తిరుగుప్రయాణం సాఫీగా..


Fri,October 11, 2019 04:26 AM

-పండుగ రద్దీకి అనుగుణంగా బస్సులు
-అధిక చార్జీల వసూళ్లపై అధికారుల దృష్టి
-కరీంనగర్ బస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన డీటీసీ శ్రీనివాస్
-సిరిసిల్ల రూట్‌లో తనిఖీలు చేసిన ఆర్‌ఎం జీవన్ ప్రసాద్
- పర్యవేక్షణకు వివిధ శాఖల ఉద్యోగులు
-గురువారం నడిచిన ఆర్టీసీ బస్సులు
- అదనంగా సీసీ, స్కూల్, మ్యాక్సీ క్యాబ్‌లు
-బ్రీతింగ్ ఎన్‌లైజేషన్ తర్వాతనే బస్సులు అప్పగింత

ఆర్టీసీలో కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరినా, ప్రజారవాణా మాత్రం సాఫీగా సాగుతున్నది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల్లో బస్సుల సంఖ్య రద్దీకి అనుగుణంగా పెరుగుతున్నది. తిరుగుప్రయాణంలో ప్రయాణికులు ఎక్కడా ఇబ్బంది పడకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గురువారం కరీంనగర్- హైదరాబాద్ మధ్య ఎక్కువగా బస్సులు నడిపించారు. ఇటు అధిక చార్జీల వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. డీటీసీ శ్రీనివాస్ కరీంనగర్ బస్టేషన్‌లో తనిఖీ చేసి చార్జీలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఆర్‌ఎం పీ జీవన్‌ప్రసాద్ కూడా సిరిసిల్ల రూట్‌లో తనిఖీ చేశారు.

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):పండుగకు వచ్చి తిరుగుముఖం పడుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు బస్సులు నడుపుతున్నారు. బుధవారం నుంచి రోజుకు పదుల సంఖ్యలో బస్సులు పెంచుతున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో అధికారులు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకుంటున్నారు. గురువారం అనేక రూట్లలో బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచారు. కరీంనగర్ - హైదరాబాద్ మధ్య ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ మార్గంలో బస్సుల సంఖ్య 150కి పెంచారు. మిగతా రూట్లలోనూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా బస్సులు నడిపించారు. కరీంనగర్ నుంచి గోదావరిఖని, మంచిర్యాల, ధర్మారం, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ రూట్లలో అధికంగా బస్సులు నడిపారు. ఇటు హుజూరాబాద్ నుంచి హుజూరాబాద్- జమ్మికుంట మధ్య, హన్మకొండ, వరంగల్ మధ్య ఎక్కువ బస్సులు నడిపారు. హుజూరాబాద్ నుంచి సిద్దిపేట, హైదరాబాద్‌కు కూడా ఎక్కువ బస్సులు నడిపించారు. నిన్నా మొన్నటి వరకు ఒకే ఒక బస్సు ఉండే రూట్‌లో నడవని బస్సులు కూడా ఇపుడు అలాంటి రూట్లలోనూ కనిపించడంతో ప్రయాణం సాధారణ స్థితికి చేరినట్లు అనిపించింది. జిల్లా కేంద్రం నుంచి గ్రామాల మధ్య నడిచే పల్లె వెలుగు బస్సులు కూడా వాటికి కేటాయించిన మార్గాల్లో ఈ రోజు నడిపించారు. మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకే 354 ఆర్టీసీ, 204 అద్దె బస్సుల చొప్పున 558 బస్సులు నడిపించారు. అలాగే 107 కాంట్రాక్టు క్యారియర్, 25 స్కూల్, మరో 200 మ్యాక్సి క్యాబ్‌లు ప్రయాణికులకు సేవలు అందించాయి. సాయంత్రం వరకు మరో 10 ఆర్టీసీ బస్సులను పెంచారు. కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నప్పటికీ ప్రయాణాలపై ఎలాంటి ప్రభావమూ చూపడం లేదు. ఆరు రోజులుగా యధావిధిగా బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.

