గులాబీ విజయఢంకా


Fri,May 24, 2019 04:23 AM

-తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకూ ఆధిక్యం
-కారు స్పీడుకు కాంగ్రెస్ చిత్తు చిత్తు
-కనీస పోటీ ఇవ్వలేక పోయిన హస్తం
-సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు జైకొట్టిన ఓటరు
-పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య కౌంటింగ్
-ప్రశాంతంగా ముగిసిన ఓట్ల లెక్కింపు..
-పటాకలు కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు
-ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు : బోర్లకుంట

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కారు జోరు కొనసాగింది. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్‌పై గులాబీ జెండా రెపరెపలాడింది. పెద్దపల్లి ఎంపీగా బోర్లకుంట వెంకటేశ్‌నేత భారీ మెజార్టీతో గెలుపొందారు. పెద్దపల్లి సెగ్మెంట్‌కు గత నెల 11న ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి రామగిరి మండలంలోని మంథని జేఎన్‌టీయూహెచ్‌లో గురువారం కౌంటిం గ్ చేపట్టారు. పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శ్రీదేవసేన ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్‌లతో పాటు సర్వీస్ ఓట్లు లెక్కించారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 625మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోగా, 342మంది సర్వీస్ ఓటర్లు ఓటేశారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి అగం చంద్రశేఖర్ రావుకు 186ఓట్లు, టీఆర్‌ఎస్ అభ్యర్థి బోర్లకుంటకు 314ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కుమార్‌కు 301 వచ్చాయి. పెద్దపల్లి పార్లమెంట్‌కు నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం పోస్టల్ బ్యాలెట్‌తో కలుపుకొని 9,70,051మంది ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బోర్లకుంట వెంకటేశ్ నేతకానికి 4,41,321 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆగం చంద్రశేఖర్‌కు 3,46,141 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్.కుమార్‌కు 92,606 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ నేత తన సమీప అభ్యర్థి ఆగం చంద్రశేఖర్ రావుపై 95,180ఓట్లు మెజార్టీతో తొలిసారి పెద్దపల్లి ఎంపీగా గెలుపొందారు. పెద్దపల్లి స్థానాన్ని వరుసగా రెండు సార్లు 2014, 2019లో టీఆర్‌ఎస్ దక్కించుకోవడం విశేషం.

తొలి రౌండ్ నుంచే కారు జోరు..
మంథని జేఎన్‌టీయూహెచ్‌లో కౌంటింగ్ ప్రారంభమైన సమయం నుంచే టీఆర్‌ఎస్ దూసుకెళ్లింది. తొలి రౌండ్ నుంచి మొదలుకొని చివరి రౌండ్ దాకా తన ఆధిక్యాన్ని చూపింది. ప్రతి రౌండ్‌లోను టీఆర్‌ఎస్ అభ్యర్థి మోజార్టీ సాధిస్తూ వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్ రావు మంథని, రామగుండం నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాడు. తొలి రౌండ్‌లో మొదలైన అధిపత్యం 22వ రౌండ్ దాకా కొనసాగింది. ప్రతి రౌండ్‌లోని బోర్లకుంట వెంకటేశ్‌కు 3వేల నుంచి మొదలుకొని 5వేల దాకా మెజార్టీ సాధించారు. పోస్టల్ బ్యాలెట్ నుంచి మొదలుకొని ప్రతి రౌండ్ వరకు టీఆర్‌ఎస్ అధిక్యం సాధించింది. ఓట్ల లెక్కింపును టీఆర్‌ఎస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ నేతతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్ పరిశీలించారు. గెలుపుపై ఆశలు సన్నగిల్లడంతో ఉదయం 11గంటల తర్వాత ఆగమ చంద్రశేఖర్ ఇంటిదారి పట్టారు.

