ప్రైవేటు ఫీజులుం


Wed,June 19, 2019 01:45 AM

(మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ) ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల భారం మోయలేక సామాన్య, మధ్య తరగతి ప్రజలతోపాటు ఎగువ తరగతి ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఏటా యథేచ్ఛగా ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి. ఉత్తమ విద్యను అందిస్తామంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. తమ పిల్లల భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా తీసుకొని అత్యధిక ఫీజులను దండుకుంటున్నారు. ఫీజుల నియంత్రణకు జిల్లాస్థాయిలో ఉన్నత స్థాయి కమిటీ ఉన్నప్పటికీ ఫలితం లేకపోయింది. క్షేత్రస్థాయిలో ఈ కమిటీ పనిచేయకపోవడంతో జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నాయి.

ఏటా పెరుగుతున్న ఫీజులు
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో, పెద్ద గ్రామా ల్లో ప్రైవేటు పాఠశాలలు ఏటా పదుల కొద్ది పుట్టుకొస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామంటూ కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందకు పైగా ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి కాన్వెంట్ స్కూల్లో చదివిస్తే భవిష్యత్ భాగుంటుందని, పట్టణ బాట పట్టడంతో పట్టణంలో ఫీజుల మోత మోగుతుంది. డేస్కాలర్ కింద రూ.15 నుంచి రూ.35 వేల వరకు తరగతిని బట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు. గత ఐదేళ్లలోనే బడి ఫీజులు అడ్డూ అదుపులేకుండా పెరగడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నియంత్రణపై కరువు
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, మౌలి క సదుపాయాలు, ప్రైవేటు పాఠశాలల నిర్వహణపై జిల్లాస్థాయిలో ఓ కమిటీ ఉన్నప్పటికీ చర్యలు శూన్యం. కలెక్టర్ చైర్మన్‌గా, సభ్యులుగా డీఈవో, జిల్లా ఆడిట్ అధికారి ఉంటారు. మరో ఇద్దరు సభ్యుల్లో ఒకరు తల్లిదండ్రులు, మరొకరు విద్యావేత్తలు ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉండాలి. ఈ కమిటీ ఏటా ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహణ ఫీజుల అమలు, విద్యాహక్కు చట్టం అమలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, బస్సుల భద్రత, పలు అంశాలపై సమావేశం నిర్వహించి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అయితే ఈ కమిటీ ఇప్పటివరకు సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవని జిల్లాశాఖ అధికారులే చెబుతున్నారు. 2009లో విద్యాహక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా ప్రతి ప్రైవేటు పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కోటాలో 25 శాతం పేద విద్యార్థులకు ఉచితంగా చదువులు అందించాలి. కానీ.. ఇదీ ఏ పాఠశాలలోనూ అమలు కావడం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం కమిటీతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం ఫీజులను పెంచుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఐదేండ్లతో పోల్చితే ఇప్పుడున్న ఫీజు లు 30 నుంచి 50 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం ప్రైవేటు పాఠశాలలు జిల్లా కమిటీతో చర్చించి ఫీజులను నిర్ణయించాలి. పాఠశాలల్లో స్థాయిని బట్టి ఫీజులను జిల్లా కమిటే సిఫార్సు చేయాలి. ఫీజుల వివరాలను బోర్డుపై ప్రతి పాఠశాలల్లో అంటించాలి. కానీ.. ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ఆంగ్లమాధ్యమ మోజులో అధిక ఫీజులను వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సౌకర్యాలు అంతంత మాత్రమే..
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మాట ఎలా ఉన్నా సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలు ప్రారంభించినప్పుడు విద్యాశాఖ ద్వారా అనుమతి తీసుకోవాలి. ఇందుకు కొంత ఫీజును చెల్లించాలి. ప్రతియేటా దాన్ని రెన్యూవల్ చేసుకోవాలి. పాఠశాలకు అనుమతినిచ్చే జిల్లాస్థాయి అధికారులు ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు సరిపోయే భవనం ఉందా? అన్ని వసతులు ఉన్నాయా? ఆట స్థలం, మరుగుదొడ్లు, భోజన వసతి, విశాలమైన గదులు, మంచి వాతావరణం ఇవన్నీ ఉన్నప్పుడే పాఠశాలకు అనుమతినివ్వాలి. కానీ.. ఇప్పటికీ గ్రామీణ, మండల ప్రాంతాల్లో రేకుల షెడ్డు, తడకలతో ఏర్పాటు చేసిన తాత్కాలిక భవనం కింద పాఠశాలలను నిర్వహిస్తున్నారు. పట్టణాల్లోనైతే ఇరుకుగదులు, ఆట స్థలం లేని ఎన్నో ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలకు తీసుకెళ్లే బస్సుల కండీషన్ కూడా సరిగ్గా ఉండదు. అక్కడక్కడ బస్సు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇదంతా బహిరంగ రహస్యమైనప్పటికీ సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని పైవేటు పాఠశాలలు అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయిస్తున్నాయి. పాఠశాల యజమాన్యం టీచర్ ట్రైనింగ్ చేసిన సర్టిఫికెట్లను పాఠశాల రికార్డులో చూయించి అర్హత లేని టీచర్లతో విద్యాబోధన చేయిస్తున్నాయి.

పాఠశాలల్లో కొనాల్సిందే...
బడి ఫీజులు, ట్యూషన్ ఫీజులే కాదు.. విద్యార్థులకు ఏదీ కావాలన్నా మా పాఠశాలల్లో కొనాల్సిందేనని కొన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులను నిలువునా దోపిడీకి గురి చేస్తున్నారు. ఆ పాఠశాలలలో చదువుకునే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్, బెల్టు, యూనిఫాం, బ్యాడ్జీ, షూ, డైరీ, ప్యాట్స్ తదితర వస్తువులను తమ పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు ముందే చెబుతున్నారు. ఇందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి స్టడీ మెటీరియల్స్, పుస్తకాలను వారు నిర్ణయించిన ధరకు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇంత ఫీజులని ఎదురు మాట్లాడితే మీ పిల్లాడిని తీసుకెళ్లండని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు. కొన్ని పాఠశాలల్లో తినుబండారాల దుకాణాలను ఏర్పాటు చేసి వారే నిర్వహిస్తున్నారు. ఇదంతా నిబంధనలకు విరుద్ధమని విద్యావంతులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖాధికారులు జోక్యం చేసుకొని ప్రతి పాఠశాలలో ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోవడమే కాకుండా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...