మెట్ట ప్రాంతం రూపు మారింది


Thu,September 6, 2018 12:06 AM

-టీఆర్‌ఎస్ పాలనలో హుస్నాబాద్ సమగ్రాభివృద్ధి
-కోట్లాది రూపాయలతో మారిన రూపురేఖలు
-శరవేగంగా గౌరవెల్లి రిజర్వాయర్ పనులు
-ముమ్మరంగా శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు ఆధునీకరణ
-మహాసముద్రంగండి పునరుద్ధరణలో సాకారమైన దశాబ్దాల కల
-అద్దాల్లా రోడ్లు.. మండలాల్లో గోదాములు
-40 కొత్త గ్రామ పంచాయతీలు
-రూ. 17 కోట్లతో సమీకృత భవన నిర్మాణాలు..

ఎప్పుడూ కరువు పరిస్థితులతో సతమతమయ్యే మెట్ట ప్రాంతం హరితవర్ణ శోభితమైంది..! ఆరుతడి పంటలకే అష్టకష్టాలు పడే రైతన్నలు మిషన్ కాకతీయ పుణ్యమా అని మెతుకు పంటను పండిస్తున్నరు..! గత పాలకుల వివక్షకు గురైన హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ పాలనలో సమగ్రాభివృద్ధి చెందుతున్నది. కోట్లాది రూపాయల నిధుల వరద పారిస్తుండటంతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. 8.23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న గౌరవెల్లి రిజర్వాయర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మహాసముద్రం గండి పునరుద్ధరణతో రైతన్నల దశాబ్దాల కల సాకారమైంది. రూ. 23 కోట్లతో శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. అద్దాల్లాంటి రోడ్లు.. హైమాస్ట్ లైట్లు.. ఇంటింటికీ మరుగుదొడ్డి.. రూ.17 కోట్లతో సమీకృత భనవ నిర్మాణాలు.. పాలిటెక్నిక్ కాలేజీ.. మినీట్యాంక్ బండ్‌గా ఎల్లమ్మ చెరువు.. మండలాల్లో గోదాములు.. ఇలా చెప్పుకుంటూ పోతే 60 ఏండ్లలో జరుగని అభివృద్ధి నాలుగేండ్లలోనే కండ్ల ముందు సాక్షాత్కరింపబడింది. ఇక సంక్షేమ పథకాలు సరేసరి..! కొత్తగా 40 గ్రామపంచాయతీలు కూడా ఏర్పాటయ్యాయి. అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిన హుస్నాబాద్ నుంచి సీఎం కేసీఆర్ ప్రజల ఆశీర్వాద సభలకు శ్రీకారం చుడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
-సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ


జిల్లాల పునర్విభజనతో హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలోకి విస్తరించి ఉంది. సిద్దిపేట జిల్లాలో నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్‌తో పాటు అక్కన్నపేట, కోహెడ మండలాలు, కరీంనగర్ జిల్లాలో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు, వరంగల్ అర్బన్ జిల్లాలో ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు ఉన్నాయి. భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌ల సహకారంతో స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి పనులు చేపట్టడంతో ఆ ఫలితాలు ప్రజలకు అందుతున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో ఇక్కడ అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉండేది. గిరిజన తండాలను మదిర గ్రామాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ఆ గ్రామాలకు మహర్దశ వచ్చింది. ఎన్నో ఏండ్లు ఎదురుచూస్తున్న ప్రజలకు కొద్ది నెలల కిందనే పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలో 40 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యాయి.

నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తున్నది. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక్కడి ప్రాంత రైతుల చిరకాల కోరిక అయిన గౌరవెల్లి రిజర్వాయర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహాసముద్రంగండి చెరువు పనులు పూర్తయ్యాయి. శనిగరం మధ్యతరహా ప్రాజెక్టును సుందరీకరిస్తున్నారు. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. హుస్నాబాద్ పట్టణంలో సెంట్రల్ లైటింగ్, గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు పరిహారం, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మినీట్యాంక్ బండ్‌గా సుందరీకరణ తదితర పనులు పూర్తవుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో స్థానిక శాసనసభ్యుడు వొడితెల సతీశ్‌కుమార్ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న వైనంపై
నమస్తే తెలంగాణ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం....

మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం...

