కొలువుదీరిన ఏకగ్రీవ సర్పంచులు


Fri,January 18, 2019 12:33 AM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రెండోవిడుత పంచాయతీ నామినేషన్ల గడువు గురువారంతో పూర్తయింది. 38 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. కొల్చారంలో పోటా పోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఏకగ్రీవమైన పంచాయతీల వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర్ మండలంలో 9, చిలిపిచెడ్‌లో 4, శివ్వంపేటలో 11, కౌడిపల్లిలో 10, వెల్దుర్తిలో 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 38 గ్రామ పంచాయతీలలో సింగిల్ నామినేషన్ రావడంతో ఏకగ్రీవమయ్యాయి.

ముగిసిన రెండో విడుత నామినేషన్ల ఉపసంహరణ...
నర్సాపూర్ రూరల్ : నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. సర్పంచ్ బరిలో ఉన్న కొంత మంది అభ్యర్థులు తప్పుకోగా కొన్ని గ్రామాల్లో ఒక అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేయగా అధికారులు వారిని ఏకగ్రీవంగా తీర్మానిస్తూ ప్రమాణ స్వీకారం చేయించారు. నర్సాపూర్ మండల పరిధిలో 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 34 గ్రామ పంచాయతీల్లో 9 చోట్ల ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకున్నారు. ముందుగా కొన్ని గ్రామాల్లో సమావేశాన్ని నిర్వహించి సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, కొన్ని గ్రామాల్లో నామినేషన్ వేసిన తర్వాత ఉపసంహరించుకుని ఏకగ్రీవానికి నాంది పలికారు. ఇందులో 9 మంది సర్పంచుల ఏకగ్రీవం నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల సభ్యులే ఉండటం. 1)ఎర్రకుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన లకావత్ శాంతి, 2) ఎల్లారెడ్డిగూడ తండా గ్రామ పంచాయతీకి చెందిన నేనావత్ సంతోష, 3) తుల్జారాంపేట్ తండా గ్రామ పంచాయతీకి చెందిన మాలోత్ సౌమ్య, 4) గూడెంగడ్డ గ్రామానికి చెందిన జన్ముల నర్సింహులు, 5) సీతారాంపూర్ గ్రామానికి చెందిన గడ్డమీది పోచమ్మ, 6) అచ్చంపేట్ గ్రామానికి చెందిన గూడూరు సంగీత, 7) మహ్మదాబాద్ గ్రామానికి చెందిన మూడ్ పద్మ, 8) గొల్లపల్లికి చెందిన బోయిని కృష్ణ, 9)రంజ్యాతండా గ్రామ పంచాయతీకి చెందిన హలావత్ నర్సింగ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు వారితో ప్రమాణ స్వీకారం చేయించి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం గ్రామస్తులు వారిని శాలువాలు, పూలమాల లతో సత్కరించి మిఠాయిలు పంచుకున్నారు.

శివ్వంపేటలో...
శివ్వంపేట : మండలంలో మొత్తం 37 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 11 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మండల కేంద్రమైన శివ్వంపేట ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎదుల్లాపూర్ సర్పంచ్‌గా కల్లూరి కీర్తన హన్మంత్‌రావు, లచ్చిరెడ్డిగూడెం నుంచి ఎలెటి శ్రీనివాస్‌రెడ్డి, పోతులబోగుడ హరికిషన్‌రావు, దంతాన్‌పల్లి దుర్గేశ్, రూప్లాతండా మాలోతు మోతీ, బోజ్జ్యతండా బానోతు రాజు, లింగోజీగూడ నుంచి రవిలు ప్రమాణ స్వీకారం చేశారు. మిగతావారు శుక్రవారం వారి గ్రామాల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

