తేలనున్న భవితవ్వం


Sun,January 20, 2019 11:42 PM

- నేడే మొదటి విడుత పంచాయతీ పోలింగ్
- ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్
- మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలు వెల్లడి


మెదక్, నమస్తే తెలంగాణ : నేడు జరిగే తొలి విడుత పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగనున్నది. పోలింగ్ అనంతరం 2 గంటలకు వార్డుల వారీగా ఓట్లు లెక్కింపు జరిపి వార్డు మెంబర్లుగా ఎన్నికైన సభ్యులను ప్రకటిస్తారు. అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.

మొదటి విడుతలో జరిగే 6 మండలాలైన హవేళిఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రేగోడ్ మండలాల్లోని 122 సర్పంచ్ స్థానాలకు 319 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా మొదటి విడుతలో మొత్తం 154 గ్రామ పంచాయతీలు, 1,364 వార్డులకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా 32 గ్రామ పంచాయతీలు, 415 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా.. 122 సర్పంచ్ స్థానాలకు 319 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 949 వార్డు స్థానాలకు 2,066 మంది పోటీ పడుతున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి : డీపీవో
నేడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగనున్నది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దీనికి సంబంధించి 949 పోలింగ్ బూత్‌ల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీపీవో హనోక్ తెలిపారు. ఇప్పటికే పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది నియమించి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. 32 సర్పంచ్, 415 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ బరిలో 122 గ్రామ పంచాయతీలకు 319 మంది, వార్డు స్థానాల అభ్యర్థులు బరిలో 949 స్థానాలకు 2066 మంది పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం కౌంటింగ్ అనంతరం ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.

ఎన్నికల విధుల్లో 3,200 మంది అధికారులు...
ఎన్నికల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా అధికారులను ఎన్నికల కోసం గుర్తించి వారికి శిక్షణనిచ్చారు. నేడు జరిగే 154 గ్రామాల్లో మొదటి విడుత ఎన్నికల్లో స్టేజీ-1 అధికారులు 41 మంది, స్టేజీ-2 అధికారులు 159, ప్రిసైండింగ్ అధికారులు 1,500 మంది, అసిస్టెంట్ ప్రిసైండింగ్ అధికారులు 1,500 మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. వీరితే పాటు అదనంగా 10శాతం అదనపు సిబ్బందిని రిజర్వులో ఉంచారు.

రూట్ల వారీగా..
జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హవేళిఘనపూర్ మండలంలో జరిగే ఎన్నికల నిర్వహణకు పంచాయతీల వారీగా రూట్లలో వాహనాలు కేటాయించి బ్యాలెట్ బాక్సులు, ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లుకు కావాలసిన బ్యాలెట్ పేపర్లు, సిరా(ఇంక్), స్వస్తిక్ గుర్తులు వేసేందుకు స్టాంపులు తదితరు సామగ్రిని పోలింగ్ సిబ్బందికి అందించడంతో పల్లెలకు తరలివెళ్లారు.

పటిష్ట బందోబస్తు...
మొదటి విడుత జరిగే 6 మండలాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 550 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని, ఇందులో ఇద్దరు డీఎస్పీలు, 6గురు సీఐలు, 25 మంది ఎస్‌ఐలతో పాటు కానిస్టేబుళ్లు, పారా మిలటరీ, ఆర్మ్‌డ్ రిజర్వుడ్ పోలీసులు ఉన్నారని మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. అంతేగాకుండా 33 రూట్ మొబైల్ వాహనాలు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. 6 మండలాల్లో 32 సమస్యాత్మకమైన గ్రామాలుగా గుర్తించడం జరిగిందని వీటిపై పోలీస్‌శాఖ ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. ప్రతి రూట్‌లో మొబైల్ పార్టీలను ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ వాహనాలకు వీహెచ్‌ఎఫ్ సెట్‌ను ఏర్పాటు చేసి కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేశాం. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లు బందోబస్తులో ఉంటారు. 32 సమస్యత్మాకమైన గ్రామాల్లో 6 గ్రామాలను అతి సమస్యాత్మకమైన గ్రామాలుగా గుర్తించడం జరిగినందున ఆ గ్రామాల్లో 2 నుంచి 5 గురు వరకు కానిస్టేబుళ్లు బందోబస్తులో ఉంటారు. అవసరమైతే ఎస్సైని సైతం అక్కడే ఉంటారు. ప్రధానమైన పెద్ద గ్రామాల్లో కానిస్టేబుళ్లతో పాటు ఎస్‌ఐ అందుబాటులో ఉంటారని తెలిపారు.

325
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...