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, భీమదేవరపల్లి, చిగురుమామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి మండలాల్లోని 332 చెరువు పనులకు గానూ రూ. 144.32కోట్లు మంజూరు చేసి చెరువు పనులు చేపట్టింది. దాదాపుగా చెరువు పనులన్నీ కూడా పూర్తయ్యాయి. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ కోసం ప్రభుత్వం రూ.6.55కోట్లు కేటాయించింది. ఇటీవలే మరిన్ని నిధులు కూడా మంజూరు చేయడంతో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. హుస్నాబాద్ పట్టణానికి తలమాణికంగా ఈ చెరువు నిలవనున్నది. పట్టణ ప్రజలకు ఎంతో ప్రయోజనకరం కానుంది.
కోహెడ మండలంలోని శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు సుందరీకరణ కోసం రూ. 23కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం త్వరితగతిన పనులు చేపట్టింది. ఈ చెరువు కింద సుమారుగా 3 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగులోకి రానుంది. పోరెడ్డిపల్లి వద్ద వాగుపై చెక్‌డ్యాం, బ్రిడ్జి నిర్మాణానికి రూ. 13కోట్లు, గుండారెడ్డిపల్లి వద్ద చెక్‌డ్యాం నిర్మాణానికి రూ. 3కోట్లు కేటాయించి పనులు పూర్తి చేయించింది. సింగరాయ ప్రాజెక్టుకోసం రూ. 5కోట్లు కేటాయించింది. .

శరవేగంగా గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు..

మెట్టప్రాంతమైన హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నది. ఈ రిజర్వాయర్‌ను 1.14టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని మొదట్లో ప్రతిపాదనలు చేశారు. కానీ సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేయించి 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని సూచించారు. రిజర్వాయర్ నిర్మాణం వల్ల గుడాటిపల్లి, తెనుగుపల్లి, మద్దెలపల్లి, సౌలపల్లి, చింతలతండా తదితర గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. సుమారుగా రూ. 2వేల కోట్లతో రిజర్వాయర్ పనులను చేపట్టింది. భూనిర్వాసితులకు రూ. 104కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. ఈ రిజర్వాయర్ కింద సుమారు లక్షా6వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. రిజర్వాయర్ కుడి కాల్వ నుచి 90 వేల ఎకరాలకు, ఎడమ కాల్వ నుంచి 16వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లోని గ్రామాలతో పాటు పక్కనే ఉన్న కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందనుంది. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులకు గత జనవరి మాసంలో మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేయడంతో ఆ రోజు నుంచి శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. మరికొద్ది నెలల్లోనే గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి నీటిని నింపి ఈ ప్రాంతానికి సాగునీరు అందించే లక్ష్యం పెట్టుకున్నారు.

నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ..

హుస్నాబాద్ నియోజకవర్గంలో గతంలో గుంతలమయంతో ఉన్న రోడ్లకు మహర్దశ వచ్చింది. ఇటీవలనే తండాలను అనుసంధానం చేస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో రోడ్ల అభివృద్ధి పనులు ముమ్మరమయ్యాయి. పంచాయతీరాజ్‌శాఖ ద్వారా నియోజకవర్గంలో 1200ల పనులు చేపట్టింది. ఇందుకు గానూ ప్రభుత్వం రూ. 128.18కోట్లు కేటాయించింది. ఆర్‌అండ్‌బీ ద్వారా రూ. 400ల కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు అనుసంధానం చేస్తూ రోడ్లు నిర్మాణాల పనులు అవుతున్నాయి. హుస్నాబాద్ పట్టణంలో ప్రత్యేక నిధుల ద్వారా అంతర్గత సీసీ రహదారుల నిర్మాణాలు పూర్తయ్యాయి. ట్రిపుల్ ఆర్ కింద హుస్నాబాద్‌లో రూ.3.86కోట్లు, భీమదేవరపల్లిలో రూ. 3.57కోట్లు మొత్తం రూ. 7.43 కోట్లతో పనులు పూర్తిచేశారు. బీటీ రెన్యూవల్స్‌కు రూ. 66.55కోట్లు మంజూరు కాగా పనులు చివరి దశలో ఉన్నాయి.

కులవృత్తులకు జీవనోపాధి..

