జగ్గారెడ్డిపై ఫైర్


Tue,September 11, 2018 11:20 PM

-భగ్గుమన్న మెతుకుసీమ
-పరువు తీశాడంటూ ఆగ్రహం
-ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు
-మద్దతిచ్చిన నేతల నుంచే వ్యతిరేకత
-జగ్గారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ మంత్రి సునీత దిష్టిబొమ్మల దహనం
సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:ఉమ్మడి మెదక్ జిల్లాలోని మహిళాలోకం ఒక్కసారిగా భగ్గుమన్నది. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మనుషుల అక్రమ రవాణా బాగోతం బయటపడడంతో ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి వ్యక్తులకు సమాజంలో తిరుగనివ్వొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్య పిల్లల పేరుతో ఓ మహిళా, ఇద్దరు పిల్లలను నకిలీ పత్రాలు సృష్టించి అమెరికా పంపించిన కేసులో జగ్గారెడ్డిని నగరంలోని నార్త్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జగ్గారెడ్డి అరెస్ట్‌పై సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో మహిళా లోకం తీవ్రంగా స్పందించింది. అగ్నిసాక్షిగా కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను, భారత చట్టాలను మోసం చేసిన జగ్గారెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగ్గారెడ్డికి మద్దతు తెలిపిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలకా్ష్మరెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆందోళనలు చేసిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జగ్గారెడ్డిని పరామర్శించడానికి వెళ్లే క్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహను పటాన్‌చెరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా నిన్న మొన్నటి వరకు రాజకీయ నాయకుడిగా చలామణి అయిన జగ్గారెడ్డి ఇంత పనిచేశాడని తెలియగానే అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో దిష్టిబొమ్మల దహనాలు...

మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన జగ్గారెడ్డికి మద్దతు తెలిపిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలకా్ష్మరెడ్డి తీరుపై మహిళలు నిప్పులు చెరిగారు. దేశ ద్రోహానికి పాల్పడిన జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడాన్ని రాజకీయ కక్ష్యగా వారు చిత్రీకరించడాన్ని తప్పుబట్టారు. ఓ మహిళ అయిన సునీతాలకా్ష్మరెడ్డి జగ్గారెడ్డికి ఎలా మద్దతు ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె గతంలో ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో వందలాది మహిళలు సునీతారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో ఐసీడీఎస్ రీజినల్ కోఆర్డినేటర్ లక్ష్మి ఆధ్వర్యంలో వందలాది మహిళలు జగ్గారెడ్డికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. రోడ్లు భవనాలశాఖ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఐబీ ఎదుట జగ్గారెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని శివ్వంపేటలో కూడా మహిళలు జగ్గారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

నిరసనలు చేపట్టిన కాంగ్రెస్ నేతల అరెస్ట్

జగ్గారెడ్డికి మద్దతుగా నిరసనలు తెలిపిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సునీతాలకా్ష్మరెడ్డి సంగారెడ్డిలోని జగ్గారెడ్డి ఇంటికి వచ్చి తిరిగి ర్యాలీగా రోడ్డుమీదకు వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని పుల్కల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సునీతారెడ్డితో పాటు మహిళా కాంగ్రెస్ నాయకులు శశికళ యాదవరెడ్డి, గోదావరి అంజిరెడ్డి, జిన్నారం జడ్పీటీసీ ప్రభాకర్‌లు కూడా ఉన్నారు. ఇదిలాఉండగా హైదరాబాద్‌లో జగ్గారెడ్డిని కలుసుకోవడానికి వెళ్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహను పటాన్‌చెరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా సంగారెడ్డి పట్టణంలో జగ్గారెడ్డికి వ్యతిరేకంగా అతడి దిష్టిబొమ్మ దహనం చేసి ర్యాలీ చేపట్టిన టీఆర్‌ఎస్ నాయకురాలు లక్ష్మితో పాటు పలువురు మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తరువాత వదిలిపెట్టారు.

మమ్మల్ని మోసం చేశాడు..

