కారు జైత్రయాత్ర


Thu,June 13, 2019 02:14 AM

నిర్మల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన వరుస ఎన్నికల్లో గులాబీ ప్రభంజనం సృష్టించింది. టీఆర్‌ఎస్ విజయాల పరంపర కొనసాగింది. ఆది నుంచి ఆదిలాబాద్ జిల్లావాసులు ఉద్యమ పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో ఇంటిపార్టీని తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చేశారు. 2014 నుంచి టీఆర్‌ఎస్ పార్టీకి పూర్తిస్థాయిలో అండగా ఉంటున్నారు. 2014లో ఏడు అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు గెలువగా.. బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒకరు కూడా టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. దీంతో జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతా లో చేరాయి. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక్క ఆసిఫాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోగా.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆత్రం సక్కు కూడా ఆ పార్టీని వీడారు. ఇటీవల 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయగా.. ఆయన కూడా టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనమయ్యారు. దీంతో ఆ పార్టీకి జిల్లా నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం టీఆర్‌ఎస్ కోల్పోగా.. పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని మళ్లీ తన ఖాతాలో వేసుకుంది.

అధిక స్థానాలు ఇంటి పార్టీ కైవసం
జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 65 నుంచి 70 శాతం మంది టీఆర్‌ఎస్ మద్దతుదారు లు సర్పంచులుగా గెలుపొందారు. జిల్లాలో 1,508 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉండగా.. 1503 జీపీలకు ఎన్నికలు నిర్వహించారు. మరో అయిదు జీపీలకు గడువు ముగియకపోవటంతో ఎన్నికలు జరుగలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో 1,010 గ్రామ పంచాయతీలను టీఆర్‌ఎస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన ప్రాదేశిక పోరులో కారు జోరు కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో 567 ఎంపీటీసీ స్థానాలకు 326 ఎంపీటీసీ స్థానాలకు టీఆర్‌ఎస్ దక్కించుకుంది. 66 మండలాలకు.. 54 చోట్ల టీఆర్‌ఎస్ మండల పరిషత్‌లను దక్కించుకుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మం డలాలుండగా క్లీన్‌స్వీప్ చేసింది. నిర్మల్‌లో 18మండలాలకు 13, ఆదిలాబాద్‌లో 17 మండలాలకు 11, మంచిర్యాలలో 16 మండలాలకు 15 చోట్ల టీఆర్‌ఎస్ వారే ఎంపీపీలుగా గెలిచారు. 66 జడ్పీటీసీ స్థానాలకు 47 జడ్పీటీసీ స్థానాలు గెలుచుకుంది. మరో ఇద్దరు స్వతంత్రులు, ఇద్దరు కాంగ్రెస్ వారు టీఆర్‌ఎస్‌కే మద్దతు ఇవ్వడంతో.. వీరి సంఖ్య 51కి చేరింది. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తున్నారు. మరోవైపు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక వ్యూహం, సమన్వయంతో ముందుకెళ్తుండగా.. ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి పెట్టడంతో జిల్లాలో టీఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు.

జిల్లాలో కనుమరుగువుతున్న కాంగ్రెస్
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒకే ఒక అసెంబ్లీ స్థానం(ముథోల్)లో కాంగ్రెస్ అభ్యర్థి గెలువగా.. ఆ పార్టీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠ్ఠల్‌రెడ్డి కూడా తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఆ పార్టీకి జిల్లాలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆత్రం సక్కు గెలువగా.. ఇటీవల 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేశారు. దీంతో ఆయన కూడా ఈ 12 మంది ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ ఎల్పీ నుంచి టీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనమయ్యారు. దీంతో ఆ పార్టీకి జిల్లా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ మద్దతుదారులు అంతంత మాత్రంగానే గెలిచారు. గెలిచిన వారు కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో మూడో స్థానానికి పరిమితం కాగా.. పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. తాజాగా జరిగిన ప్రాదేశిక పోరులోనూ ఆ పార్టీ ఆశించిన మేర స్థానాలు దక్కలేదు. 567 ఎంపీటీసీ స్థానాలకు.. కేవలం 138 స్థానాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచా రు. 11 మంది జడ్పీటీసీ సభ్యులు గెలువగా.. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ జడ్పీటీసీ టీఆర్‌ఎస్‌లో చేరటంతో 10కి పడిపోయింది. నిర్మల్‌లో 5, మం చిర్యాలలో 2, ఆదిలాబాద్‌లో 3 చొప్పున జడ్పీటీసీ సభ్యులున్నారు. ఎంపీపీలకు సంబంధించి.. నిర్మల్‌లో 5, ఆదిలాబాద్‌లో 1, మంచిర్యాలలో ఒకటి చొప్పున మొత్తం 7ఎంపీపీ స్థానాలు మాత్రమే కాంగ్రెస్‌కు దక్కాయి.

బీజేపీ అంతంత మాత్రమే..
జిల్లాలో బీజేపీకి ఒక్క ఎంపీ స్థానం మినహా.. ఏ ఎన్నికల్లోనూ ఆశించిన మేర స్థానాలు రావటం లేదు. 2014 సాధారణ ఎన్నికల్లో ఒక్క స్థానం దక్క క పోగా.. తాజాగా 2018లోనూ అదే పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులు ఒకరిద్దరు తప్పా.. ఆశించిన స్థాయిలో ఎవరూ గెలవలేదు. తాజాగా ప్రాదేశిక పోరులోనూ ఆ పార్టీ ఉనికి అంతంత మాత్రమేనని తేలిపోయింది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో కొద్దిగా ఉన్నా.. మిగతా జిల్లాలో ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి జిల్లాలో 41స్థానాలు గెలువగా.. ఆదిలాబాద్‌లో 33, నిర్మల్‌లో 6, ఆసిఫాబాద్‌లో 3 చొప్పున ఎంపీటీసీ స్థానాలు గెలిచింది. మంచిర్యాల జిల్లాలో అసలు బోణీ చేయలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 3 ఎంపీపీ, 5 జడ్పీటీసీ స్థానాలు దక్కగా.. నిర్మల్ జిల్లాలో ఒక వైస్ ఎంపీపీ స్థానం దక్కింది. మిగతా జిల్లాల్లో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో ఖాతా కూడా తెరవలేదు. గ్రామస్థాయిలో కేడర్, సంస్థాగత నిర్మా ణం లేదనేందుకు ప్రాదేశిక ఫలితాలే నిదర్శనంగా ఉన్నాయి. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లా.. ప్రస్తుతం ఆ పార్టీల కోట కూలిపోయింది. అసలు టీడీపీ ఉనికి లేకుండా పోయింది. 2014 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటోంది. క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకులు, కేడర్ పార్టీని వీడగా.. ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీకి లీడర్లు, కేడర్ లేకుండా పోయింది. పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు లేకపోగా.. ఎన్నికల్లో పోటీ కూడా చేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే జిల్లాలో టీడీపీ ఉనికి కోల్పోయింది.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...