భారీ మెజార్టీయే మన లక్ష్యం


Sun,September 9, 2018 11:34 PM

సంగారెడ్డి, నమస్తేతెలంగాణ ప్రధాన ప్రతినిధి : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం ఖాయమైపోయిందని అయితే భారీ మెజార్టీ లక్ష్యంగా అభ్యర్థులు పనిచేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు, మెదక్, జహీరాబాద్ ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లతో మంత్రి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఎన్నికల ప్రచార వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రగతిపై ప్రజల ముందుకు వెళ్లాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించాలన్నారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇతర రాష్ర్టాల ప్రజాప్రతినిధులు, అధికారులు ఇక్కడకు వచ్చి పనులు పరిశీలిస్తున్నారు. అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇవే అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు పోటీ పడాలని ఇదే సందర్భంలో తప్పుడు ప్రచారాలతో జనంలోకి వస్తున్న ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల వారీగా కార్యాచరణ రూపొందిస్తే ఆ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుందామని సూచించారు.

భారీ మెజార్టీ లక్ష్యంగా పనిచేయాలి
ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి సీఎం కేసీఆర్ తిరిగి పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని 10అసెంబ్లీ నియోజక వర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది. అయితే తెలంగాణలోనే పాత మెదక్ జిల్లా చరిత్ర సృష్టించాలని ఇందుకు అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఉమ్మడి జిల్లా నుంచి సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహించడం మన అదృష్టమని, ప్రస్తుతం 9అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ప్రాతినిథ్యం వహించిందని రాబోయే రోజుల్లో 10నియోజకవర్గాలు మనవే ఉండాలని ఇందుకోసం అభ్యర్థులు భాగా కష్టపడి పనిచేయాలన్నారు.

ఎంపీలు నివేదికలు ఇవ్వాలి...
ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి ప్రజల స్పందనపై ప్రత్యేకంగా నివేదికలు రూ పొందించి అందించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. మెదక్, జహీరాబాద్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌లకు ప్రజల్లో మంచి గౌరవం ఉన్నదని, అయితే ప్రజలు ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారో గ్రామస్థాయిలో తెలుసుకోవాలని సూచించారు. ఉమ్మ డి జిల్లా ప్రచార బాధ్యతలు తనపై ఉన్నదని, ఈ క్రమం లో జిల్లా సత్తా ఏమిటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇందుకోసం పార్టీ అభ్యర్థులు, ఎంపీలు, ఇతర నాయకులు బాధ్యతగా పనిచేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, జడ్పీచైరపర్సన్ రాజమణి, ఉమ్మడి జిల్లా టీఆర్ ఎస్ అధ్యక్షుడు మురళియాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్, భూపాల్‌రెడ్డి, రామలింగారెడ్డి, మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, అందోల్ అభ్యర్థి క్రాంతికిరణ్ పాల్గొన్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...