అంతిమయాత్ర ఆరంభం


Mon,June 17, 2019 01:38 AM

- నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు
- ఒక్క రూపాయికే అంత్యక్రియలు పూర్తి
- సామగ్రిని సమకూర్చిన బల్దియా సిబ్బంది
- రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వ్యయం
- పాడె మోసిన నగర మేయర్ రవీందర్‌సింగ్
- రూ.1.50 కోట్లు కేటాయింపు
- దైవకార్యంగా భావిస్తున్నాం : మేయర్
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒక్క రూపాయితో నిర్వహించ తలపెట్టిన అంతిమయాత్ర కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. నిరుపేదలు చనిపోతే దహన సంస్కారాలకు ఆర్థిక భారం కాకూడదన్న ఉద్దేశంతో నగర మేయర్ రవీందర్‌సింగ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం కరీంనగరంలోని కట్టరాంపూర్‌లో గల భవానినగర్‌కు చెందిన మంచాల లలిత పాడెమోసి మొదలు పెట్టారు. అన్ని రకాల సామగ్రిని సమకూర్చిన బల్దియా సిబ్బంది సంప్రదాయబద్దంగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఆఖరి సఫర్.. అంతిమయాత్ర కార్యక్రమాన్ని దైవకార్యంగా భావిస్తున్నట్లు మేయర్ రవీందర్‌సింగ్ స్పష్టం చేశారు.
కార్పొరేషన్, నమస్తే తెలంగాణ : కరీంనగర్ నగరపాలక సంస్థ పేదలకు ఆర్థిక భారం తగ్గించాలన్న ఆలోచనతో శ్రీకారం చుట్టిన అంతిమయాత్ర ఆఖరి సఫర్ పథకాన్ని నగర మేయర్ రవీందర్‌సింగ్ ఆదివారం ప్రారంభించారు. లాంఛనంగా శనివారమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ఆదివారం కరీంనగర్‌లోని కట్టరాంపూర్‌లో గల భవానీనగర్‌కు చెందిన మంచాల లలిత మరణించగా.. మొట్ట మొదట రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రూపాయి చెల్లింపునకు రశీదు అందించి అంత్యక్రియలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం బల్దియా ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. పాడె కట్టటం, డప్పు చప్పుళ్లు, అంతిమ యాత్రకు వాహనం, దహన సంస్కారాలకు కట్టెలు, కిరోసిన్ తదితర అన్ని లాంఛనాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. పాడెను మేయర్ రవీందర్‌సింగ్ మోసి పథకాన్ని ప్రారంభించారు.

నిర్వహణకు రూ.1.50 కోట్లు కేటాయించాం..
దహన సంస్కారాలు నిర్వహించటం దైవకార్యంగా భావిస్తున్నామని, ఇందుకోసం రూ.1.50 కోట్లు కేటాయిస్తున్నాని తెలిపారు. నగరపాలక సంస్థ నగరంలో మౌళిక సదుపాయాలను అందించటంతోపాటుగా సామాజిక బాధ్యతగా అంత్యక్రియలు కూడా చేపట్టాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకున్నామని తెలిపారు. నగరంలోని అన్ని మతాలు, కులాలకు వారికి అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. రూపాయి చెల్లిస్తే వెంటనే డప్పులు, పాడె నుంచి మొదలు కొని దహన సంస్కారాల వరకు అన్ని కార్యక్రమాలను బల్దియా నుంచే చేపట్టటం జరుగుతుందన్నారు. ప్రతి దహన సంస్కారాలకు రూ. 6 వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చవుతుందని, ఈ మొత్తాన్ని కూడా నగర పాలక సంస్థ భరిస్తుందని తెలిపారు. సంప్రదాయంగా చేసే కార్యక్రమాలతోపాటుగా డప్పు చప్పుళ్లు, వాయిద్యాలను కూడా ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. దీనిలో బల్దియా సిబ్బంది పాల్గొన్ని అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య విభాగం సూపర్‌వైజర్ వేణుగోపాల్, స్థానిక పారిశుధ్య జవాన్ త్యాగరాజు, టీఆర్‌ఎస్ నాయకులు సోహన్ సింగ్ పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...