పల్స్ పోలియో విజయవంతం చేయాలి


Fri,January 18, 2019 11:40 PM

మెదక్ కలెక్టరేట్: పల్స్ పోలియో, బోదకాలు నివారణకు మాత్రల పంపిణీ (ఎండీఏ) (మాస్ అడ్మినిస్ట్రేషన్) కార్యక్రమాలను విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ కలెక్టర్ ధర్మారెడ్డి అధ్యక్షతన పల్స్ పోలియో, బోదకాలు నివారణకు మాత్రల పంపిణీ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాలో 0-5 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని, ఆ విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో వలస కూలీలు ఉండే ఆయా ప్రాంతాల్లో పోలియో నివారణ చుక్కలు వేయాలని సూచించారు. జిల్లాలో 0-5 సంవత్సరాలలోపు పిల్లలు 75,490 మందిని గుర్తించామని, వీరికోసం 542 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

ఈ కేంద్రాల పర్యవేక్షణ కోసం 84 మంది పర్యవేక్షకులను నియమించామని, 20 మోబైల్ టీంలు, 24 టూరిస్టు సైట్ వద్ద, పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో 105 చోట్ల వలస కూలీలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మొదటి రోజు పోలియో కేంద్రాల్లో, రెండవ, మూడవ రోజు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. బోదకాలు నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2,18,406 మంది పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అంగన్ కేంద్రాల్లో 42,921 మంది పిల్లలకు, వివిధ పాఠశాలలో 1,07,780 మందికి , ప్రభుత్వ కళాశాలల్లో 6406 మందికి, ప్రైవేటు కళాశాలలో 9190 మందికి మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ప్రతి ఒక్కరికీ డీఈసీ మాత్రలు (బోదకాలు నివారణ) పంపిణీ చేస్తామని డీఎంహెచ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి అంశాన్ని క్లుప్తంగా కలెక్టర్ అధికారులకు వివరించారు. కార్యక్రమంలో డీఐవో డా.సుమిత్ర, వైద్యులు డా.నవీన్, డా. శ్రీరాములు, డీఆర్ సీతారామరావు, ఎస్ మురహరి, డీడబ్ల్యూవో జ్యోతిపద్మ, డిప్యూటీ డీఎం హెచ్ అనిల్, అరుణశ్రీ, ఏఎంవో కుమారస్వామి, పాండురంగం పాల్గొన్నారు.

158
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...