నియోజకవర్గంలోని వివిధ కులవృత్తులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. గొల్లకురుమల ఆర్థికాభివృద్ధి కోసం నియోజకవర్గంలో గొర్రెలను పంపిణీ చేసింది. మొదటి విడుత గొర్రెల పంపిణీలో హుస్నాబాద్‌లో 612 మందికి, కోహెడలో 932 మందికి, అక్కన్నపేటలో 964 మందికి, చిగురుమామిడిలో 727 మందికి, సైదాపూర్‌లో 879 మందికి, భీమదేవరపల్లిలో 831 మందికి, ఎల్కతుర్తిలో 714 మందికి మొత్తంగా 5659 మందికి మొదటి విడుత గొర్రెల పంపిణీ చేశారు. రెండో విడుత కింద 3273 మందికి గ్రౌండింగ్ పూర్తి చేశారు. త్వరలోనే వీరికి గొర్రెల పంపిణీ చేయనున్నారు.

రైతుబంధు మొదటి విడుతలో రూ.62.63 కోట్లు పంపిణీ

రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. మార్కెటింగ్ శాఖ ద్వారా హుస్నాబాద్, కోహెడ, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, సైదాపూర్, వంగర, దుద్దెనపల్లిలో రూ. 6.65కోట్లతో గోదాముల నిర్మాణం చేపట్టింది. హుస్నాబాద్‌లో రైతు బజార్ నిర్మాణానికి కోటి రూపాయలు కేటాయించింది. ఈ పనులు కూడా త్వరితగతిన వేగంగా జరుగుతున్నాయి. రైతుబంధు పథకం కింద చిగురుమామిడి మండలంలో 9,456, సైదాపూర్‌లో 10,909, హుస్నాబాద్‌లో 7,456, కోహెడలో 10,766, అక్కన్నపేటలో, 10,264, భీమదేవరపల్లిలో 8,701, ఎల్కతుర్తిలో 8,950 మొత్తం నియోజకవర్గంలో 66వేల 502 మందికి రూ. 62.63 కోట్లు రైతుబంధు పథకం కింద పంపిణీ చేశారు. దీంతో అర్హులైన ప్రతి రైతుకు బీమా బాండ్లను అందించారు. రైతులకు సబ్సిడీపై నియోజకవర్గ వ్యాప్తంగా 50 ట్రాక్టర్లను అందించారు. గత ఏడాది హుస్నాబాద్ ప్రాంతంలో వడగళ్ల వర్షం కురవడంతో రైతులను పరామర్శించడానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు 22 గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి ఆ రైతులందరినీ ఓదార్చి వారందరికీ ఇన్‌పుట్ సబ్సిడీని అందించి ప్రభుత్వం ఆదుకున్నది.

మహాసముద్రం గండి కల సాకారం..

హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఉమ్మాపూర్ గ్రామ సమీపంలో రెండు గుట్టల లోయల మధ్యన మహాసముద్రంగండి చెరువు ఉంటుంది. సుమారు 50 ఏళ్ల కిందటనే ఈ చెరువుకు గండి పడింది. అప్పటి నుంచి ఆ చెరువు కింది రైతాంగం గండి పూడ్చాలని అప్పటి సమైక్య ప్రభుత్వాలను వేడుకున్నా ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. కేసీఆర్ సీఎం అయ్యాక స్థానిక శాసనసభ్యుడు వొడితెల సతీశ్‌కుమార్ ఈ చెరువుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2015లోనే సీఎం కేసీఆర్, భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెరువును సందర్శించారు. చెరువు గండిని పూడ్చటంతో పాటు ఆధునీకరించడానికి ఎన్ని నిధులైనా మంజూరు చేస్తానని హామీ ఇచ్చి రూ. 3.87కోట్లు మంజూరు చేశారు. చెరువు గండిని త్వరితగతిన మరమ్మతు చేపట్టి 17మీటర్ల ఎత్తులో కట్ట నిర్మాణం పూర్తి చేశారు. ఏండ్లుగా వట్టిపోయిన మహాసముద్రం గండి చెరువులోకి నీరు చేరడంతో కింద ఉన్న పలు గ్రామాల్లోని వ్యవసాయ బావుల్లో పాతాళగంగ పైకి వచ్చింది. ఈ చెరువుతో హుస్నాబాద్ పట్టణంతో పాటు మండలంలోని ఉమ్మాపూర్, నాగారం, మహ్మదాపూర్, రాములపల్లి, పోతారం(ఎస్), సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట, ఆకునూరు, పెర్కపల్లి, చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి, బొమ్మనపల్లి తదితర గ్రామాల్లో బావుల్లో భూగర్భజలాలు గత ఏడాది నుంచే గణనీయంగా పెరిగాయి. ఎన్నడూ లేనంతగా బావుల్లోకి నీళ్లు రావడం మహాసముద్రంగండి వల్లనే సాధ్యమైందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

