తొలిపూజకు వేళాయే..


Thu,September 13, 2018 12:04 AM

- నేడు వినాయక చవితి
- నవరాత్రులకు ముస్తాబైన మండపాలు
- పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
- ఊరంతటికీ ఒకే విగ్రహం ప్రతిష్ఠించి ఆదర్శంగా నిలుస్తున్న మల్కాపూర్, కోనాయిపల్లి (పీబీ)
మెదక్/మెదక్ మున్సిపాలిటీ/తూప్రాన్ రూరల్ : వక్రతుండ మహాకాయ.. సూర్యకోటి సమప్రభ.. నిర్విఘ్నం కురుమే దేవా.. సర్వకార్వేశు సర్వదా..! అంటూ ఆది దేవుడిని పూజించే రోజు రానే వచ్చేసింది. భాద్రపద శుద్ధ చవితి మొదలు తొమ్మిది రోజుల పాటు పూజల కోసం గణనాథుని మండపాలు సిద్ధమయ్యాయి. మామిడి, ఉత్తరేణి,జిల్లేడు, కరవీర, టేకు, మారేడు, ములక, రేగు, దూర్వా, తులసీ, మద్ది, దేవదారు తదితర 21 రకాల పత్రాలతో విఘ్న రాజును అర్చించనున్నారు. పండుగ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచే మార్కెట్ వినాయక విగ్రహాలు, పూజా సామగ్రి మార్కెట్‌ను ముంచెత్తాయి. మండపాల నిర్వాహకులు భారీ విగ్రహాలను మండపాల వద్దకు తరలిస్తుండటంతో సందడి నెలకొంది. తూప్రాన్ మండలం మల్కాపూర్, కోనాయిపల్లి (పీబీ)లలో గ్రామం మొత్తానికి ఒక్కో మట్టి విగ్రహం చొప్పున ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు.

జిల్లా ప్రజలు వినాయక చవితి జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. జిల్లాలో ఎటుచూసినా వినాయక చవితి పండుగ సందడి కనిపిస్తున్నది. జిల్లా కేంద్రంతో పాటు తూప్రాన్, నర్సాపూర్ డివిజన్ కేంద్రాల్లో జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. గత నాలుగైదు రోజులుగా మండపాలు ఏర్పాటు చేయడంలో వినాయక మండలీల నిర్వాహకులు నిమగ్నమయ్యారు. వినాయక చవితి వచ్చిందంటే ఇల్లు, వాడ, ఊరు, పట్టణం అంతటా సందడి వాతావారణం నెలకొంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఉత్సహంగా పాల్గొనే పండుగ వినాయకచవితి.

జిల్లా కేంద్రంలో 200పైగా విగ్రహాలు..
జిల్లా కేంద్రంలో జేఎన్‌రోడ్డు, పోట్టి శ్రీరాములు చౌరస్తా , చమాన్, పెద్ద బజార్, న్యూమార్కెట్, కోలిగడ్డ, ఆటోనగర్, జంబికుంట, ఇందిరాకాలానీ, వెంకట్రావ్‌నగర్ కాలానీలతో పాటు పలు ప్రాంతాలల్లో సుమారు 200పైగా విగ్రహాలు ప్రతిష్టించనున్నారు.

మెదక్ మున్సిపాలిటీ : యువకుల ఉత్సాహం, చిన్నారులు, మహిళలు, పెద్దల పూజా కార్యక్రమాల నడుమ సందడిగా వీధికో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల వరకు యువత ఉత్సాహ భరితంగా వేడుకలు నిర్వహిస్తుంది. బహిరంగ మార్కెట్‌లో లభించే గణపతి విగ్రహాలు పై పూతలు, రంగులతో నిండి హానికరమైన విష పూరిత లోహాలు, కాడ్మియం పాదరసం సీసం వంటివాటి పరిమాణం అధికంగా ఉంటుంది. దీంతో నీటి వనరులు కలుషితమై మానవ మనుగడకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

విష రసాయనాలు వద్దు...
గణేశ్ విగ్రహాలను తరచూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వివిధ పదార్థాల నుంచి తయారు చేస్తారు. ఈ విగ్రహాలు రసాయనాలు సింథటిక్ రంగులతో పెయింట్ వేయడం వల్ల నీటిలో నిమజ్జనం చేసిన సమయంలో రంగులు విష స్వభావం నీటిలో కలుస్తున్నది. నీటిలో ఆమ్లత్వం పెంచి కాలుష్యానికి గురి చేస్తున్నది.

అమ్మకానికి సిద్ధంగా విగ్రహాలు..
జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో చవితి వేడుకలను కన్నలపండుగగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని మార్కెట్ ప్రాంతం, నవాబుపేట, రాందాస్ చౌరస్తా, బస్టాండ్, జంబికుంట, ఆటోనగర్, చిల్డ్రన్స్ పార్కు తదితర ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకల్లో భాగంగా చలువ పందిళ్లను నిర్మించారు. చలువ పందిళ్లకు మరింత శోభాయమానంగా కనిపించేందుకు నిర్వాహకులు ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇదిలావుండగా పట్టణంలోని హౌసింగ్‌బోర్డు, గాంధీనగర్, ఇందిరాపూరి కాలనీ ప్రాంతాల్లో వేడుకలను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాకుండా మార్కెట్ ప్రాంతం, నవాబుపేట, కోలిగడ్డ ప్రాంతాల్లో పలు ఆకృతుల్లో చూపరుల్ని ఆకట్టుకునే గణనాథుని విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.

మట్టి గణపతులను పూజించండి
మెదక్ ప్రతినిధి, నమస్తేతెలంగాణ: మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని తాజా, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. మెదక్ పట్టణానికి చెందిన వెంకటేశ్ మట్టి గణపతిని చర్చి గేటు వద్ద పద్మాదేవేందర్‌రెడ్డి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మట్టి గణపతులకు పూజలు నిర్వహించాలని సూచించారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్ ఉన్నారు.

214
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...