తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు కొత్తగా 52 వైద్య పోస్టులు


Sun,September 9, 2018 12:25 AM

-ప్రభుత్వం రద్దుకు ముందే ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్
-ప్రత్యేక వైద్య నిపుణుల కేటాయింపు
-కొత్త పోస్టుల భర్తీతో మెరుగైన వైద్య సాయం
తూప్రాన్‌రూరల్: తూప్రాన్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం దవాఖానలో మరిన్నీ మెరుగైన వైద్య సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. తూప్రాన్‌లోని 50 పడకల ప్రభుత్వ దవాఖానలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించడం కోసం గాను 52 కొత్త వైద్య పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రద్దుకు ముందే తెలంగాణ ప్రభుత్వం ఈ పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద ప్రజానీకానికి కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించాలన్న సదుద్దేశంతో తూప్రాన్‌లో ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం దవాఖానను ప్రభుత్వం మంజూరు చేసింది.

రూ.9కోట్ల నిధులతో 50 పడకల దవాఖానను అత్యాధునిక పద్ధతులతో నిర్మించింది. సాధారణ ప్రసూతి, పిడియాట్రిక్, ఫిజియోథెరపీ వైద్య సేవలను అందించడానికి వీలుగా అన్ని హంగులతో సామాజిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణాన్ని చేపట్టింది. ప్రారంభం నుంచి సాధారణ వ్యాధులు, ప్రసూతికి సంబంధించిన వైద్య సేవలు, చిన్నపిల్లలకు వచ్చే వ్యాధులకు వైద్య చికిత్సలు అందిస్తూ వస్తున్నారు. దవాఖానలో డ్యూటీ మెడికల్ ఆఫీసర్(డీఎంవో)లు నలుగురు, పిడియాట్రిక్ వైద్యుడు, గైనకాలజిస్టు, అనస్తియా వైద్యుడు, 16 మంది స్టాఫ్ నర్సులు, ఎక్స్‌రే, ఫిమేల్ నర్స్ ఆర్డర్లీ(ఎఫ్‌ఎన్‌వో)లు, ఇతర వైద్య సిబ్బందితో దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

ప్రతిరోజూ 300 మంది ఔట్ పేషంట్లు(వోపీ)..
తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రం దవాఖానకు ప్రతిరోజూ సరాసరి 300 మందికి తగ్గకుండా సాధారణ వ్యాధులకు సంబంధించి వైద్య సాయం పొందుతున్నారు. దవాఖానలో వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు వైద్య పరీక్షలను నిర్వహిస్తూ వారికి మందులను పంపిణీ చేస్తున్నారు.
ఇన్‌పేషంట్లు..
దవాఖానకు సాధారణ డెలివరీల కోసం వచ్చే మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. సాధారణ ప్రసవాలు జరిగిన మహిళలలతో పాటు వివిధ వ్యాధులతో బాధపడుతూ వచ్చే రోగులు వైద్య పరీక్షలను నిర్వహించుకోవడంతో పాటే అవసరమైతే దవాఖానలోనే ఉండి చికిత్సలు పొందుతున్నారు.
52 కొత్త వైద్య పోస్టులు మంజూరు..
తూప్రాన్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం దవాఖానలో మెరుగైన వైద్య సేవలను అందించాలన్న దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం కేటాయించిన వైద్య సిబ్బంది కంటే అదనంగా మరో 52 కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఈ పోస్టులను ప్రభుత్వం రద్దుకు ముందే మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

పోస్టుల వివరాలు...
సివిల్ సర్జన్ నిపుణులు-03, డిప్యూటీ సివిల్ సర్జన్ నిపుణులు- 07, అసిస్టెంట్ సివిల్ సర్జన్‌లు- 13, దంత వైద్య నిపుణులు- 01, సీనియర్ అసిస్టెంట్-01, జూనియర్ అసిస్టెంట్-01, గ్రేడ్-2ఫార్మాసిస్ట్-02, ల్యాబ్ టెక్నిషియన్స్-02, రేడియోగ్రాపెర్-01, డార్క్‌రూం అసిస్టెంట్-01, జూనియర్ అనస్తియా-01, గ్రేడ్-2 నర్సింగ్ సూపరిండెంట్-01, హెడ్ నర్స్‌లు-02, స్టాఫ్ నర్స్‌లు -14, మల్టీపర్పస్ అసిస్టెంట్‌లు (మహిళలు)-02, పోస్టులను మంజూరు చేస్తూ ఈ నెల 4న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మెరుగైన వైద్య సేవలు..
ప్రభుత్వ దవాఖానలో మంచి వైద్య సేవలు అందిస్తున్నారు. కొత్త వైద్యులు వస్తే మరిన్నీ సేవలు అందుతాయి. ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానలకు వెళ్లే అవసరం ఉండదు. వైద్య పరీక్షలతో పాటు మందులను ఇస్తున్నారు. వ్యయ ప్రయాసలు తప్పాయి.
- చాకలి లింగం
వైద్య సమస్యలు తీరుతాయి...
అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉన్నట్లయితే కార్పొరేట్ దవాఖానలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే మెరుగైన వైద్యం లభిస్తుంది. వైద్య నిపుణులు ఉండటంతో ఆపరేషన్‌లు ఇక్కడే జరుగుతాయి. ఎలాంటి వ్యాధినైనా నిర్ధారించుకొని వైద్య సేవలను పొందడానికి ఆస్కారం ఉంటుంది.
- లంబ శంకర్

168
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...