సర్కారు స్కూళ్లకు కొత్త సార్లు


Sat,October 12, 2019 11:42 PM

- ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 1,014 ఎస్జీటీ పోస్టుల భర్తీ
- కేటగిరీలవారీగా ఉపాధ్యాయుల నియామకం
- రెండు రోజుల్లో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం

ఆదిలాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు త్వరలో కొత్త సార్లు రానున్నారు. 2017లో టీఆర్టీ ద్వారా తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో ఎస్జీటీల నియామకానికి నోటిఫికేషన్‌ వెలువడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల నియామకం కోసం ఎంపిక ప్రక్రియ చేపట్టారు. తెలుగు మీడియానికి సంబంధించిన ఫలితాలు విడుదల కాగా.. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాలలో 1,014 ఖాళీలను అధికారులు త్వరలో భర్తీ చేయనున్నారు. వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అధికా రులు ప్రాధాన్యత క్రమంలో కేటగిరి 3, కేటగిరి 2, కేటగిరి 1 వారీగా నియామకాలు చేపట్టనున్నారు. కొత్త సార్ల రాకతో సర్కారు స్కూళ్లలో విద్యా ప్రమాణాలు మెరుగు పడనున్నాయి.

విద్యాశాఖలో ఉపాధ్యాయుల భర్తీ కోసం నిర్వహించిన టీఆర్టీలో ఎస్జీటీల ఎంపిక పూర్తికాగా టీఎస్‌పీఎస్‌ వెబ్‌సైట్‌లో ఎంపికైన వారి వివరాలను అందుబాటులో ఉంచారు. 2017లో టీఆర్టీ ద్వారా తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో ఎస్జీటీల నియామకానికి నోటిఫికేషన్‌ వెలువడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో ఉపాధ్యాయుల నియామకం కోసం ఎంపిక ప్రక్రియను చేపట్టారు. తెలుగు మీడియానికి సంబంధించిన ఫలితాలు విడుదల కాగా.. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాలలో 1,014 ఖాళీలను అధికారులు త్వరలో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.

విద్యకు సర్కారు ప్రాధాన్యం
ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు పటిష్టమైన ప్రణాళికను రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్‌ పాఠశాల ఏర్పాటుతోపాటు సర్కారు స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నది. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఎస్జీటీ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టగా.. టీఎస్‌పీఎస్‌ వెబ్‌సైట్‌లో ఎంపికైన వారి వివరాలను అందుబాటులో ఉంచారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్జీటీ తెలుగు మీడియంలో 1,014 ఖాళీలు ఉండగా.. ఏజెన్సీలో 425, మైదాన ప్రాంతాల్లో 589 పోస్టులు ఉన్నాయి. వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అధికారులు ప్రాధాన్యత క్రమంలో కేటగిరి 3, కేటగిరి 2, కేటగిరి 1 వారీగా నియామకాలను చేపట్టనున్నారు. కేటగిరి 3లో గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు పాఠశాలల్లో విద్యార్థులు ఉండి ఉపాధ్యాయులు లేని చోట నియామకాలు జరుపుతారు. కేటగిరి 2లో సెమీ అర్బన్‌ ప్రాంతాల్లోని ఖాళీలు, కేటగిరి 1లో పట్టణ ప్రాంతాల్లోని ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన షెడ్యూల్‌ త్వరలో విడుదల కానున్నట్లు విద్యశాఖ అధికారులు తెలిపారు.


నేడో రేపో షెడ్యూల్‌ విడుదల..
ఉమ్మడి జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయుల నియామకం కోసం నేడో రేపో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. షెడ్యూల్‌ విడుదల కాగానే సూచించిన తేదీల ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాం. మూడు కేటగిరిలవారీగా ప్రాధాన్యత క్రమంలో ఉపాధ్యాయులను వివిధ పాఠశాలల్లో నియమిస్తాం. విద్యార్థులు ఉండి ఉపాధ్యాయులు అసలే లేని పాఠశాలలకు మొదట ప్రాధాన్యత ఇస్తాం. అనంతరం కేటగిరి 2,1ల్లో నియామకాలు చేపట్టాం. నాలుగు జిల్లాల్లో ఖాళీలను ఆయా డీవో కార్యాలయంలో అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటాం.
- రవీందర్‌రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారి

కష్టానికి ఫలితం దక్కింది..
రెబ్బెన: నేను బీఎస్సీ(మ్యాథ్స్‌) బీఈడీ, డీఈడీ చేసిన. గవర్నమెంట్‌ టీచర్‌ కావాలన్నదే నా కల. 2008 సంవత్సరంలో డీఎస్సీ రాయగా స్కూల్‌ అసిస్టెంట్‌ తృటిలో చేజారిపోయింది. తర్వాత ఓ ప్రైవేట్‌ పాఠశాలలో టీచరుగా విధులు నిర్వహిస్తునే చదివిన. 2017లో తెలంగాణ సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వగా ఐప్లె చేసిన. తర్వాత ఆవనిగడ్డ వెళ్లి టెస్ట్‌లు రాయడంతో పాటు హైదరాబాద్‌లో సీరియస్‌గా చదివిన. నా కష్టం ఊరికే పోలేదు. ఇప్పుడు టీచర్‌గా ఎంపికవడం చాలా సంతోషంగా ఉన్నది. నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది.
-బీ.శ్రీకాంత్‌గౌడ్‌, గోలేటి , రెబ్బెన

