టీఆర్‌ఎస్ దూకుడు


Sun,September 9, 2018 11:36 PM

-గులాబీ శ్రేణుల ముమ్మర ప్రచారం
-గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశం
-దుబ్బాక, అందోల్ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీ
-ఇంకా పత్తాలేని ప్రతిపక్షాల ముచ్చట
-గ్రూపులతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ
-ఉనికి లేని టీడీపీ... అభ్యర్థులు కరువైన బీజేపీ
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి జిల్లాలో ఏ నోట విన్నా గులాబీ మాటే..! రచ్చబండ...! హోటళ్ల వద్ద...! చౌరస్తాల్లో..! టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపైనే చర్చ. ముందస్తు ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ గందరగోళంలో పడింది. టీడీపీది ఉనికే లేదు. ఇక మిగతా పార్టీలవి అంతంతే ఉంది. ప్రచారపర్వంలోకి టీఆర్‌ఎస్ దూకుడుగా వెళ్తుంది. హుస్నాబాద్ సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దూసుకెళ్తున్న వైనంపై నమస్తే తెలంగాణ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఉమ్మడి జిల్లాలో గులాబీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ప్రచారపర్వంలోకి దూసుకెళ్తున్నారు. అసెంబ్లీ రద్దు చేయగానే టీఆర్‌ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ గులాబీ శ్రేణులు సంబురాలు నిర్వహించుకుని ప్రచార పర్వంలోకి వెళుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పది శాసనసభ నియోజకవర్గాలు ఉండగా తొమ్మిది స్థానాలకు సిద్దిపేట జిల్లాలో అంతర్భాగంగా ఉన్న జనగామ, హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఒక జహీరాబాద్ మినహా అన్ని నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో రెట్టింపు ఉత్సాహంతో టీఆర్‌ఎస్ శ్రేణులు ముందుకు కదులుతున్నారు. తొలి ఆశీర్వాదసభను హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంగా టీఆర్‌ఎస్ నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు.

అదే రోజు గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిపించే బాధ్యత మీరే తీసుకోవాలని నాయకులకు సూచించారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కార్పొరేషన్ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన ప్రచార వ్యూహంపై చర్చించారు. సిద్దిపేట నియోజకవర్గంలో ముఖ్య నాయకులతో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమావేశమై ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించారు. ఇప్పటికే పలు దాఫాలుగా సమావేశమైన మంత్రి ప్రచారపర్వంలో ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించాలని సూచించారు.

దుబ్బాక శాసనసభ స్థానానికి రామలింగారెడ్డి పేరును ప్రకటించడంతో సంబురాలు మిన్నంటాయి. భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. మెదక్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్‌లో చిలుముల మదన్‌రెడ్డి, నారాయణఖేడ్‌లో మహారెడ్డి భూపాల్‌రెడ్డి, సంగారెడ్డిలో చింతా ప్రభాకర్, పటాన్‌చెరువులో గూడెం మహిపాల్‌రెడ్డి, అందోల్‌లో జర్నలిస్టు క్రాంతికిరణ్‌లు ప్రచారాన్ని షురువు చేశారు. నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించి ప్రచార వ్యూహాలపై చర్చించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లి పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని నాయకులకు, కార్యకర్తలకు అభ్యర్థులు సూచిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌కి శ్రీరామ రక్ష అని సూచిస్తున్నారు. కాగా ములుగు మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ ప్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించి బైక్ ర్యాలీ చేపట్టారు. జగదేవ్‌పూర్ మండలంలో ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రచార రథాన్ని తయారు చేశారు. ఆయా గ్రామాల్లో ఈ ప్రచార రథం ద్వారా ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేపట్టేందుకు సిద్ధం చేశారు.

ప్రతిపక్ష పార్టీల్లో వణుకు....
ముందస్తు ఎన్నికలకు ముందుగానే టీఆర్‌ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల్లో వణుకు పుట్టింది. ఏ నియోజకవర్గం నుంచి ఎవరిని నిలుపాలో అనే గందరగోళ పరిస్థితుల్లో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతుంది. అభ్యర్థుల ఎంపికలోనే కాంగ్రెస్ తల పట్టుకుంటుంది. పైగా ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌లో గ్రూపులలొల్లి ఉండే ఉంది. ఒక వర్గానికి ఇస్తే మరో వర్గం లొల్లికి సిద్ధంగా ఉంది. గ్రూపుల గొడవతో కాంగ్రెస్ ఎటు తేల్చుకోలేకపోతుంది. కాగా పటాన్‌చెరువు నియోజకవర్గంలో బీజేపీ నుంచి నందీశ్వర్‌గౌడ్ కాంగ్రెస్‌లోకి చేరుతుండడంతో అక్కడ అసమ్మతి మరింత ఎక్కువైంది. ఉనికి కోల్పోయిన టీడీపీది అంతే సంగతులు. ఇక బీజేపీ నుంచి పోటీ చేయడానికి నాయకులు అంతంత మాత్రంగానే ఉన్నారు. ఏదేమైన కారు జోరుకు ప్రతిపక్ష పార్టీలన్నీ బేజారవుతున్నాయి.

262
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...