అవినీతికి అడ్డుకట్ట


Wed,June 19, 2019 01:44 AM

(మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ) జిల్లాలో 16 మండలాలు ఉండగా, వాటి పరిధిలో 310 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన జిల్లాలోని మండలాలకు ఏటా నిధులు కేటాయిస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం జిల్లాకు రూ.18 కోట్ల మేరకు నిధులు విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం 2018-19 ఆర్థిక సంవత్సరానికి రెండో విడతలుగా జిల్లాకు రూ.14 కోట్ల నిధులు వచ్చాయి. త్వరలో ఈ నిధులతో చెక్‌పవర్ రాగానే సర్పంచ్‌లు పనులు చేయాల్సి ఉంటుంది. గతంలో వచ్చిన నిధులతో సర్పంచులు గ్రామాల్లో భవన సముదాయాలు, రహదారులు, నీటి ట్యాంకులు, తాగునీటి పైప్‌లైన్లు, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, మురుగు కాల్వల నిర్మాణాలు చేతిపంపుల ఏర్పాటు తదితర పనులు చేపట్టారు. ఈ నిధులపై ఎలాంటి విచారణ లేకపోవడంతో కొన్ని గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కుమ్మక్కై పనులు చేయకున్నా చేసినట్లుగా లెక్కలు చూపడం, నాణ్యత లేకపోవడం, చేసిన పనులు చేయడం లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడేండ్లుగా చేసిన పనులకు జియో ట్యాగింగ్ చేయడం ద్వారా లెక్కలు పక్కగా ఉండడమే కాకుండా, అక్రమాలకు తావుండదని ప్రజలు భావిస్తున్నారు.

వివరాలు నమోదు ఇలా..
పంచాయతీ ఆస్తుల సమగ్ర వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా ఇంటర్నెట్‌లో పొందుపరుస్తారు. ఇందుకు ఆయా పంచాయతీలకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అయ్యాక ఆస్తులను చిత్రీకరించి జియోట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలోని కంప్యూటర్ సహాయకులు లేదా పంచాయతీ కార్యదర్శులు ఆక్షాంశాలు, రేఖాంశాల ద్వారా పని జరిగిన ప్రతి ప్రాంతానికి వెళ్లి చిత్రీకరిస్తారు. ఇలా చేయడం ద్వారా గ్రామాల్లో పనిచేశారనేది ఉన్నతాధికారులు సులువుగా తెలుసుకుంటారు. ఏదైనా పనిని తనిఖీ చేయాలన్నా, నిధులు మంజూరు చేయాలన్నా ఇదే ఆధారం అవుతుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. పంచాయతీ భవనం, శ్మశానవాటిక, పాఠశాల, బ్యాంకు భవనాలు, విద్యుత్తు స్తంభాలు, నెట్‌వర్క్ టవర్, సీసీ రహదారులు, నీటి ట్యాంకులు, తదితరాలు అన్నింటికీ జియోట్యాగింగ్ చేస్తారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...