సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక


Thu,June 13, 2019 02:11 AM

-డీఎంఎఫ్‌టీ నిధుల వినియోగం, కార్మికుల
-ఇండ్ల పట్టాల మంజూరుపై సమావేశం
-కోల్ట్‌బెల్ట్ నేతలతో ముఖ్యమంత్రి
ముఖ్య కార్యదర్శి నర్సింగరావు భేటీ
మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయించే నిధులు, వాటి వినియోగంతో పాటు కార్మికుల ఇండ్ల పట్టాల మంజూరు విషయమై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.నర్సింగరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సీఅండ్‌ఎండీ ఎన్.శ్రీధర్, కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలతో జరిగిన ఈ భేటీలో వారి సూచనలు స్వీకరించగా, పలు నిర్ణయాలు తీసుకున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఫిబ్రవరి నెలలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కంపెనీ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకుని ఎంతోకాలంగా జీవిస్తున్న కార్మికులకు పట్టాలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకుగాను సింగరేణి సంస్థ ప్రత్యేక చొరవ తీసుకుంది. కార్మికులు ఇండ్లు నిర్మించుకున్న కంపెనీ స్థలాలు గతంలో ప్రభుత్వం ద్వారా సింగరేణి సంస్థ మైనింగ్ కార్యకలాపాల కోసం కేటాయించినవి కాగా, అక్కడ పట్టాలు మంజూరు చేసే బాధ్యతను సంస్థ ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. వీటితో పాటు ఖాళీగా ఉన్న సింగరేణి స్థలాలను గుర్తించి వాటిని కూడా ప్రభుత్వ అవసరాల వినియోగించాలని వారికి సూచించింది. ఇలా ఆరు జిల్లాల్లో కలిపి మొత్తం 1,713 ఎకరాల భూమిని తిరిగి సంబంధిత జిల్లా యంత్రాంగాలకు అప్పగించడంతో పట్టాలు పంపిణీకి మార్గం సుగమమైంది. తాజాగా ఈ అంశంపై సింగరేణి ఏరియాల్లోని ఎమ్మెల్యేలతో సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు ప్రత్యేకంగా సమీక్షించారు.

డీఎంఎఫ్‌టీ నిధుల వినియోగంపైనా చర్చ..
సింగరేణి సంస్థ సమీప గ్రామాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ కింద 2015 నుంచి ఇప్పటివరకు రూ.1,844 కోట్లను సంస్థ ఆరు జిల్లాల్లో కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేసింది. ఈ మొత్తంతో భారీ ఎత్తున సింగరేణి సమీప గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నాటి సమావేశంలో ఆ నిధులను ఏయే పనులకు ఖర్చు చేయాలి? ఏ విషయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే విషయాలపై కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేల నుంచి సూచనలు స్వీకరించారు. సింగరేణి పరిసర గ్రామాలు, పట్టణాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఈ నిధులను సద్వినియోగం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ సింగరేణి సంస్థ సీఅండ్‌ఎండీ ఎన్.శ్రీధర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ సుశీల్‌కుమార్, జాయింట్ డైరెక్టర్ రఫీక్ అహ్మద్‌తో పాటు సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్‌రావు(కొత్తగూడెం), గండ్ర వెంకటరమణారెడ్డి(భూపాలపల్లి), బాల్క సుమన్(చెన్నూరు), ఆత్రం సక్కు(ఆసిఫాబాద్), రేగా కాంతారావు(పినపాక) పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...