తరణకు నిరంతర పోరాటం చేసి సాధిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి మా ఎజెండా అనే నినాదంతో టీఆర్‌ఎస్‌లో చేరి ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడానికి ముందుకు రావడం గొప్పవిషయమన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినా.. నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమని అభిప్రాయంతో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు వివరించి టీఆర్‌ఎస్‌లోకి వస్తామని ప్రకటించడం శుభసూచకం అన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలు మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం అందించాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరారు.

ఐదు లక్షల మెజార్టీ ఖాయం..
- మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో సాధించిన మెజార్టీ 3.60లక్షల కన్నా అధికంగా 5లక్షల మెజార్టీ సాధిస్తామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దీమా వ్యక్తం చేశారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని సంగారెడ్డిలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీని అందించేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయడానికి కంకణ బద్దులుగా సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలతో దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపై ఐక్యరాజ్యసమితిలో చర్చకు రావడం గొప్పవిషయమన్నారు. రైతే రాజుగా బతకాలని, ఇతరులను శాసించే స్థాయికి అన్నదాతలు ఎదుగాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రైతు సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. కేంద్రమంత్రివర్గంలో ఉన్న మంత్రులు తమ సొంత రాష్ర్టాలకే నిధులు తరలించుకుపోయారని, తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని పార్లమెంట్ స్థానాలలో విజయం సాధిస్తే కేంద్ర ప్రభుత్వం వెన్నులో వనుకు పుట్టి నిధులు ఇస్తుందన్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కార్యక్రమాలను సంగారెడ్డి నుంచి ప్రారంభించి తెలంగాణ సర్కారు అమలు చేసిన సంక్షేమ అభివృద్ధిని చూసి మరోసారి టీఆర్‌ఎస్‌కు విజయం అందించాలని ప్రజలను కోరారు. సమావేశంలో అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, జడ్పీటీసీ మనోహర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, మాజీ సీడీసీ చైర్మన్లు పట్నం మానిక్యం, ప్రభుగౌడ్, కొండాపూర్ ఎంపీపీ మ్యాకం విఠల్, నాయకులు డాక్టర్ రాజుగౌడ్, ఆర్.వెంకటేశ్వర్లు, కాసాల రాంరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పెరుమాండ్ల నర్సింహులు, సుధీర్, జలేందర్‌రావు, ఆంజనేయులు పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...