కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ప్రారంభం


Sat,March 16, 2019 12:26 AM

మెదక్, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌ను శుక్రవారం మెదక్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ కార్యక్రమాలు మెదక్‌లోనే జరుగనుండటంతో ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందించేందుకు గాను మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీవరకు మెదక్ కలెక్టరేట్‌లోనే నామినేషన్లు స్వీకరణ, 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 28వ తేదీన ఉపంసంహరణ ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న కౌంటింగ్ ఉంటుందన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో 15,95,272 మందు ఓటర్లు ఉండగా ఇందులో మహిళా ఓటర్లు 7,99,985, పురుష ఓటర్లు 7,95248, ఇతరులు 39 మంది ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకుగాను 2,043 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

నామినేషన్‌కు ఐదుగురు మాత్రమే..
ఈ నెల 18 నుంచి 25 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. నామినేషన్ వేయడానికి పోటీ చేసే అభ్యర్థితో కలసి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. నామినేషన్ పత్రంలోని అన్నింటిని పూరించాలని, ఏ ఒక్కటి పూరించకున్నా నామినేషన్ తిరస్కరింబడుతుందన్నారు. నామినేషన్ పత్రాలతోపాటు పోటీ చేసే అభ్యర్థి, కుటుంబ సభ్యుల ఐటీ రిటర్న్స్, పోటీ చేసే అభ్యర్థులపై ఏదేని కేసులుంటే వాటి వివరాలు సైతం నామినేషన్‌తో పాటు దాఖలు చేయాలన్నారు. తప్పుడు ధ్రువ పత్రాలు దాఖలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. పోటీ చేసే ప్రతి అభ్యర్థి నూతనంగా బ్యాంకు ఖాతా తెరిచి ఖర్చులను ఖాతా ద్వారా చూపలన్నారు. నామినేషన్‌ల స్వీకరణ సీసీ కెమెరా, వీడియో రికార్డింగ్ ద్వారా స్వీకరిస్తామన్నారు.

సీ- విజిల్ సద్వినియోగం చేసుకోవాలి
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సీ-విజిల్ యాప్‌ను అమల్లోకి తెచ్చిందని.. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఆధారాలతో ఈ యాప్ ద్వారా ఎవరైనా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు, మద్దతుదారులు ఓటర్లను డబ్బు, మద్యం ఇతరత్రా రూపాల్లో ప్రలోభాలకు గురిచేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటివి సాధారణ ప్రజలు ఎవరైన ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో వికలాంగుల కోసం వీల్‌చైర్స్ అందుబాటు ఉంటాయన్నారు.

ఎమ్మెల్సీ పోలింగ్ రోజు ఉద్యోగస్తులకు సెలవు దినం
ఈనెల 22న ఎమ్మెల్సీ పోలింగ్ రోజు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ సీతారామారావు, డీఆపీఆర్వో శైలేష్‌రెడ్డి, డీసీవో వెంకట్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...