అధిక వసూళ్లపై దృష్టి..
ఆర్టీసీలో తాత్కాలికంగా నియామకమైన కొందరు కండక్టర్లు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మొదట సమ్మెకు ముందు అమలులో ఉన్న చార్జీలను పక్కనబెట్టి చిల్లరకు కొరత ఉండకుండా చార్జీలు నిర్ణయించారు. ఏ స్టేజీకి ఎంత తీసుకోవాలో చార్జీల ధరల పట్టికను నిర్దేశించారు. దీనికి అనుగుణంగా చార్జీలు వసూలు చేయాల్సిన కండక్టర్లు కొందరు రెండింతలు వసూలు చేస్తున్నారని తెలియడంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సీరియస్ కాగా, అధికారులు అప్రమత్తమయ్యారు. బస్సుల్లో చార్జీల పట్టికలను ప్రదర్శించాలని నిర్ణయించి బుధవారం రాత్రి నుంచే అమలు చేస్తున్నారు. అయితే చార్జీల పట్టికలు అతికించిన బస్సుల్లో చాలా వాటిని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించినట్లు తెలుస్తోంది. దీనిపై సీరియస్‌గా ఉన్న అధికారులు చార్జీల విషయంలో ప్రయాణికులకు అవగాహన కల్పించడంపై దృష్టి సారించారు. గురువారం రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ నేరుగా కరీంనగర్ బస్టేషన్‌కు వచ్చి ప్రయాణికులతో మాట్లాడారు. చార్జీలు ఎంత వసూలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. వీరిలో కొందరు అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో కొన్ని బస్సులను అప్పటికపుడు తనిఖీ చేసిన డీటీసీ కండక్టర్లతో మాట్లాడి తీవ్రంగా హెచ్చరించారు. ఎవరైనా అధిక చార్జీలు వసూలు చేస్తే హైల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రయాణికులకు సూచించారు. ఇటు ఆర్టీసీ ఆర్‌ఎం పీ జీవన్ ప్రసాద్ కూడా సిరిసిల్ల, వేములవాడ డిపోల్లో తనిఖీ చేశారు. అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

సేవలకు ఇతర శాఖల సిబ్బంది..
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో సమర్ధవంతంగా ప్రత్యామ్నాయ సేవలు అందించేందుకు రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశాల మేరకు ఇతర శాఖల సిబ్బందికి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. కరీంనగర్-1,2 డిపోలకు, హుజూరాబాద్ డిపోకు ఇద్దరేసి రెవెన్యూ ఉద్యోగులను గురువారం నుంచి నియమించారు. రీజియన్ పరిధిలోని మిగతా జిల్లాల్లోనూ త్వరలో ఇతర శాఖల సిబ్బందిని తీసుకుంటామని ఆర్టీసీ ఆర్‌ఎం తెలిపారు.

డిపోల వారీగా బస్సుల సేవలు..
కరీంనగర్ రీజియన్ పరిధిలో గురువారం వరకు అందుబాటులో ఉన్న 668 బస్సుల్లో 567 బస్సులు నడిపించారు. డిపోల వారీగా చూస్తే కరీంనగర్-1లో 38 ఆర్టీసీ, 24 అద్దె చొప్పున మొత్తం 62 బస్సులు, కరీంనగర్ -2లో 38 ఆర్టీసీ, 30 అద్దె చొప్పున 68 బస్సులు, హుజూరాబాద్‌లో 34 ఆర్టీసీ, 10 అద్దె బస్సుల చొప్పున 44 బస్సులు నడిపారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం అందుబాటులో ఉన్న 213 ఆర్టీసీ బస్సుల్లో 110, 64 అద్దె బస్సుల్లో మొత్తం చొప్పున 174 బస్సులు నడిపారు. గోదావరిఖని డిపోలో 41 ఆర్టీసీ, 31 అద్దె బస్సుల చొప్పున 72, మంథని డిపోలో 37 ఆర్టీసీ, 12 అద్దె బస్సుల చొప్పున 49 బస్సులు నడిపారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 155 ఆర్టీసీ బస్సులకు 78, 43 అద్దె బస్సులకు 43 చొప్పున మొత్తం 121 బస్సులు నడిపారు. జగిత్యాల డిపోలో 63 ఆర్టీసీ, 40 అద్దె బస్సుల చొప్పున 103, మెట్‌పల్లి డిపోలో 29 ఆర్టీసీ, 15 అద్దె బస్సుల చొప్పున 44, కోరుట్ల డిపోలో 32 ఆర్టీసీ, 12 అద్దె బస్సుల చొప్పున 44 బస్సులు నడిపారు. జగిత్యాల జిల్లాలో అందుబాటులో ఉన్న 194 ఆర్టీసీ బస్సుల్లో 124, 67 అద్దెబస్సుల్లో 67 చొప్పున 191 బస్సులు నడిపారు. సిరిసిల్ల డిపోలో 27 ఆర్టీసీ, 15 అద్దె బస్సుల చొప్పున 42, వేములవాడ డిపోలో 25 ఆర్టీసీ, 14 అద్దె బస్సుల చొప్పున 39 బస్సులు నడిపారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 106 ఆర్టీసీ బస్సులకు 52, 29 1ద్దె బస్సులకు 29 చొప్పున 81 బస్సులు నడిపారు. ఇవి కాకుండా 25 స్కూల్ బస్సులు, మరో 107 సీసీ బస్సులు, 200 మ్యాక్సి క్యాబ్‌లు నడిచినట్లు అధికారులు తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీలు..
ఆర్టీసీ కార్మికులు ప్రతి రోజూ ఏదో రూపకంగా నిరసనలు తెలుపుతున్నారు. గురువారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ నుంచి ఆర్టీసీ బస్‌స్టేషన్ వరకు ర్యాలీ తీశారు. వన్‌డిపో ఎదుట ధర్నా చేసి, బతుకమ్మ ఆడారు. హుజూరాబాద్ డిపో నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేశారు. పెద్దపల్లిలో అయ్యప్ప స్వామి ఆలయం చౌరస్తాలో ధర్నా చేశారు. అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...