బీమాతో కార్యకర్తలకు భరోసా


Sun,July 7, 2019 01:00 AM

తిమ్మాపూర్ రూరల్: దేశంలో ఏ పార్టీ ప్రవేశపెట్టని విధంగా కార్యకర్తల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాద బీమాను ప్రవేశ పెట్టారని ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని మొగిలిపాలెం గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన హాజరై, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. నియోజకవర్గంలో నమోదు కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నదనీ, గతంలో కంటే ఎక్కువ సభ్యత్వాలు వచ్చే అవకాశాలున్నాయన్నారు. కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పని చేసి, లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి దేశ చరిత్రలో ఏ పార్టీకి లేని విధంగా సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. మెట్ట ప్రాంతాల్లో రైతులు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంపై అవగాహనతో మిడ్ మానేర్ నుంచి తోటపెల్లి ద్వారా నీటిని తీసుకొచ్చి ఎగువ ప్రాంతాలకు నీటినందించే ప్రయత్నాలు సాగిస్తున్నారని వివరించారు. కాలువ ద్వారా నీరందించేందుకు వీలుకాని భూములకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయినా నీటిని అందించే ప్రయత్నాలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరిస్తూ సభ్యత్వాల నమోదు పెంచాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత, జడ్పీ సభ్యురాలు ఇనుకొండ శైలజ, స్థానిక ఎంపీటీసీ తిలక్‌ప్రియారెడ్డి, కేడీసీసీబీ డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఇనుకొండ జితేందర్‌రెడ్డి, దుండ్ర రాజయ్య, సంపత్, తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...