మాజీ మంత్రి మల్యాల రాజయ్య కన్నుమూత


Tue,October 16, 2018 12:11 AM

అందోల్, నమస్తే తెలంగాణ: అందోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్యాల రాజయ్య (82) బ్రేన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. సోమవారం ఉదయం ఇంట్లో టిఫిన్ చేసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి పడిపోగా, వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని అపోలో దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లాలోని వెదిర గ్రామానికి చెందిన రాజయ్య హైదరాబాద్‌లోని సీతాఫల్ మండిలో స్థిరనివాసం ఉంటున్నారు. రాజయ్యకు భార్య అనసూయ, కుమారులు శ్రీనివాస్, రవీందర్, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గత కొంతకాలం క్రితం పెద్దకుమారుడు శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందారు.

రాజకీయ ప్రస్తానం
రాజకీయాలపై ఉన్న మక్కువతో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్‌టీఆర్ పిలుపుమేరకు న్యాయమూర్తి పదవీకి రాజీనామా చేసి, 1984లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ అరంగ్రేటం చేశారు. 1985లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో టీడీపీ తరపున అందోలు నియోజకవర్గం నుంచి పోటీలో దిగారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిలారపు రాజనర్సింహను ఓడించి, అందోలు ఎమ్మెల్యేగా గెలుపొంది రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టడంతో కేబినేట్‌లో ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. 1989లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సి.దామోదర్ చేతిలో ఓటమి పాలయ్యారు. 1994లో జరిగిన ఎన్నికల్లో దామోదర్‌పై గెలుపొంది, ఎమ్మెల్యేగా బాధ్యతలను చేపట్టారు. నారాచంద్రబాబు నాయుడు నాయకత్వంలో గృహానిర్మాణ శాఖ మంత్రిగా సేవలనందించారు. రాజయ్య పాలనలో అందోలు నియోజకవర్గ అభివృద్ది కోసం పాటుపడ్డారు. 1998లో సిద్దిపేట పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున రాజయ్య పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 1999లో ఎంపీ ఎన్నికల్లో మరోసారి సిద్దిపేట ఎంపీగా గెలుపొందారు. కొంతకాలం తర్వాత టీడీపీకి రాజీనామా చేసి, కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అందోలు నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా పనిచేశారు. గత కొన్నేండ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. రాజయ్య మృతి పట్ల నియోజకవర్గానికి చెందిన పలువురు రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు
మాజీ మంత్రి మల్యాల రాజయ్య సోమవారం మధ్యాహ్నం మృతి చెందడంతో, మంగళవారం హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండిలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాజయ్య మృతి పట్ల అందోలు నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పలువురు కార్యకర్తలు తమ సంతాపాన్ని ప్రకటించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

220
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...