తొలి ప్రయత్నంలోనే..
ఆసిఫాబాద్‌ టౌన్‌ : మా తల్లిదండ్రులు కూలి పని చేసి న న్ను చదివించారు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వోద్యోగం చేయాలనే తపన ఉండేది. అందుకు తగ్గట్టుగానే చదివిన. అనుకున్నట్లుగానే తొలి ప్రయత్నంలోనే టీచర్‌గా ఉద్యోగం సాధించడం ఆనందంగా ఉంది. సర్కారు విద్యను మరింత బలోపేతం చేసేందుకు నా వంతూ కృషి చేస్తా.
-అదిత్యారాణి, రాజంపేట్‌, ఆసిఫాబాద్‌


చెల్లి ప్రోత్సాహంతో ..
ఆసిఫాబాద్‌ టౌన్‌ : వైరాగడే వినోద్‌. మాది ఆసిఫాబాద్‌ మండలం జండాగూడ. మాది వ్యవసాయ కుటుంబం. తండ్రి కిషన్‌, కలమ భాయిలు కూలీ పనులకు వెళ్లి నన్ను చదివించారు. మా చెల్లి 2012లో డీఎస్సీలో ఎస్జీటీగా ఉద్యోగం సాధించింది. తను ఇచ్చిన ప్రోత్సాహాంతో నేను కూడా చదివిన. 2012లో నిర్వహించిన డీఎస్సీలో 0.1 శాతంతో ఉద్యోగం కోల్పోయాను. అప్పటి నుంచి ఎలాగైన టీచరు కావాలని ఏ జాబ్‌ చేయకుండా పట్టుదలతో చదివి ఎస్జీటీగా ఎంపికైన. నాకు ఆర్థికంగా సహకరించిన మా చెల్లి సహకారంతోనే ఇది సాధ్యమైంది.
- వైరాగడే వినోద్‌,జండాగూడ, ఆసిఫాబాద్‌

ఆనందంగా ఉంది..
రెబ్బెన: మా కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు మనోహార్‌, గురువంతలను ఆదర్శంగా తీసుకొని బీఏ డీఎడ్‌ పూర్తి చేసిన. ఎలాగైన వాళ్లలాగా టీచర్‌ జాబ్‌ చేయాలని అనుకునేవాడిని. మా కాలనీలో ఓ రూం అద్దెకు తీసుకొని తోటి స్నేహితులతో కలిసి సీరియస్‌గా ప్రిపేరు అయిన. ఉదయం సింగరేణి గ్రంథాలయంలో న్యూస్‌ పేపర్లతో పాటు ఉద్యోగాలకు సంబంధించిన స్టడీ మెటీరీయల్‌ చదివిన. సందేహాలు ఉంటే పలువురితో డిస్కస్‌ చేసేవాణ్ణి. ఇప్పుడు టీచర్‌గా ఎంపికైన. ఆనందంగా ఉంది. -దుర్గం రాజ్‌కుమార్‌, గౌతంనగర్‌, రెబ్బెన

పట్టుదలతో చదివిన..
దహెగాం : నాపేరు పెరుగు సంతోష్‌. మాది కొంచవెల్లి గ్రామం. మాది మధ్యతరగతి కుటుంబం. ఆదిలాబాద్‌లో టీటీసీ పూర్తి చేసిన. టీచర్‌గా ఉద్యోగం సాధించాలని పట్టుదలతో చదివిన. ఎలాంటి కోచింగ్‌ లేకుండానే 2017 డీఎస్సీ రాయగా మెరిట్‌ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మెరిట్‌ ఉన్నవారందరికీ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించడం ఆనందగా ఉంది. నాకు ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చినందుకు మా ఇంట్లో వారందరూ సంతోషంగా ఉన్నారు.
-పెరుగు సంతోష్‌ ఎస్‌జీటీ కొంచవెల్లి

నా కల నెరవేరింది..
వేమనపల్లి : టీచర్‌ కావాలన్న నా కల నెరవేరింది. ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన టీఆర్‌టీ అభ్యర్థుల ఫైనల్‌ లిస్టులో నా పేరు వచ్చినం దుకు సంతోషంగా ఉంది. 2017 అక్టోబర్‌లో నోటిఫికేషన్‌ వచ్చింది. 2018లో ఫిబ్రవరిలో పరీక్ష రాశాను. 2019 ఏప్రిల్‌ 4న రిజల్ట్‌ ఇచ్చి కొన్ని కారణాల వల్ల ఎస్‌జీటీ తెలుగు మీడియం అభ్యర్థుల ఫలితాలను ఆపారు. రివైజ్‌డ్‌ లిస్టులో నేను ఎంపికై ఉద్యోగం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్‌ నిరుద్యోగుల కోసం టీఆర్‌టీ నోటిఫికేషన్‌ వేసి రిజల్టును కూడా ప్రకటించడం ఆనందంగా ఉంది. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సార్‌కు కృతజ్ఞతలు.
- వాగవత్‌ వినోద్‌కుమార్‌, వేమనపల్లి

