అక్రమ ఫైనాన్స్‌లపై పోలీసుల కొరడా


Mon,May 20, 2019 11:13 PM

-అనుమతుల్లేని వడ్డీ వ్యాపారాలపై ఉక్కుపాదం
-కమిషనరేట్‌ పరిధిలో విస్తృత దాడులు
-పరారీలో మరో 70 మంది నిర్వాహకులు
-మరో 150 ఫైనాన్స్‌ల గుర్తించాం:65.52 లక్షలు స్వాధీనం
-సీపీ సత్యనారాయణ
-విచారణ చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడి

మంచిర్యాల టౌన్‌, నమస్తే తెలంగాణ: అక్రమ ఫైనాన్స్‌లపై కొరడా ఝులిపించారు. సామన్యుల అవసరాలను ఆసరాగా తీసుకొని అధిక వడ్డీలు వసూలు చేస్తున్న అక్రమ దందా చేస్తున్నవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పారిశ్రామిక ప్రాంతంలోని అక్రమ ఫైనాన్స్‌ వ్యాపారుల వివరాలు సేకరించి, టాస్క్‌ఫోర్సు, సీసీఎస్‌, స్థానిక పోలీసులు ఏకకాలంలో 60 టీఎంలతో దాడులు నిర్వహించారు. కమిషనరేట్‌ పరిధిలోని 11 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 49 మందిని అరెస్టు చేసి, రూ.65.52 లక్షల నగదు, 1235 ప్రాంసరీ నోట్‌లు, 1019 బ్యాంక్‌ చెక్‌లు, 347 ఏటీఎం కార్డులు, 175 బాండ్‌పేపర్లు, 23 ల్యాండ్‌ పేపర్లు, 9 పట్టాదారు పాస్‌ బుక్‌లు స్వాధీనం చేసుకున్నామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఎల్లందు గెస్ట్‌హౌస్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం.. కమిషనరేట్‌ పరిధిలో ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని సింగరేణి ఉద్యోగులు, ఇతర చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని పలువురు వ్యాపారులు రోజువారీ వడ్డీ వ్యాపారం (గిరి గిరి దందా) కొనసాగిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీనికితోడు వాహనాలు, బంగారు ఆభరణాలను తనఖా పెట్టుకుంటూ రెండు జిల్లాలో దందా కొనసాగిస్తున్నారనీ, అక్రమంగా కోట్లాది రూపాయలు ఆర్జించారనే సమాచారం మేరకు పోలీసులు ఈ దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో మంచిర్యాల టౌన్‌ పరిధిలోని మంచిర్యాలకు చెందిన శ్రీ లక్ష్మీ హైర్‌ పర్చేజ్‌, కమర్షియల్‌ ఫైనాన్స్‌కు చెందిన పవన్‌కుమార్‌ తివారీ, పద్మప్రియ ఫైనాన్స్‌కు చెందిన సందిరెడ్డి శ్రీనివాస్‌, శ్రీ వేంకటేశ్వర ఫైనాన్స్‌కు చెందిన గుమ్మడి మస్తాన్‌ యాదవ్‌, నవరత్న హైర్‌ పర్చేజ్‌ ఫైనాన్స్‌కు చెందిన వెంపటి సత్యనారాయణ, రామాంజనేయ హైర్‌పర్చేజ్‌ ఫైనాన్స్‌కు చెందిన పడాల అశోక్‌బాబు, శ్రీసాయి ఫైనాన్స్‌కు చెందిన సుజిత్‌ కుమార్‌, లక్ష్మీగణపతి ఫైనాన్స్‌కు చెందిన అందరి రమేష్‌, శ్రీ సింగరేణి చిట్స్‌ ప్రై.లికు చెందిన నేరెళ్లి సాయికృష్ణ, శ్రీలక్ష్మీ హైర్‌ పర్చేజ్‌ ఫైనాన్స్‌కు చెందిన రావికంటి సతీశ్‌, వైష్ణవి హైర్‌ పర్చేజ్‌ ఫైనాన్స్‌కు చెందిన బట్టు రవికుమార్‌, స్నేహాంజలి ఫైనాన్స్‌కు చెందిన ఎగ్గు శ్రీనివాస్‌, విజయశ్రీ ఫైనాన్స్‌కు చెందిన ముదాం రమేష్‌, సీసీసీ నస్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అమ్మ హైర్‌ పర్చేజ్‌ ఫైనాన్స్‌కు చెందిన గజెల్లి గణేష్‌, బెల్లంపల్లి టూ టౌన్‌ స్టేషన్‌ పరిధిలోని శ్రీ వైష్ణవి హైర్‌ పర్చేజ్‌ ఫైనాన్స్‌కు చెందిన కుదిరిపాక సత్యనారాయణ, నగరపు రామయ్య, శ్రీ వేంకటేశ్వర ఫైనాన్స్‌కు చెందిన చింతనిప్పుల రమేష్‌, తాండూరు పీఎస్‌ పరిధిలోని శ్రీ లక్ష్మీ గణపతి హైర్‌ పర్చేజ్‌ ఫైనాన్స్‌కు చెందిన మద్దికుంట రాంచందర్‌, మందమర్రి పీఎస్‌ పరిధిలోని మారుతీ ఫైనాన్స్‌కు చెందిన ఆది దేవేందర్‌, శ్రీ మెడికల్‌ దుకాణానికి చెందిన బత్తుల శంకర్‌, బెల్లంపల్లి వన్‌ టౌన్‌ పరిధిలో వేద హైర్‌ పర్చేజ్‌ ఫైనాన్స్‌కు చెందిన పోతరాజు మంగమూర్తి, చెన్నూర్‌ పీఎస్‌ పరిధిలో బండారి సంతోష్‌, కోమటిపల్లి రమేశ్‌, గాదె రాజన్న, పోగుల చంద్రశేఖర్‌, పోగుల ఆనంద్‌, కుందారపు రవీందర్‌, చెన్నం సంతోష్‌, మాచినేని లక్ష్మణ్‌, పోగుల సతీష్‌, శ్రీ లక్ష్మీ హైర్‌ పర్చేజ్‌ ఫైనాన్స్‌కు చెందిన చింతల సుదర్శన్‌, పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి పీఎస్‌ పరిధిలో మడిగొండ సదాశివ, కోలేటి ప్రసాద్‌, గోదావరిఖని వన్‌ టౌన్‌ పరిధిలో పర్స వెంకటేశ్వర్లు, వేముల శ్రీనివాస్‌, పొన్నం విజయ్‌కుమార్‌ గౌడ్‌, మహంకాళి స్వామి, పొన్నం లక్ష్మయ్య, కాసాని శ్రీనివాస్‌, ఎడవెల్లి రవీందర్‌ రెడ్డి, అవనిగంటి ఎల్లేశ్‌, కోరం రవీందర్‌ రెడ్డి, అనుమ సత్యనారాయణ, గుర్రం శ్రీనివాస్‌, మంత్రి శ్యాంసుందర్‌, ఎన్టీపీసీ పీఎస్‌ పరిధిలో గౌతమినగర్‌కు చెందిన బేతి రాంచంద్రారెడ్డి, సీసీ నస్పూర్‌కు చెందిన బూడిద మహేందర్‌, గోదావరిఖని టూ టౌన్‌ పరిధిలోని యైటింక్లయిన్‌ కాలనీకి చెందిన పంజాల సదానందం, పోలవేని రమేశ్‌, అనంతుల రాజులను అరెస్టు చేశామనీ వివరించారు. అక్రమ ఫైనాన్స్‌లపై ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందన్నారు. ఈ మేరకు మంచిర్యాలకు చెందిన కనకదుర్గ ఫైనాన్స్‌, లక్షెట్టిపేటకు చెందిన వేదశ్రీ ఫైనాన్స్‌, వేంకటేశ్వర ఫైనాన్స్‌, మందమర్రికి చెందిన లలిత ఆదిత్య చిట్‌ఫండ్‌, నిత్యశ్రీ ఫైనాన్స్‌, మందమర్రికి చెందిన నాగలక్ష్మీ ఫైనాన్స్‌, ఎన్టీపీసీ భవిత చిట్‌ఫండ్‌, గోదావరిఖనికి చెందిన కర్రె శ్రీనివాస్‌, ముడతనపల్లి ప్రవీణ్‌కుమార్‌, రాదే శ్యాం లోయ, గౌరిశెట్టి రంగయ్యతోపాటు ఇంకా 150 అక్రమ ఫైనాన్స్‌లు నడుస్తున్నాయ ని వెల్లడించారు.

