ఊరికో నర్సరీ


Tue,February 12, 2019 01:02 AM

-మొక్కల పెంపకానికి 318 చోట్ల ఏర్పాట్లు
-ఈయేడు లక్ష్యం 2.99 కోట్ల మొక్కల పెంపకం
-విజయవంతానికి పటిష్ట ప్రణాళికలతో
-నాటే స్థలాలూ గుర్తింపు
-2 కోట్ల 72 లక్షల 74 వేల బ్యాగులు సిద్ధం: సీతారామారావు, డీఆర్డీవో
వనాలు పెరుగాలె.. వానలు పడాలె.. వానరాలు వాపస్ పోవాలె.. అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఐదోవిడుత హరితహారాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తున్నది. ఒక గ్రామానికి ఒక నర్సరీ కార్యక్రమంలో భాగంగా సర్కారు ఆదేశాల మేరకు 318 చోట్ల నర్సరీలు పెట్టి మొక్కలు పెంచే ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే కవర్లలో మట్టి నింపే పనులు కూడా పూర్తయ్యాయి. ఇప్పటివరకు 24 రకాల విత్తనాలను నర్సరీలకు అందజేశారు. కానుగ, ఇప్ప, టేకుతో పాటు పలురకాల పండ్లు, పూల మొక్కలను కూడా నర్సరీలలో పెంచుతున్నారు. మొక్కలను నాటేందుకు ఇప్పటికే స్థలాలను కూడా గుర్తించారు.
- మెదక్, నమస్తే తెలంగాణపచ్చదనం వెల్లివిరియాలి.. ఊరువాడా హరితమయం కావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి పెద్దపీట వేస్తున్నది. యేటా రూ. కోట్ల నిధులు వెచ్చిస్తున్నది. హరితహారం కార్యక్రమాన్ని కొత్త పంచాయతీరాజ్ చట్టంలో చేర్చింది. జాతీయ ఉపాధి హామీ పథకం చట్టంలో చేర్చింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద దీనిని చేపడుతున్నాయి. ఈసారి ప్రజలకు అవసరమయ్యే పూలు, పండ్ల మొక్కలకు సైతం ప్రాధాన్యతనిస్తున్నారు.
మెదక్, నమస్తే తెలంగాణ : పర్యావరణ పరీరక్షణకు ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రామాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఉపాధి హామీ, అటవీ శాఖ ఆధ్వర్యంలో నర్సరీల ఏర్పాట్లు జరిగేవి. ప్రస్తుతం హరితహారంలో భాగంగా పాత గ్రామ పంచాయతీల ప్రకారం గ్రామానికి ఒక నర్సరీ ఏర్పాటు చేస్తున్నది. కూలీలకు ఉపాధితో పాటు ఊరూరా పచ్చదనం కోసం తలపెట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. హరిత ఉద్యమం కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 318 నర్సరీలు ఏర్పాటు చేశారు. వీటిలో 8 గ్రామాల్లో నీటి ఇబ్బందుల వల్ల ఇంకా నర్సరీలు ఏర్పాటు చేయలేదు. ఒక్కో నర్సరీలో 40 వేల నుంచి లక్ష మొక్కలు లక్ష్యంగా మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఇప్పటి వరకు రెండు విడుతల్లో 24 రకాల విత్తనాలు నర్సరీలకు అందజేశారు. టేకు మొక్కలతో పాటు అటవీ ప్రాంతానికి అవసరమయ్యే కానుగ, ఇప్ప, మర్రితో పాటు గ్రామానికి అవసరమయ్యే పండ్లు, పూల మొక్కలను పెంచుతున్నారు. ఇప్పటి వరకు 298లక్షల70 వేల మొక్కల పెంపకానికి గాను 272లక్షల74వేల బ్యాగుల్లో మట్టిని నింపడంతో పాటు విత్తనాలను నాటారు. వీటిలో 50 శాతానికి పైగా విత్తనాలు మొలకెత్తాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని అటవీభూములు, వ్యవసాయ భూముల గట్లు, బీడు భూములు, రహదారుల ఇరువైపుల, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాల్లోని ఖాళీ స్థలాలతో పాటు వివిధ ప్రాంతాలను గుర్తించి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భూ భాగంలో 33 శాతం అడవులు ఎక్కడా ఉంటాయో అక్కడ వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కలను పెద్ద ఎత్తున నాటి, అంతరించిపోతున్న అడవులను పెంపొదించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటితే రేపటి తరానికి వనజాతరలు అవుతాయనడంలో సందేహం లేదు.
సర్పంచులదే బాధ్యత...
ఉపాధి హామీ పథకం కింద నర్సరీల్లో పెంచిన మొక్కలను వర్షకాలంలో నాటి సంరక్షించాలి. ఈ బాధ్యత ఇకపై కొత్తగా ఏర్పడ్డ పంచాయతీ పాలకవర్గాలపై ఉంటుంది. సర్పంచులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న పంచాయతీల్లో 30 వేలకు పైగా, పెద్ద పంచాయతీల్లో 40 వేల మొక్కలను నాటేలా ప్రణాళికలు రూపొందించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటే వీలుగా పూలు, పండ్లు, టేకు, వేప తదితర మొక్కలను అందజేయనున్నారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచ్, కార్యదర్శిపై చర్యలు ఉంటాయి.
ప్రతిష్టాత్మకంగా ఐదో విడుత హరితహారం..
గడిచిన నాలుగు విడుతల హరితహారం కార్యక్రమాల్లో లక్ష్యసాధన వైఫల్యాలను గుర్తెరిగిన ప్రభుత్వం కూలీలకు ఉపాధితో పాటు మొక్కలు నాటే నైతిక బాధ్యత కలిగించేందుకు ఐదో విడుత హరితహారం కార్యక్రామాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న నర్సరీలను అధికారులు నిత్యం సందర్శిస్తూ వర్షకాలం నాటికి మొక్కలు నాటేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు.

357
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...