సర్కారు విద్య బలోపేతం


Sun,November 10, 2019 01:05 AM

-పది మండలాల విద్యార్థులకు చేకూరనున్న ప్రయోజనం
-617 మంది విద్యార్థులకు అందనున్న భత్యం
-ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నెలకు రూ.400
-ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు నెలకు రూ.600 అందచేత
-విద్యార్థుల బ్యాంకు అకౌంట్ల సేకరణ

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ బడుల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మౌలిక సదుపాయాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం నాణ్యమైన ఉచిత విద్య, అన్ని సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో 2019-20 విద్యా సంవత్సరానికి బస్సు సౌకర్యం లేని గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా భత్యం కింద జిల్లాలో 617 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలోని పది మండలాల్లో ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఒకటి నుంచి ఐదు చదివే(ప్రాథమిక పాఠశాల) పిల్లలకు నెలకు రూ.400, ఆరు నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు రూ.600 వరకు అందించనున్నారు. దండేపల్లి మండలంలోని విద్యార్థులకు అత్యధికంగా ఈ భత్యం అందనుండగా, వేమనపల్లి మండలానికి తక్కువగా రానుంది. దండేపల్లి మండలంలో 47 మంది ప్రైమరీ విద్యార్థులు, 159 మంది అప్పర్ ప్రైమరీ విద్యార్థులకు ఈ భత్యం కింద రూ.1,14,200 ఇవ్వనున్నారు. వేమనపల్లి మండలంలో ఇద్దరు అప్పర్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు 1200 అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

69 బడులు.. 617 మంది విద్యార్థులు..
విద్యాహక్కు చట్టం ప్రకారం కిలోమీటర్ పైగా ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్లకు పైగా ప్రాథమికోన్నత పాఠశాల, ఐదు కిలోమీటర్లకు పైగా ఉన్నత పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం లేకుంటే, ఆయా గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా భత్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే జిల్లాలోని పది మండలాల్లోని 69 పాఠశాలల్లో చదువుతున్న 617 మంది విద్యార్థులకు మొత్తం రూ.3,53,000 అందించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ నిధులను వేసేందుకు సంబంధిత పాఠశాలల్లో విద్యార్థుల ఖాతాలను సేకరిస్తున్నారు. 12 సంవత్సరాల బాలురకు, 10వ తరగతి వరకు చదివే విద్యార్థినులకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తున్నారు. బస్సు సౌకర్యం లేని విద్యార్థులు ఉన్నత చదువుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కొంతమంది రోజుకు రూ.10 నుంచి రూ.20 ఖర్చు చేస్తూ ఆటోల్లో వస్తున్నారు. మరికొంత మంది 3 నుంచి 4 కిలోమీటర్ల మేర కాలి నడకన వస్తున్నారు. వర్షాకాలం, వేసవి కాలంలో నానా అవస్థలు పడుతున్నారు. వీరందరికీ రవాణా భత్యం ఆసరా కానుంది.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...