వీటిపై పూర్తి స్థాయి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి తోడు అప్పుల రికవరీ కోసం ప్రైవేట్‌ ఫైనాన్స్‌ యజమానులు రికవరీ సిబ్బందిని ఏర్పర్చుకొని కమిషన్లపై పాత బకాయిలు వసూలు చేయడం, కట్టని వారిని బెదిరించడం, స్త్రీలను అగౌరవపర్చడం, కిడ్నాప్‌లు, దాడులకు పాల్పడటం, మానసిక, శారీరక హింసలకు గురి చేయడం విచారణలో తేలిందనీ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న రికవరీ గుండాలపై అవసరమైతే పీడీ యాక్టు ప్రయోగిస్తామన్నారు. అక్రమ ఫైనాన్స్‌ దందాపై లోతుగా ఆరా తీయడంతోపాటు పోలీస్‌ శాఖతో పాటు ఎవరైనా ప్రముఖ వ్యాపారుల హస్తం ఉందా అని పూర్తి స్థాయిలో విచారణ జరిపి అవసరమైన పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు.

నిబంధనలు పాటించాలి
ఫైనాన్స్‌ నిర్వహించాలంటే రిజిస్ట్రేషన్‌తోపాటు ఫైనాన్స్‌ పేరిట టాన్‌, పాన్‌ కార్డు, మనీ లెండింగ్‌ లైసెన్సు తప్పనిసరిగా ఉండటంతో బ్యాంక్‌ ఖాతా ద్వారానే లావాదేవీలు జరపాలనీ, ఆదాయ పన్ను రికార్డులను ఏటా ఫైనాన్స్‌ ఆడిటింగ్‌ సంబంధిత అధికారులకు అందజేయాలనీ, ఫైనాన్స్‌ కార్యాలయాలకు డీడ్‌ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా ఎవరైనా లైసెన్సుతో అప్పులు ఇవ్వచ్చు, తీసుకోవచ్చు, చట్ట విరుద్ధంగా వడ్డీ రేట్లతో సామాన్యుల నడ్డివిరిచి దౌర్జన్యం చేసేవారే తమ లక్ష్యమనీ, ఆస్తులు కబ్జా చేసి అగౌరవ పర్చినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఫైనాన్స్‌ అక్రమ దందా గుట్టు రట్టు చేసి ప్రతిభ చూపిన టాస్క్‌ఫోర్సు, ఇతర సిబ్బందిని అభినందించారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీలు అడ్మిన్‌ అశోక్‌కుమార్‌, లా అండ్‌ ఆర్డర్‌ రవికుమార్‌, మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు రక్షిత కే మూర్తి, సుదర్శన్‌ గౌడ్‌, గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లి ఏసీపీలు ఉమేందర్‌, గౌస్‌బాబా, బాలు జాదవ్‌, టాస్క్‌ఫోర్సు సీఐలు సరిలాల్‌, సాగర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...