అధికారంలో ఉండగా అధికారం కోల్పోయిన తరువాత జగ్గారెడ్డి మమ్మల్ని నిలువునా మోసం చేశాడని గతంలో అతడితో సన్నిహితంగా ఉన్న ప్రస్తుత సంగారెడ్డి మున్సిపల్ వైస్‌చైర్మన్ గోవర్ధన్‌నాయక్ ఆరోపించారు. తమ వద్ద లక్షల రూపాయలు తీసుకుని డబ్బులు అడిగితే భూములు ఫేక్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి చేతులు దులుపుకొన్నారని, ఇప్పటికీ ఆ డబ్బులు రాలేదని ఆరోపించారు. బీరు, బిర్యానీతో కార్యకర్తలను వెనుక తిప్పుకుని అందరి భవిష్యత్ నాశనం చేశారని ఆరోపించారు. గతంలో జగ్గారెడ్డి సన్నిహితుడైన శంకర్‌గౌడ్ కూడా మీడియాతో మాట్లాడారు. కల్లు గౌడ సొసైటీలను బెదిరింపులకు పాల్పడి లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. ఇదేమని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి దుకాణాలు మూయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అక్రమాలు ఎన్నో ఉన్నాయని, కార్యకర్తల నుంచి కూడా కోటి రూపాయలు తీసుకుని ఇవ్వలేదన్నారు. డబ్బులు ఇచ్చిన కార్యకర్తలు చనిపోయినా కుటుంబ సభ్యులకు డబ్బులు ఇవ్వలేదన్నారు. కాగా జగ్గారెడ్డి కబ్జాలు, అవినీతి, అక్రమాలు బయటపెట్టడానికి మోస పోయిన వారు బయటకు వస్తారని ఆయన వెల్లడించారు. మహిళలను విదేశాలకు అక్రమంగా తరలించి జగ్గారెడ్డి సంగారెడ్డి పరువు తీశారని మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మి నిప్పులు చెరిగారు.

జగ్గారెడ్డిని శిక్షించాలి

సంగారెడ్డి టౌన్ : విదేశాలకు మనుషులను అక్రమ రవాణా చేసిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కఠినంగా శిక్షించాలని స్త్రీ, శిశు సంక్షేమశాఖ రీజినల్ కో ఆర్డినేటర్ లక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని ఐబీ నుంచి కొత్త బ స్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ సంగారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన జగ్గారెడ్డి అక్రమ సంపాదన కోసం మహిళలను విదేశాలకు ఎగుమతి చేశాడని ఆరోపించారు. తన భార్య పేరుతో ఇతర మహిళలను విదేశాలకు తరలించాడని విమర్శించారు. సొంత భార్య, పిల్లలకు బదులు ఇతరులను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన జగ్గారెడ్డి అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదనకు నీచమైన పనులు చేశాడన్నారు. సంగారెడ్డి పరువును దేశ విదేశాలలో తీసిన జగ్గారెడ్డిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దిష్టిబొమ్మ దహనం

నర్సాపూర్, నమస్తే తెలంగాణ/శివ్వంపేట: అక్రమంగా విదేశాలకు మహిళలను రవాణా చేసిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ వద్ద జగ్గారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. అదేవిధంగా శివ్వంపేట మండల కేంద్రంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పిట్ల సత్యనారాయణల ఆధ్వర్యంలో జగ్గారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. నర్సాపూర్ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు హబీబ్‌ఖాన్, పరమేశ్వర్‌రాజు, నాగేశ్, నిరంజన్‌గౌడ్, రవీందర్‌గౌడ్, ప్రభాకర్, నరేందర్‌రెడ్డి, ఆంజనేయులు, వెంకాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. శివ్వంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు పూల అర్జున్, సారా శివరామాగౌడ్, కొండల్‌రావు, దావూద్, దమోదర్‌రెడ్డి, సంజీవచారి, హర్జ్యనాయక్‌లతో పాటు మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

మాజీ మంత్రి సునీతారెడ్డి దిష్టిబొమ్మ దహనం

నర్సాపూర్, నమస్తే తెలంగాణ: విదేశాలకు మహిళలను అక్రమంగా రవాణా చేసిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మద్దతు పలకడాన్ని నిరసిస్తూ నర్సాపూర్ పట్టణంలోని సునీతాలకా్ష్మరెడ్డి కాలనీకి చెందిన మహిళలు మంగళవారం స్థానిక బస్టాండ్ వద్ద మాజీ మంత్రి సునీతారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన మహిళలు మాట్లాడుతూ నకిలీపాసు పోర్టులతో మనుషులను అక్రమంగా రవాణా చేసిన సంగారెడ్డి మాజీ ఎమ్మెలే జగ్గారెడ్డికి మద్దతు పలకడం విచారకరమని, అలాంటి వారికి సునీతాలకా్ష్మరెడ్డి మద్దతు పలకడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారు సునీతారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

230
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...