విద్య, వైద్యానికి భారీగా నిధులు

హుస్నాబాద్ పట్టణంతో పాటు ఏడు మండలాల్లో పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హుస్నాబాద్‌లో పాలిటెక్నిక్ కళాశాలను రూ. 8కోట్లతో నిర్మించి వినియోగంలోకి తీసుకువచ్చింది. పట్టణంలో 50 పడకల దవాఖానాలను రూ. 2.75కోట్లతో నిర్మించింది. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ దేవస్థానానికి రూ. 4కోట్లు మంజూరు చేసింది. అక్కన్నపేట మండలం కట్కూరు పాఠశాలకు రూ. 32లక్షలు మంజూరు చేయగా పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ. 13.50కోట్లు మంజూరయ్యాయి. చిగురుమామిడిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ. 2.50కోట్లు, హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ. 2.50కోట్లు, గౌరవెల్లి అదనపు తరగతి గదులకు రూ. 6.50లక్షలు, కేసీఆర్ కిట్లను 150 మందికి పంపిణీ చేశారు. అలాగే హుస్నాబాద్‌లో మినీస్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని ఎలబోతారం, రామంచ, మీర్జాపూర్, హుస్నాబాద్, శనిగరం, మాణిక్యాపూర్ గ్రామాల్లో రూ. 21కోట్లతో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కోటిరూపాయలతో నిర్మించారు. హుస్నాబాద్ పట్టణంలో సమీకృత ప్రభుత్వ భవనాల నిర్మాణాల కోసం రూ. 17కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. హుస్నాబాద్‌లో రూ. 80లక్షలతో సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయ శిక్షణ భవనానికి రూ. 2కోట్లు, లైబ్రరీ నిర్మాణానికి రూ. 50లక్షలు, గిరిజన భవన్‌కు రూ. 2కోట్లు మంజూరయ్యాయి. ఇవి కాక మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరై పనులు కొనసాగుతున్నాయి.

ప్రతి నెలా రూ.4.91 కోట్ల ఆసరా పింఛన్లు పంపిణీ

వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఆసరా ఇచ్చేందుకు ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తుంది. నియోజకవర్గంలోని 7 మండలాలు, హుస్నాబాద్ పట్టణంతో కలిపి 44,952 మందికి వివిధ రకాల పింఛన్లు అందిస్తున్నారు. ఇందుకు గానూ ప్రతి నెలా రూ.4.91కోట్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతి వ్యక్తికీ ఆరుకిలోల చొప్పున బియ్యాన్ని అందిస్తున్నది. నియోజకవర్గంలో మొత్తం 90,077 రేషన్ కార్డులు ఉండగా వీరందరికీ నెలనెలా నిత్యావసర సరుకులను ప్రభుత్వం అందిస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద హుస్నాబాద్ మండలంలో 243 మందికి, కోహెడలో 387 మంది, అక్కన్నపేటలో 222 మంది, చిగురుమామిడి మండలంలో 253 మందికి, సైదాపూర్‌లో 208 మందికి, భీమదేవరపల్లిలో 225 మందికి, ఎల్కతుర్తిలో 232 మందికి, హుస్నాబాద్ పట్టణంలో 117 మందికి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తంగా నియోజకవర్గంలో రూ. 10.51కోట్లు పంపిణీ చేశారు.

రూ.72 కోట్ల కొత్త విద్యుత్ లైన్లు, విద్యుత్ సబ్‌స్టేషన్లు..

నాణ్యమైన విద్యుత్‌ను రైతాంగానికి అందించేందుకు విరివిగా విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణాలు జరిగాయి. కొత్త లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వేయడం జరిగింది. ఇటీవలి కాలంలో కోహెడ, హుస్నాబాద్‌లో రూ. 72కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్లు, కొత్తలైన్, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. మల్లారం, ఆకునూరు, వెన్నంపల్లి సబ్‌స్టేషన్లు నాలుగున్నరకోట్లతో నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరందించేందుకు పనులు చివరి దశలో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే ప్రతి ఇంటికీ నల్లాద్వారా గోదావరి జలాలు అందనున్నాయి. నియోజకవర్గంలో 161 ఆవాసాలు ఉన్నాయి.

266
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...