చావే శరణ్యమా..?


Thu,March 14, 2019 11:34 PM

సంగారెడ్డి రూరల్: సమాజంలో నేటి యువత చిన్న, చిన్న కారణాలకే తమ ప్రాణాలను బలితీసుకుంటున్నారు. గోటితో పొయ్యేదానికి గొడ్డలిదాకా ఎందుకు అన్న చందంగా కూర్చొని చర్చించుకుంటే తీరే సమస్యలకు ఏకంగా నిండు ప్రాణాలను వదులుకోవడం ఎంతవరకు సమంజమో విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలి. తమ పిల్లాడి ఆలోచనా స్థితిని ఎప్పటికప్పుడు పసిగట్టే బాధ్యత వారిపైనే ఉంటుంది. వాళ్లకి ఏం కావాలి, వాళ్లు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అనే విషయాన్ని గమనిస్తూ వారితో ప్రతీ రోజు ఒక అరగంట గడిపి అన్ని వివరాలు చర్చించాలి. అప్పుడే తమ పిల్లలపై ఒత్తిడి చేసే కారణాల నుంచి దూరం చేసే అవకాశం ఉంటుంది. మా అమ్మాయి/అబ్బాయి చాలా బాగా చదువుతున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు, క్లాస్‌లో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు అని మురిసిపోకుండా చదువుతో పాటు వాళ్లు ఇతర విషయాల్లో ఎలా ఉంటున్నారనేది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యు నిపుణులు చెబుతున్నారు. అసలు విద్యార్థులు ఏ కారణాలకు కృంగిపోతున్నారు. విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకోకుండా, అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అనే అంశంపై మానసిక నిపుణులు చెబుతున్న విషయాలు, సలహాలు తెలుసుకుందాం.

అభద్రతా భావంతో బతకడం మంచిది కాదు...
ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలే మామూలుగా ప్రతి చిన్న విషయానికి భయపడే వారికే వస్తుంటాయి. సమాజంలో తాము అందరిలా ఉండలేమేమో అనే అభద్రతా భావం వారిలో లోతుగా కూరుకుపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ధైర్యస్తులలో ఈ ఆలోచనలో అసలు రావు. ఎందుకంటే ఏమైతే మనకేంటి అనే ఆలోచన వారిలో గట్టిగా ఉంటుంది కాబట్టి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని చిన్నప్పటి నుంచి ధైర్యంగా పెంచాలి. ప్రతి విషయాన్ని వారితో చర్చించుకోవడం ఎంతో మంచిది. అలా వారిని భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా పిల్లలు ఆన్ని విషయాలపై అవగాహన కలిగి ఉంటారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలను వారికి అర్థమయ్యేలా వివరించాలి. తల్లిదండ్రులు తమ చిన్నతనంలో సమస్యలను ఎలా ఎదుర్కున్నారో ఉదాహరణలు చెబితే పిల్లలకు ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే అయ్యో మా అమ్మా, నాన్నలు కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఇంతవరకు వచ్చారంటే నేనెందుకు వారిలా జీవతంలో మంచిగా, ధైర్యంగా బ్రతకలేనా? అనే గట్టి నమ్మకం వారి మనస్సులో నాటుకుపోతుంది. తద్వారా ఏ సమస్యలు వచ్చినా దానిని సులువుగా వారే పరిష్కరించుకుంటారు.

లైఫ్‌స్టయిల్‌లో మార్పులే కారణం...
కుర్రకారు కొత్త జోష్‌తో ముందుకు పోతున్నారు. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి సరిపోల్చుకుంటే బోలెడు తేడా ఉంది. కొత్త రకం డ్రెస్సింగ్, ఫ్యాషన్, హెయిర్ స్టయిల్ ఇలా ప్రతి విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఫ్యాషన్ కల్చర్‌ను ఫాలో అవుతున్నారు. మారుతున్న కాలాన్ని బట్టి మనమూ మారుతున్నాం. కానీ కొంతమంది విద్యార్థులు తమ ఆలోచన విధానాలను పరిమితిలో ఉంచడం వల్ల వారు ఈ ఫ్యాషన్ కల్చర్‌ను ఫాలో కాలేకపోతున్నారు. సరే ఫాలో కాకున్నా తమలా ఉన్నా సరే అవతలి వారిని ఎదుర్కొని ముందుకు పోయేలా ఉంటే మంచిది. కానీ మార్పుతెచ్చిన తంట ఏమో కాని పిల్లలు నయా కల్చర్‌లో తోటి విద్యార్థులతో సమానంగా పోకపోవడంతో వారు తీవ్ర ఒత్తిడికి గురువుతున్నారు. తద్వారా వారికి జీవితంపై విరక్తి చెందుతుందనే ఆలోచనలో మొదలై ఆత్యహత్యలకు పాల్పడుతున్నారు.

