దక్కేదెవకరికో....


Thu,February 14, 2019 01:57 AM

-చైర్మన్, కౌన్సిలర్ల రిజర్వేషన్ల కోసం ఎదురుచూపు
-ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలు సిద్ధం
-పార్లమెంట్ ఎన్నికలకు ముందా లేక తర్వాత..?
-జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు...
-మొత్తం ఓటర్లు 69,352 మంది
రాజకీయ పార్టీలలో బల్దియా ఎన్నికల వేడి రాజుకుంటున్నది. పాలకవర్గం గడువు త్వరలో ముగియనుండటంతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సామాజిక వర్గాల వారీగా ఓటరు జాబితాను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. దీంతో మున్సిపల్ రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంటున్నది. వార్డు కౌన్సిలర్లు, చైర్మన్ పదవులకు ఏ రిజర్వేషన్ వస్తుందో.. ఎవరికి దక్కనున్నదోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే నిర్వహిస్తారా.. లేక తర్వాత జరిపిస్తారా..? అనే విషయంపై ప్రజలు చర్చించుకుంటు న్నారు.మెదక్ మున్సిపాలిటీ : మెదక్ మున్సిపాలిటీ పాలకవర్గం గడువు దగ్గర పడుతున్నది. మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు మున్సిపల్ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల పరిధిలో సామాజిక వర్గాల వారీగా ఓటరు జాబితాను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. మెదక్ మున్సిపల్ పరిధిలో ఉన్న 27 వార్డులు, మున్సిపల్ చైర్మన్‌ల రిజర్వేషన్లను ప్రకటించేందుకు పూర్తి జాబితా ప్రభుత్వం వద్దకు చేరుకున్నది. ఈ నేపథ్యలో రిజర్వేషన్లు ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీల్లో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. ఇదిలావుంటే మున్సిపల్ ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే నిర్వహిస్తారా.. లేక తర్వాత జరిపిస్తారా..? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు..
మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీలో 29,9 మంది ఓటర్లు ఉండగా, తూప్రాన్ మున్సిపాలిటీలో 16,30 మంది, రామాయంపేట మున్సిపాలిటీలో 11,032 మంది ఓటర్లు ఉండగా, నర్సాపూర్ మున్సిపాలిటీలో 12,123 మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలావుండగా మెదక్ మున్సిపాలిటీలో విలీనమైన ఔరంగాబాద్, అవుసులపల్లి గ్రామాల ప్రజలు కోర్టుకు వెళ్లారు. అంతేకాకుండా తూప్రాన్ మున్సిపాలిటీలో బ్రహ్మణపల్లి పంచాయతీ గ్రామ ప్రజలు కూడా కోర్టుకు వెళ్లారు. అయితే మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే నాటికి కోర్టు తీర్పు వస్తే తప్ప మెదక్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగే అవకాశం ఉంది.

పార్లమెంట్ ఎన్నికలకు ముందే..?
ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికలకు ముందే నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు మున్సిపల్ అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే ఈ నెలాఖరులోపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించే అవకాశం లేకపోలేదని అధికారులు భావిస్తున్నారు. మార్చి నెలలో ఎన్నికలు నిర్వహిస్తే 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు ఉండడంతో ఎన్నికలకు వెళ్లాలా.. లేదా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వెళ్లాలా అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

రిజర్వేషన్లపై ఉత్కంఠ...?
మున్సిపల్ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొన్నది. మెదక్ మున్సిపల్ ఓటరు జాబితా ప్రకారం మున్సిపల్ చైర్మన్ పీఠం ఏ సామాజిక వర్గానికి అనుకూలంగా వస్తుందోనని నేతలు ఆందోళన చెందుతున్నారు.
గతంలో ఉన్న 27 వార్డులతో పాటు నూతనంగా మున్సిపల్‌లో విలీనమైన గ్రామాల్లో కౌన్సిలర్ పదవికి పోటీ చేయాలని ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. రిజర్వేషన్ల ప్రకారం వార్డు కౌన్సిలర్లను ప్రకటించిన వెంటనే ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

197
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...