పారదర్శకంగా ఓటరు జాబితా


Sun,September 9, 2018 11:33 PM

-నేటినుంచి 25 వరకు సవరణలు, చేర్పులు, మార్పులు
-15, 16 తేదీల్లో ఓటరు నమోదు కోసం స్పెషల్ డ్రైవ్
-పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులకుకనీస సౌకర్యాలు కల్పించాలి
-బూత్ లెవల్ అధికారుల సమావేశంలో కలెక్టర్ ధర్మారెడ్డి
మెదక్ మున్సిపాలిటీ : 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు నమోదుకు అర్హులని, తప్పులు లేకుండా పారదర్శకంగా ఓటరు జాబితా తయారు చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని మంజీరా గార్డెన్స్‌లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బూత్ లెవల్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 01-01-2018 నాటికి 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదుకు అర్హులన్నారు. ఈ నెల 10 నుంచి 25 వరకు సవరణలు, చేర్పులు, మార్పులు చేయాలని సూచించారు.

అంతేకాకుండా 15, 16 తేదీల్లో ఓటరు నమోదు కోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఆ రోజుల్లో గ్రామ సభలు నిర్వహించాలని, బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అయితే ఈ నెల10వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రదర్శిస్తామన్నారు. ప్రతి బూత్‌లో ఓటరు జాబితాను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రదర్శించిన ఓటరు జాబితాలో పేర్లు లేని వారు నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు, వేరేచోట స్థిర నివాసం ఏర్పర్చుకున్న వారి పేర్లను తొలిగించాలని సూచించారు. తొలిగించే వారి పేర్లను ఫారం 7 ద్వారా నోటీసులు అందించిన అనంతరం తొలిగించాలని సూచించారు. ప్రతి రాజకీయ పార్టీ నేతలకు బూత్ లెవల్ ఏజెంట్‌ను నియమించాలని, ఇది వరకే సూచించడం జరిగిందన్నారు.

పోలింగ్ బూత్‌ల వద్ద వికలాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
జిల్లాలో 5500 మంది వికలాంగులకు పింఛన్లు అందజేస్తున్నామని, కానీ సుమారు 3వేల మంది మాత్రమే ఓటర్లుగా ఉన్నారని, మిగతా వారిని సైతం గుర్తించి నమోదు చేయాలని అధికారులకు, బీఎల్‌వోలకు సూచించారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులకు కనీస సౌకర్యాలను కల్పించాలని తెలిపారు. ప్రతి బీఎల్‌వో పోలింగ్ కేంద్రాలను ఒకసారి పరిశీలించి సౌకర్యాలు ఉన్నాయో లేదో తహసీల్దార్లకు నివేదిక అందజేయాలని సూచించారు. ముఖ్యంగా వికలాంగులకు పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపు ఏర్పాటు చేయాలని, ఏ బూత్‌లో ర్యాంపు లేదో ఆ వివరాలను తహసీల్దార్లకు అందజేయాలని బీఎల్‌వోలను ఆదేశించారు. ఇదిలావుండగా పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, కరెంటు కనెక్షన్, సాకెట్స్ సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చూసి వెంటనే తహసీల్దార్లకు నివేదిక పంపాలన్నారు.

పేర్లు తప్పుగా ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి..
మెదక్ నియోజకవర్గంలో 42వేలు పేర్లు తప్పుగా ఉన్న సమస్యలు ఉన్నాయన్నారు. పేరు, తండ్రి పేరు, భర్త పేరు ఇలా 2వేల వరకు ఉన్నాయని, 40వేల వరకు పాత ఐడీ కార్డులతో ఓటరు ఐడీ కార్డులు ఉన్నాయన్నారు. అందులో పాత నంబర్లు, పాత సిరీస్‌లో ఉన్నాయని, అయితే వాటిని కొత్త కంప్యూటర్లు గుర్తించడం లేదన్నారు. ఇక నుంచి అలా కాకుండా కొత్త ఐడీ కార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇదిలావుండగా ఎన్నికల సమయం దగ్గరపడుతున్నందున వచ్చే నెల 6వ తేదీలోగా విచారణ పూర్తి చేయాలని, నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జేసీ నగేశ్, ఆర్డీవో వీరబ్రహ్మచారి, మెదక్ నియోజకవర్గ తహసీల్దార్లు రవికుమార్, వెంకటేశం, యాదగిరి, రాజేశ్వర్‌రావు, జంగేశ్వర్, పద్మారావు, ఇతర అధికారులు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

177
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...