మెదక్ అర్బన్: మినీ అంగన్వాడీ టీచర్లకు టీఆర్ఎస్కేవీ అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్ల రాష్ట్ర అధ్యక్షురాలు అడెపు వరలక్ష్మి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐబీ అతిథి గృహంలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకురాలు పట్లోళ్ల మల్లిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మినీ అంగన్వాడీ టీచర్లను సమైక్యాంధ్ర రాష్ట్రంలో గుర్తించలేదన్నారు. రాష్ట్రంలో 4వేల మంది మినీ అంగన్వాడీ టీచర్లు పనిచేస్తున్నారన్నారు. మినీ అంగన్వాడీల వేతనాలు, వారి సమస్యలను అనేకసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారన్నారు. టీఆర్ఎస్కేవీకి అనుబంధంగా మినీ అంగన్వాడీ టీచర్ల కార్మికసంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. అనంతరం మినీ అంగన్వాడీ టీచర్ల నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా నర్సాపూర్ మండలానికి చెందిన ఎం.వీణ, ఉపాధ్యక్షురాలిగా రేణుకా, ప్రధాన కార్యిదర్శిగా ఎన్. బూలి, కార్యదర్శిగా డి. విజయ, కోశాధికారిగా రుక్మిణి, కార్యనిర్వాహణ అధికారిగా శోభలను ఎన్నుకున్నారు.