త్వరలో మున్సిపోల్స్


Thu,June 20, 2019 02:24 AM

-బల్దియా ఎన్నికలకు సర్కారు సిద్ధం
-ఏడు మున్సిపాలిటీలకు మోగనున్న నగారా
- మంచిర్యాల కార్పొరేషన్‌పై స్పష్టత వచ్చే అవకాశం
మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్, సర్పంచ్, పరిషత్ ఎన్నికలను పూర్తి చేసిన సర్కారు మున్సిపల్ ఎన్నికలు జరిపించేందుకు రంగం సిద్ధం చేసింది. అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి పాత మున్సిపాలిటీలు. వీటిలో మందమర్రి మున్సిపాలిటీకి గత 22 ఏండ్లుగా ఎన్నికలు లేవు. మంచిర్యాల, బెల్లంపల్లిలో పాలకవర్గ సభ్యుల పదవీకాలం జులై 2వ తేదీన ముగియనుంది. ఇక క్యాతన్‌పల్లి, నస్పూరు, చెన్నూరు, లక్షెట్టిపేటలను కొత్త మున్సిపాలిటీలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీ ఎన్నికల ఓటరు జాబితాను లోక్‌సభ ఎన్నికల కంటే ముందే అధికారులు సిద్ధం చేశారు. వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గణన సర్వే పూర్తి చేశారు. కేవలం పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వార్డులవారీగా రిజర్వేషన్ మిగిలింది. ప్రభుత్వం తయారు చేసిన కొత్త చట్టం ప్రకారం వార్డులను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1200 నుంచి 1500 మంది ఓటర్లను ఒక పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకున్నారు. మంచిర్యాల, నస్పూరు, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో జనాభా పెరిగిపోవడంతో ఒక్కో వార్డుల్లో 2 వేల నుంచి 3 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. మరికొన్ని వార్డుల్లో 800 నుంచి 1200లోపు ఓటర్లే ఉన్నారు. ఇలాంటి వార్డుల్లో కొత్త చట్టం ప్రకారం ఓటర్లను సమానంగా సర్దుబాటు చేయడానికి మరోమారు వార్డుల విభజన చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా.. మంచిర్యాల కార్పొరేషన్ ఆలస్యం అవుతుందా? లేక ఇప్పుడు ఉన్నట్టుగానే మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తారా? అనేది తేలాల్సి ఉంది.

ఎన్నికలకు సిద్ధంగా మున్సిపాలిటీలు..
మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, నస్పూరు, చెన్నూరు మున్సిపాలిటీల్లో ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో వీటిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. క్యాతన్‌పల్లి కొత్త మున్సిపాలిటీలో తి మ్మాపూర్ గ్రామస్తులు తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో చేర్చవద్దని కోరుతూ కోర్టుకు వెళ్లారు. అక్కడ వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గణన చేసి నా అధికారికంగా ప్రకటించలేదు. మందమర్రిలో ఏజెన్సీ చట్టం వివాదం వల్ల అక్కడ ఈసారి కూడా ఎన్నికలు జరిగే అవకాశం లేదు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాలను కార్పొరేషన్‌గా చేస్తామని ప్రకటించారు. కొత్తగా ఏర్పాటు చేసిన నస్పూరు, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలను మంచిర్యాలలో విలీనం చేసి కార్పొరేషన్ చేస్తామని ఆయ న ప్రకటించారు. అప్పుడు ఒక్కో వార్డులో 4,500 నుంచి 5000 వరకు ఒక్కో వార్డు ఏర్పాటు చేయా ల్సి ఉంటుంది. ఆ తర్వాత కొత్త ఓటర్ల జాబితా, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గణన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పాలకవర్గం సభ్యుల రిజర్వేషన్లు కేటాయించడానికి సమయం పట్టే అవకాశం ఉంది.

ఆశావహుల్లో ఆనందం
ఎట్టకేలకు ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహుల్లో ఆనందం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జులైలోపే ముగిస్తామని చెప్పడంతో చాలా మంది టిక్కెట్ ఆశిస్తున్న వారు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే క్యూలో ఉన్న నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసే పనిలో పడ్డారు. మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్‌చైర్మన్ రిజర్వేషన్లు ప్రకటిస్తే మరింత పోటీ పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ పోటీ కేవలం అధికార టీఆర్‌ఎస్ పార్టీలోనే ఉంది. అసెంబ్లీ నుంచి పరిషత్ ఎన్నికల వరకు అన్నింటిలోనూ టీఆర్‌ఎస్ విజ యం ఖాయం కావడంతో ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయఢంకా ఖాయమని పలువురు భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీ నుంచి టిక్కెట్లకు భారీగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. గతంలో మాదిరిగా మంత్రులు, ఆయా ప్రాంత ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించనున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...