హరిత గని.. సింగరేణి


Tue,June 11, 2019 01:00 AM

హరితహారంలో భాగంగా 3.22 కోట్ల మొక్కలు నాటిన యాజమాన్యం
మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ:సింగరేణి హరితవనంగా మారింది. ఎటువైపు చూసినా పచ్చదనంతో కళకళలాడుతున్నది. ఒకప్పుడు దుమ్ము, దూళితో దర్శనమిచ్చిన గనులు, ఓసీపీలు చెట్లతో కనిపి స్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పర్యావరణ హితంలో సింగరేణి భాగస్వామ్య మవుతున్నది. ఇప్పటివరకు తనవంగా 3.22 కోట్ల మొక్కలు నాటింది. ఈ ఏడాది కూడా మరో కోటి మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉంది. 12 నర్సరీల్లో 50 రకాల వృక్షజాతుల మొక్కలు పెంచుతున్నారు. సీఎండీ శ్రీధర్ ప్రతీ ఏడాది హరితహారంలో స్వయంగా పాల్గొంటూ విజయవంతమయ్యేందుకు స్ఫూర్తినిస్తున్నాడు. ప్రతీ ఏడాది సంబంధిత శాఖలను, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లను హరితహార కార్యక్రమం విజయవంతం చేయడానికి ముందస్తుగా సమాయత్తం చేస్తున్నారు.

పర్యావరణహిత చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఎత్తున చేపట్టిన హరితహార కార్యక్రమంలో సింగరేణి సంస్థ తనవంతు బాధ్యతగా ఇప్పటికే 3.22 కోట్ల మొక్కలు నాటింది. ఈ ఏడాది చేపట్టనున్న హరితహారంలో తనవంతుగా మరో కోటి మొక్కలు నాటనుంది. సీఎండీ శ్రీధర్ ప్రతీ ఏడాది హరితహారంలో స్వయంగా పాల్గొంటూ సింగరేణిలో ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు స్ఫూర్తినిస్తున్నారు. ఈ ఏడాది కూడా కోటి మొక్కలు నాటడానికి సంసిద్ధంగా ఉండాలని సీఎండీ ఎన్ శ్రీధర్ సింగరేణి అటవీ పర్యావరణ శాఖలతో సమావేశాలు నిర్వహించి ఇప్పటికే ఆదేశించారు. ఈ మేరకు సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో ఉన్న 12 నర్సరీల్లో సుమారు 70 లక్షల మొక్కలను సంసిద్ధం చేశారు. మరో 30 లక్షల మొక్కలను ఇతర నర్సరీల నుంచి సమకూర్చుకోవడానికి ఏర్పాట్లు చేశారు. త్వరలోనే కోటి మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయనున్నారు.

మొదటి నుంచి ఉత్సాహంగా పాల్గొంటున్న సింగరేణి...
ముఖ్యమంత్రి తెలంగాణకు హరితహారం ప్రకటించిన తొలి ఏడాది సింగరేణి 84.5 హెక్టార్ల విస్తీర్ణంలో 40.08 లక్షల మొక్కలు నాటి ఈ భారీ పర్యావరణహిత కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తొలి అడుగు వేసింది. 2016లో 819 హెక్టార్లలో కోటి మొక్కలను, 2017లో 811 హెక్టార్లలో కోటి 10 వేల మొక్కలను, 2018లో 588 హెక్టార్లలో 90.31 లక్షల మొక్కలను నాటింది. సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లో గల మైనింగ్ ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు, ఓవర్ బర్డెన్ డంపులు, రోడ్ల వెంట ఈ మొక్కలను విస్తారంగా మొక్క లు నాటడమే కాక లక్షలాది మొక్కలను సమీప గ్రామాల రైతులు, ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసింది. ఇతరులు నాటిన వాటిలో పండ్ల మొక్కలు, ఇతర వృక్షజాతుల మొక్కలు అధిక సంఖ్యలో ఉన్నాయి. సింగరేణి ప్రాంతం లో హరితహారంలో నాటిన మొక్కలు ఎక్కువ శాతం బాగా పాదుకొని ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. సమీప గ్రామాల్లో పంపిణీ చేసిన మామిడి, జామ, బత్తాయి, నారింజ వంటి చెట్లు చక్కగా పెరుగుతున్నాయి. పేద రైతుల కోసం పంట రూపంలో వాడుకోవడానికి యూకలిపస్ చెట్లను కూడా కంపెనీ భారీగానే పంపిణీ చేసింది.

