విత్తనాలు, ఎరువులకు రశీదు తప్పనిసరి


Thu,May 23, 2019 01:25 AM

మంచిర్యాల అగ్రికల్చర్ : రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు రశీదు తప్పకుండా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వుల్లోజు వినోద్‌కుమార్‌తో కలిసి 2019 వానాకాలం ప్రణాళికపై వ్యవసాయశాఖ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక్కడ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పంటల సాగు కోసం అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో దుకాణ యాజమాని వద్ద నుంచి తప్పకుండా రశీదు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు జిల్లాలోకి రాకుండా సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ అరికట్టడంతో పాటు ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ విత్తనాలు విక్రయించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల స్థాయిలో రైతులకు ఎరువులు, విత్తనాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు రసాయనిక పురుగు మందులు, ఎరువులను వాడకుండా ప్రకృతిలో లభించే సహజ వనరులను వినియోగిస్తూ సేంద్రియ వ్యవసాయం వల్ల జరిగే ఉపయోగాలను వివరించాలన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు అధిక పంట దిగుబడి సాధించవచ్చన్నారు.

జిల్లాలో ఖరీఫ్‌లో అధికంగా పత్తి, వరి, మక్కజొన్న పంటలు సాగయ్యే అవకాశం ఉందనీ, కడెం ప్రాజెక్టు ద్వారా 25వేల 81హెక్టార్లలో, ర్యాలీవాగు, నీల్వాయి, గొల్లవాగు ప్రాజెక్టుల ద్వారా 2,833 హెక్టార్లలో, చిన్న తరహా ప్రాజెక్టుల ద్వారా 33వేల 202 హెక్టార్లు, గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా 25 వేల 81 హెక్టార్లలో సాగవుతుందని వివరించారు. జిల్లాలో బెల్లంపల్లి, భీమిని, చెన్నూర్, మంచిర్యాల డివిజన్లలోని 406 గ్రామాల్లో లక్షా 26వేల 616 మంది రైతులున్నారనీ, ఈ ఏడాదికిగాను లక్షా 5వేల 400 ఎకరాల్లో వరి, లక్షా 51 వేల 475 ఎకరాల్లో పత్తి, ఇతర పంటలతో కలిపి మొత్తం 2లక్షల 84వేల 998 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నాయని పేర్కొన్నారు. ఇందుకుగాను 35వేల 355 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు, యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంఓపీ, తదితర లక్షా 28వేల 250 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమనీ, వీటిని రైతులకు అవసరమైన మేరకు అందించనున్నట్లు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం బీటీ-3 మందులను నిషేధించిందనీ, విక్రయించిన వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టంచేశారు. రైతులు కూడా వీటిని వినయోగించవద్దని సూచించారు. ఈ నెల 29, 30 తేదీల్లో మండల స్థాయిలో రైతులకు విత్తనాల కొనుగోలు, ఎరువులు, కలుపు మందుల వినియోగంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామనీ, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వ్యవసాయ శాఖకు సంబంధించి ఖరీఫ్ ప్రణాళిక బుక్‌లెట్‌ను విడుదల చేశారు. సమావేశంలో ఏడీఏలు శ్రీనివాస్, బాపు, ఇంతియాజ్ అహ్మద్, ఏఓలు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...