ఆధిక్యంలో చెన్నూర్ ఫస్ట్..
పెద్దపల్లి సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌కు 95,180 మెజార్టీ రాగా, ఒక చెన్నూర్ నియోజకవర్గం నుంచే 29,723 ఆధిక్యం వచ్చింది. అక్కడ పార్టీకి 29,723 ఓట్ల మోజార్టీ రాగా, బెల్లంపల్లి నియోజకవర్గంలో 19,890, మంచిర్యాలలో 15,158, ధర్మపురి నియోజకవర్గంలో 24,672, పెద్దపల్లి నియోజకవర్గంలో 13,367 మెజార్టీ రాగా, రామగుండం, మంథనిలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో నిలిచారు.

మాట నిలబెట్టుకున్న మంత్రి కొప్పుల..
పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ బోర్లకుంట వెంకటేశ్ నేతకానికి ఇస్తే తప్పకుండాభారీ మోజార్టీతో గెలిపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇచ్చిన మాటను మంత్రి కొప్పుల ఈశ్వర్ నిలుపుకున్నారు. టికెట్ ఇప్పించడంతో పాటు నియోజకవర్గంలోని ఏడు శాసనసభల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామగ్రామాన కలియదిరుగుతూ బోర్లకుంటను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి మాట ఇచ్చినట్లుగానే 95,052ఓట్లు మోజార్టీతో వెంకటేశ్‌ను గెలిపించడమే కాకుండ తన నియోజకవర్గమైన ధర్మపురిలో 24,672 మెజార్టీ సాధించారు. గత శాసనసభ ఎన్నికలతో పోల్చుకుంటే భారీ మెజార్టీ రావడం విశేషం.

ప్రతిష్ట భద్రత నడుమ ఓట్ల లెక్కింపు..
పెద్దపల్లి పార్లమెంట్ ఓట్ల లెక్కింపు సందర్భంగా రామగుండం సీపీ సత్యనారాయణతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు సుదర్శన్ గౌడ్, డీసీపీ రక్షిత కే మూర్తి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. కౌంటింగ్ జరుగుతున్న జేఎన్‌టీయూహెచ్‌తో పాటు కళాశాల ఆవరణలో నలుగురు అడిషనల్ డీసీపీలు, 10మంది ఏసీపీలు, 25మంది సీఐలు, 50మంది ఎస్‌ఐలతోపాటు 1,500 పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రానికి వచ్చిన మీడియా ప్రతినిధులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. కళాశాలకు వచ్చే వివిధ మార్గాలను మూసి ఉంచారు. నిర్దేశించిన మార్గాలోనే వచ్చిన వారినే లోపలికి అనుమతించారు.

నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్లు..
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం జేఎన్‌టీయూ హెచ్ కళాశాలలో జరిగిన పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం 7 సెగ్మెంట్‌లలో బూత్‌ల వారీగా ఐదు వీవీ ప్యాట్‌లు లెక్కించాలనే నిబంధన మేరకు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మొత్తం 35వీవీ ప్యాట్‌లను లెక్కించారు. పెద్దపల్లి శాసనసభ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు 36, 5, 139, 261, 111, రామగుండం పరిధిలో 23, 81, 55, 199, 256, మంచిర్యాల 155, 54, 221, 09, 217, 116, మంథనిలో 20, 95, 186, 247, 263, బెల్లంపల్లి పరిధిలో 07, 18, 37,119,162, ధర్మపురి 69, 131, 178, 182, 194, చెన్నూరు 21, 24, 53, 68, 194 పోలింగ్ కేంద్రాల్లోని వీవీ ప్యాట్లను లెక్కించారు. కాగా, కౌంటింగ్ అనంతరం గురువారం రామగుండంలోని జేఎన్‌టీయూహెచ్ కళాశాల నుంచి వీవీ ప్యాట్‌లు, ఈవీఎంలను బాక్సులలో ఉంచి ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు లారీల ద్వారా గూడ్స్ బస్సుల ద్వారా జిల్లా కేంద్రానికి తరలించారు. 7 సెగ్మెంట్‌లలోని వీటిని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సీజ్ చేసి ఉంచుతారని తెలిసింది.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...