హరితహారంలోనే ఎక్కువ మొక్కలు
సింగరేణి 1984 నుంచి నిబంధనలకు లోబడి పర్యావరణహిత చర్యల్లో భాగంగా మొక్కలు నాటుతూ వస్తోంది. దీని కోసం కంపెనీ ఆరు జిల్లాల్లో 12 చోట్ల సొంతంగా నర్సరీలను ఏర్పాటు చేసింది. 1984 నుంచి 2008 వరకు గల 24 ఏండ్ల కాలంలో కంపెనీ 58.78 లక్షల మొక్కలు నాటింది. అంతే సగటున ఏడాదికి 2.44 లక్షల మొక్కలు నాటింది. కాగా 2009 నుంచి సగటున ఏడాదికి 14.48 లక్షల మొక్కలు నాటుతూ 2014 వరకు ఐదేండ్లలో మొత్తం 72.43 లక్షలు నాటింది. 1984 నుంచి 2014 వరకు 30 సంవత్సరాల కాలంలో సింగరేణి సంస్థ కోటి 31 లక్షల మొక్కలు నాటగా హరితహారం ప్రారంభమైన నాలుగేండ్లలో 3.32 కోట్ల మొక్కలు నాటడం గమనార్హం. ఈ ఏడాది కూడా మరో కోటి మొక్కలు నాటనుంది.

మొక్కల ఎంపికలో ప్రత్యేకత
అడవుల్లో నానాటికి కొన్ని ముఖ్యమైన వృక్షజాతులు కనుమరుగైపోతున్న విషయాన్ని గుర్తించిన యాజమాన్యం.. ఈ జాతుల మొక్కలనే ప్రధానంగా ఎంపిక చేసి ఆరు జిల్లాల్లో గల తన 12 నర్సరీల్లో పెంచుతూ వీటికి పునర్జీవం కల్పిస్తోంది. వీటినే ప్రత్యేకించి ఓబీ డంపులు, ఖాళీ స్థలాల్లో విస్తారంగా పెంచుతోంది. విశాలమైన ఖాళీ ప్రదేశాలలో ఈ మొక్కలను నాటడం (బ్లాక్ ప్లాంటేషన్) వల్ల అవి పెరిగి సహజ సిద్ధమైన అడవులుగా రూపుదిద్దుకుంటున్నాయి. పశుపక్ష్యాదులు కూడా వచ్చి చేరుతున్నాయి. సత్తుపల్లి, రుద్రంపూర్, మణుగూరు, బెల్లంపల్లి తదితర ప్రాంతాలలో సింగరేణి వృద్ధి చేసిన ప్లాంటేషన్లు నేడు సహజ అడవులను పోలి వాటికన్న ఎక్కువ వృక్ష సాంద్రతతో పర్యావరణానికి దోహదపడుతున్నాయి. అడవుల నుంచి కనుమరుగైపోతున్న కొన్ని ప్రధాన వృక్షజాతులు, ఇతర మొక్కలతో కలిపి మొత్తం 50 రకాల మొక్కలను ప్లాంటేషన్‌న్లలో పెంచుతున్నారు. వీటిలో నారెప, వెదురు, మారేడు, నేరుడు, చిందుగ, నెమలినార, తాని, మర్రి, ఎర్రచందనం, ఏగిస, జువ్వి, బూరుగ, జిట్రేగి, రావి, ఉసిరి, మేడి, బట్టగణం, సిస్సో వంటి జాతులున్నాయి.

ప్రత్యేక ఆకర్షణగా నర్సరీలు, ప్లాంటేషన్లు...
సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న నర్సరీలు పెంచుతున్న ప్లాంటేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాష్ట్ర అటవీశాఖ అధికారులు కూడా కొత్తగా నియుక్తులైన అటవీ అధికారులకు వీటిని రోల్ మోడల్స్‌గా చూపిస్తూ వివరిస్తున్నారు. సింగరేణి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఒక రిటైర్డ్ సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి, ఒక జీఎం స్థాయి అధికారి, సింగరేణి అటవీశాఖ అధిపతిలుగా నియమించింది. అన్ని ఏరియాలలో ఫారెస్టు అధికారులను, సిబ్బందిని నియమించింది. మొక్కల పెంపకం, నాటడం, వాటి పరిరక్షణ వంటి పనులను సింగరేణి ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల రైతులకు, నిరుద్యోగ యువతకు అప్పగిస్తూ వారికి ఉపాధి కూడా కల్పిస్తోంది.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...