పెరుగుతున్న ఆత్మహత్యలు...
ప్రపంచంలో ఏటా ఆత్మహత్యల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపిన వివరాల ప్రకారం యేటా లక్షమంది వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు గుర్తించారు. ప్రతి మూడు సెకన్లకు ఒక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వారి సర్వేలో తేలింది. ప్రపంచ జనాభాలో 1998లో 1.8 శాతం ఆత్మహత్యలకు పాల్పడగా, 2020 నాటి ఈ సంఖ్య 2.4 శాతానికి చేరుతుందని వారు చెబుతున్నారు. డబ్లూహెచ్‌వో 2009 లెక్కల ప్రకారం ఆత్మహత్యలు జరుగుతున్న స్థానంలో భారతదేశం 43 స్థానంలో ఉంది. 15 నుంచి 44 ఏండ్లలోపు వారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని వారి సర్వేలో తేల్చి చెప్పారు.

మన రాష్ట్రంలో ఇలా...
ప్రతి 55 నిమిషాలకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. 2017-18లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 150 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. ఇదే సంవత్సరంలో కేవలం హైదరాబాద్‌లో 30 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఎక్కువగా 20 శాతం మంది విద్యార్థులు, ఇతర పట్టణాలలో నివసిస్తున్న వారు అధిక ఒత్తిడి, అతృత, అభద్రతా భావంతో బతుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

పిల్లల్ని నిత్యం గమనిస్తూ ఉండాలి...
తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎప్పుడు ఒక కంట గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు తమపై అన్ని విషయాల్లో దృష్టి పెట్టారని వారికి తెలిస్తే చెడుఅలవాట్లు, చెడు ఆలోచనలకు వారు దూరంగా ఉంటారు. పిల్లలు ప్రతీరోజూ విధిగా స్కూల్‌కో, కాలేజీకో వెళ్లి మంచిగా చదువుకుంటున్నారు అనుకుంటే సరిపోదు. పిల్లలో ఒత్తిడికి కారణం చదువే ప్రధాన కారణం కాదు. వాటికి అనేక రకాల కారణాలు కూడా ఉంటాయనేది తెలుసుకోవాలి. కాలేజీలో ఎవడో ఏడిపించాడనో, తోటి విద్యార్థులు తనని అందరి ముందు అపహాస్యం చేశాడనో ఇలా అనేక ఇతర కారణాలకు కూడా వారు తీవ్ర మానసిక క్షోభకు గురవుతుంటారు. రోజు ఒక అరగంట వారితో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా తండ్రులు బయట ఎంత బిజీగా ఉన్నా తమ పిల్లలతో కాసేపు సరదాగా గడుపాల్సిన అవసరం ఉంది.

కారణాలు ఇవి...
-పిల్లలు కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి ఒంటరిగా ఉంటున్న భావన.
-అకారణంగానే స్వీయ హాని చేసుకోవడం (ఉదా: చెయ్యి కోసుకోవడం, కొట్టుకోవడం వంటివి)
-రోజు చేసే పనుల్లో మార్పులు రావడం. ముఖ్యంగా తినే సమయంలో, నిద్రపోయే సమయంలో మార్పులు.
-చెడు వ్యసనాలకు బానిసలవడం.
-తలకు మించి సాహసాలు చేయడం
-గతంలో ఉన్నంత ఉల్లాసంగా ఉండకపోవడం.అన్ని కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఎవరితోనూ కలవలేకపోవడం

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...