గోవుల అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు


Tue,July 23, 2019 01:08 AM

కరీంనగర్ క్రైం : గోవుల అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని సీపీ కమలాసన్‌రెడ్డి అన్నారు. సోమవారం కమిషనరేట్ కేంద్రంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గోవుల అక్రమ రవాణా నియంత్రణకు కమిషనరేట్ ప్రవేశ మార్గాల వద్ద తనిఖీలు చేస్తామన్నారు. సమాజంలోని ప్రతి పౌరుడూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఇతర మత విశ్వాసాలకు భంగం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గోవుల అక్రమ రవాణాకు సంబంధించి ఎటువంటి సమాచారమున్నా పోలీసులకు తెలపాలని కోరారు. బృందాలుగా ఏర్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నవంబర్ 10 వరకు వివిధ మతాలకు చెందిన పండుగలు వరుసగా ఉన్నాయనీ, అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో మెదులుతూ శాంతియుత వాతావరణంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రార్థనా స్థలాల వద్ద ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకుండా ప్రతిరోజు ఉదయం 3 నుంచి 6 గంటల వరకు ప్రత్యేక నిఘా, పెట్రోలింగ్‌లను కొనసాగిస్తున్నామని తెలిపారు. పోలీస్‌శాఖ ఏ మతానికి, వర్గానికి మద్దతుగా నిలువదనీ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పని చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ అశోక్, ఇన్‌స్పెక్టర్లు తుల శ్రీనివాసరావు, దేవారెడ్డి, విజయ్‌కుమార్‌లతో పాటు ముస్లిం మత పెద్దలు మౌలానా నజీముద్దీన్, అబ్బాస్‌షమీ, ఎంఏ రఫీక్, ముజాహిద్‌లతో పాటు వందమంది పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...