ఏసీబీకి చిక్కిన ఏఓ


Sun,May 26, 2019 03:39 AM

-రూ.50వేలు తీసుకుంటూ పట్టుబడిన ఆర్డీవో కార్యాలయ సూపరింటెండెంట్ మనోహర్
-ఎలక్షన్ వీడియోగ్రఫీ బిల్లు మంజూరు కోసం ముప్పుతిప్పలు
-రూ.2 లక్షల బిల్లు కోసం రూ.75వేలు డిమాండ్
మంచిర్యాల రూరల్ : చేసిన పనికి బిల్లు చెల్లించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన మంచిర్యాల ఆర్డీవో కార్యాలయ సూపరింటెండెంట్ చివరికి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. మంచిర్యాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయ సూపరింటెండెంట్ మనోహర్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రక్రియను వీడియో తీయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి మంచిర్యాల నియోజకవర్గంలో వీడియో చిత్రీకరణ కోసం 12 మంది వీడియోగ్రాఫర్లను ఈ పని అప్పగించారు. వీరికి రోజుకు ఒక్కరికి రూ.1200 చెల్లించేందుకు జిల్లా ఎన్నికల అధికారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటికి సంబంధించిన బిల్లు రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఆ బిల్లు ఇచ్చేందుకు సూపరింటెండెంట్ మాత్రం ఈ 12 మంది కలిసి రూ.75వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 10 మందికి డబ్బులను చెల్లించారు. అప్పాసు రాముతో పాటు మరో వ్యక్తి సంపత్‌కు సంబంధించిన బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆరు నెలల నుంచి బిల్లుల కోసం తిరుగుతున్నా పెండింగ్‌లో పెట్టారు. డబ్బులు ఇవ్వాలని ఆ ఇద్దరిపై ఒత్తిడి తీసుకు రావడంతో గత్యంతరం లేక రూ. 50 వేలు ఇచ్చేందుకు అంగీకరించి.. విషయం ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పథకం ప్రకారం శనివారం కార్యాలయం బయట లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. మనోహర్‌ను అరెస్టు చేసి, డబ్బు స్వాధీనం చేసుకొని ఆదివారం కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో రిమాండ్ చేస్తామని పేర్కొన్నారు. ఈ దాడిలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ ఇన్‌స్పెక్టర్లు వేణుగోపాల్, ప్రశాంత్, రవీందర్, కానిస్టేబుల్ శ్రీనివాస్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...