కంటివెలుగును సద్వినియోగం చేసుకోవాలి


Fri,September 7, 2018 12:36 AM

మనోహరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం చెట్లగౌరారంలో గురువారం జరిగిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు ఎంత మంది చేయించుకున్నారు. రికార్డులను ఏ విధంగా నమోదు చేస్తున్నారు. తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేయనున్నట్లు తెలిపారు. గ్రామంలో చాటింపు చేయకుండానే కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారని, దీంతో గ్రామంలోని చాలా మందికి ఈ కార్యక్రమం నడుస్తున్నట్లు తెలియదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా గ్రామంలోని ప్రజలు వివిధ వ్యాధులతో అవస్థలు పడుతున్నారని కలెక్టర్‌కు వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్ వైద్యుల తీరుపై మండిపడ్డారు. చాటింపు చేయకుంటే ప్రజలకు ఏ విధంగా తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రోగాలు వ్యాపిస్తున్నా.. ఇంత వరకు ఎందుకు వైద్య శిబిరం ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కాగా గ్రామంలో ఇదివరకే రెండుమార్లు వైద్య శిబిరం ఏర్పాటు చేసి వ్యాధి గ్రస్తుల రక్త నమూనాలను సేకరించి, మందులను పంపిణీ చేశామని, రిపోర్టులు రావాల్సి ఉందని కలెక్టర్‌కు తెలిపారు. వెంటనే గ్రామంలో మరోమారు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో టి. శ్యాంప్రకాశ్, తహసీల్దార్ నజీబ్ అహ్మద్, వీఆర్‌వో జయభారత్‌రెడ్డి, ఎంపీటీసీ మెట్టు బాలకృష్ణారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...