భావిపౌరులుగా తీర్చిదిద్దుతా..
చెన్నూర్‌, నమస్తే తెలంగాణ : మొదటి ప్రయత్నంలోనే టీచర్‌ జాబ్‌ సంపాదించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్‌ సార్‌ ఉపాధ్యాయ నియమాకాలను పెద్ద సంఖ్యలో చేపట్టి నిరుద్యోగులకు ఎంతో ఊరట కల్పించారు. విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయుడి నా వంతు కృషిచేస్తా. ఒక టీచర్‌గా నా పాత్ర పోషించి సమాజాభివృద్ధికి పాటుపడతాను. నేను ఇంటర్‌ వరకు ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిన నేను విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తా. 2011లో ఇంటర్‌ కాగానే 2011-2013లో టీచర్‌ శిక్షణ పొందాను. రాష్ట్ర వ్యాప్తంగా 294, జిల్లావ్యాప్తంగా 41వ ర్యాంకు సాధించి, తెలుగు మీడియం ఉపాధ్యాయుడిగా నియామకమైనందుకు చాలా ఆనందంగా ఉంది.
- అనిల్‌సింగ్‌, చెన్నూర్‌

తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే..
మందమర్రి : ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే నా లక్ష్యం నెరవేరింది. తల్లిదండ్రలు ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. మాది మందమర్రి మండలం దీపక్‌నగర్‌. అమ్మనాన్న వజ్ర-లక్ష్మణ్‌ టైలర్‌ పనిచేస్తూ నన్ను చదివించారు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఎస్‌జీటీగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. శారద విద్యాలయంలో పాఠశాల విద్య, సింగరేణి కళాశాలలో ఇంటర్‌ చదివాను. కరీంనగర్‌లో డైట్‌ కళాశాలలో డీఎడ్‌ పూర్తి చేశాను. సింగరేణి కళాశాలలోనే డిగ్రీ చదివాను. గత విద్యా సంవత్సరం నుంచి ఫిల్టర్‌బెడ్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యా వలంటీర్‌గా పనిచేస్తున్నా. టీఆర్‌టీ నియామకాల్లోనే ఎస్‌జీటీగా జాబ్‌ తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది.
- తన్నీరు దీపిక, దీపక్‌నగర్‌, మందమర్రి

టీఆర్‌ఎస్‌ సర్కారుకు కృతజ్ఞతలు..
మందమర్రి : తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి చేపట్టిన ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల్లోనే ఎస్‌జీటీ గా సెలెక్ట్‌ కావడం ఆనందంగా ఉంది. మాది ఊరు మందమర్రి. అమ్మనాన్న రాజక్క, రామస్వామి వ్యవసాయం చేసి నన్ను చదివిం చారు. సింగరేణి పాఠశాలలో, శివాని కళాశాలలో ఇంటర్‌, హుస్నాబాద్‌లో డీఎడ్‌ చేశాను. గతేడాది నుండి ఫిల్టర్‌బెడ్‌ ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో వీవీగా పనిచేస్తూ కుటుంబానికి ఆసరా అవుతున్నా. ఇటు ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయడం, ఇంట్లో తల్లిదండ్రులు ప్రోత్సహించడం వల్లే జాబ్‌ సంపాదించగలిగాను. పేద కుటుంబమైనా మా వాళ్లు నా చదువుకు అడ్డుచెప్పలేదు. అందుకే నేను కూడా కష్టపడి.. నా లక్ష్యం చేరుకున్నా. సర్కారుకు కృతజ్ఞతలు.
- చేనేని మల్లీశ్వరి, ఊరు మందమర్రి

సంతోషంగా ఉంది..
కౌటాల : మొదటి ప్రయత్నంలోనే ఎస్జీటీలో నాకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. టీఎస్‌పీఎస్సీ కూడా పరీక్షల్లో, పోస్టుల భర్తీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంది. అన్ని ఉద్యోగాల కన్న ఉపాధ్యాయ వృత్తి చాలా విలువైనది. నావంతుగా ఎంతో మంది విద్యార్థులకు విద్యబుద్ధులు నేర్పించే అవకాశం వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకుంటా.
-మడావి సంజయ్‌, కౌటాల

ఉద్యోగమే లక్ష్యంగా..
పెంచికల్‌పేట్‌ : మాది మధ్యతరగతి వ్యవసాయ కుటుం బం. అమ్మనాన్న నన్ను ఎంతో కష్టపడి చదివించారు. దీంతో వారి కష్టాలు ఎలాగైన తీర్చాలని చిన్నప్పటి నుంచే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకునేవాడిని. టీఆర్టీకి ఐప్లె చేసి, సీరియ స్‌గా చదివిన. ఇప్పుడు ఎస్జీటీ పోస్టుకు ఎంపికైన. చాలా సంతోషంగా ఉంది.
-జాఫర్‌, బొంబాయిగూడ, పెంచికల్‌పేట్‌

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...