పంచాయతీ పోరులో.. ఉపసంహరణ ఘట్టం ముగిసింది
కౌడిపల్లి : స్థానిక పంచాయతీ పోరులో ఉపసంహరణ ఘట్టం పూర్తికాగా, కౌడిపల్లి మండలంలో 10 గ్రామ పంచాయతీలు, చిలిపిచెడ్ మండలంలో 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన అభ్యర్థుల ఉపసంహరణకు ఉమ్మడి మండలం నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు, ఇరు పార్టీలకు చెందిన నేతలు తరలివచ్చారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేసరికే మండలంలో 8 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, ఉపసంహరణ రోజు మండలంలోని సదాశివపల్లి, కొత్త చెరువు తండా పంచాయతీల్లో సైతం ప్రత్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడంతో ఏకగ్రీవమయ్యాయి. మండలంలో కూకుట్లపల్లి సర్పంచ్‌గా చంగల్వ సుజాతకాంతారావు, బూరుగడ్డలో సర్పంచ్‌గా తాటి అంజమ్మ, మహ్మద్‌నగర్‌లో సర్పంచ్‌గా బాన్సువాడ దివ్యమహిపాల్‌రెడ్డి, రాయిలాపూర్‌లో సర్పంచ్‌గా కురుమ శేఖులు, ధర్మసాగర్‌లో సర్పంచ్‌గా శాగ ఆశమ్మ, శేరితండా సర్పంచ్‌గా రాజునాయక్, మనంతాయిపల్లి తండా సర్పంచ్‌గా పాత్లోత్ జీవ్లానాయక్, మర్రిచెట్టు తండా సర్పంచ్‌గా కాట్రోత్ బుజ్జి, సదాశివపల్లి సర్పంచ్‌గా పాండ్ర శోభనర్సింగ్‌రావు, కొత్తచెరువు తండా సర్పంచ్‌గా కాట్రోత్ పద్మలు ఏకగ్రీవంగా సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అలాగే చిలిపిచెడ్ మండలంలో 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం ఉమ్మడి కౌడిపల్లి మండలంలో 48 పంచాయితీలకు గాను 14 పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మెజార్టీ సభ్యుల అంగీకారంతో ఉప సర్పంచ్‌ను ఎన్నుకున్నారు. ఆ తరువాత సర్పంచులకు నియామక పత్రాలను రిటర్నింగ్ అధికారులు అందజేశారు. అనంతరం మండల ఎన్నికల అధికారి కరుణశీల బరిలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తులను కేటాయించారు.

చివరి రోజు భారీగా నామినేషన్ల ఉపసంహరణ ..
వెల్దుర్తి : నామినేషన్లకు చివరి రోజు గురువారం మండలంలో భారీగా నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. మండలంలో 30 గ్రామ పంచాయతీలు, 260 వార్డు స్థానాలు ఉండగా, సర్పంచులకు 129, వార్డు సభ్యులకు 623 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో ఒక్క వార్డుస్థానం నామినేషన్ తిరస్కరణకు గురికాగా, పోటీలో 129 సర్పంచ్ అభ్యర్థులు, 622 వార్డు సభ్యులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా రెండు రోజుల్లో 44 సర్పంచ్ నామినేషన్లు, 110 వార్డు సభ్యుల నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో 82 మంది సర్పంచ్ అభ్యర్థులు, 512 మంది వార్డు స్థానాలకు పోటీల్లో నిలిచారని సహాయ ఎన్నికల అధికారి కృష్ణన్ తెలిపారు. దీంతో పోటీల్లో నిలిచిన అభ్యర్థులకు తెలుగు అక్షరమాల ప్రకారం వారికి గుర్తులను కేటాయించి కార్యాలయ ఆవరణలో ప్రదర్శనకు ఉంచారు. ఇదిలా ఉండగా నాలుగు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో అధికారులు ఏకగ్రీవ పంచాయతీలుగా ప్రకటించారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో భారీ ఎత్తున అభ్యర్థులు, ప్రతిపాదించిన వారు, నాయకులు, కార్యకర్తల రాకతో ఎంపీడీవో కార్యాలయ ఆవరణ సందడిగా మారింది.

మండలంలో 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం...
మండలంలో 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో గురువారం నూతన పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరాయి. మండలంలోని చర్లపల్లి, శంశిరెడ్డిపల్లి, రామాయిపల్లి, బండపోసాన్‌పల్లి గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే వచ్చాయి. దీంతో నామినేషన్లు వేసిన అభ్యర్థులను సర్పంచ్, వార్డు సభ్యులుగా గుర్తిస్తూ స్టేజ్-2, రిటర్నింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో ప్రమాణ స్వీకారం చేయించి, ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

611
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...