బ్యాలెట్‌లో భవితవ్యం


Thu,May 16, 2019 02:03 AM

-మూడు విడతల్లో ముగిసిన పరిషత్‌ పోలింగ్‌
-స్ట్రాంగ్‌ రూమ్స్‌లోని బ్యాలెట్‌లో అభ్యర్థుల భవితవ్యం
-27న ఉత్కంఠతకు తెర.. తేలనున్న భవిష్యత్తు..
-మరో 11 రోజుల్లో స్థానిక ఫలితాల ప్రకటన
నిర్మల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 70 మండలాలు ఉండగా.. ఇందులో 66 గ్రామీణ మండలాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,508 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 66 జడ్పీటీసీ, 567ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 6న తొలి, 10న రెండు, 14న తుది విడత పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ ముగియగా.. ఇక ఫలితాల ప్రకటనే మిగిలింది. తొలి విడతలో భాగంగా ఈ నెల 6న ఉమ్మడి జిల్లాలో 26 జడ్పీటీసీ స్థానాలు, 196 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. రెండో విడత కింద 20 మండలాల్లోని 20 జడ్పీటీసీ స్థానాలకు, 181 ఎంపీటీసీ స్థానాలకు గాను.. 174 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నిర్మల్‌ జిల్లాలో నాలుగు, మంచిర్యాల జిల్లాలో మూడు.. మొత్తం ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మూడో విడతలో భాగంగా ఈ నెల 14న ఉమ్మడి జిల్లాలో 20 జడ్పీటీసీ స్థానాలతోపాటు 192 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

భారీ సంఖ్యలో పాల్గొన్న ఓటర్లు
మూడు విడతల్లోనూ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో సగటున తొలి విడతలో 78.83 శాతం, రెండో విడతలో 76.35 శాతం పోలింగ్‌ నమోదుకాగా.. మూడో విడతలో 76 శాతం పోలింగ్‌ నమోదయింది. మూడు విడతల్లోనూ 76 శాతానికిపైగా పోలింగ్‌ నమోదుకాగా.. అన్ని జిల్లాల్లోనూ 74 శాతానికిపైగా పోలింగ్‌ నమోదు కావటం గమనార్హం. తొలి విడత కంటే రెండో విడతలో స్వల్పంగా పోలింగ్‌ శాతం తగ్గగా.. తొలి, రెండో విడత కంటే మూడో విడతలో పోలింగ్‌ శాతం స్వల్పంగా తగ్గింది. తొలి విడత కంటే రెండో విడతలో 2.48 శాతం తగ్గింది. రెండో విడత కంటే మూడో విడతలో 0.35 శాతం తగ్గింది. తొలి విడత కంటే మూడో విడతలో 2.83 శాతం పోలింగ్‌ తక్కువగా ఉంది. 76.35 శాతంగా నమోదయింది. జిల్లాలవారీగా చూస్తే.. ఆదిలాబాద్‌లో తొలి విడతలో 82.13 శాతం, రెండో విడతలో 75.33 శాతం, మూడో విడతలో 74.26శాతం నమోదయింది. నిర్మల్‌ జిల్లాలో తొలి విడతలో 76.30 శాతం, రెండో విడతలో 76.67 శాతం, మూడో విడతలో 78.53 శాతంగా ఉంది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తొలి విడతలో 80.82 శాతం, రెండో విడతలో 76.14 శాతం, మూడో విడతలో 75.65 శాతం చొప్పున నమోదయింది. మంచిర్యాల జిల్లాలో తొలి విడతలో 75.95 శాతం, రెండో విడతలో 77.26 శాతం, మూడో విడతలో 75.58 శాతం చొప్పున పోలింగ్‌ జరిగింది.

మూడో విడతలోనూ నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలో మహిళలు అధికంగా పోలింగ్‌లో పాల్గొనగా.. ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో పురుషులు అధికంగా పాల్గొన్నారు. మూడో విడతలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 4,87,844 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 3,70,936 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. ఈ లెక్కన 76 శాతం పోలింగ్‌ నమోదయింది. ఉమ్మడి జిల్లాలోని ఓటర్లలో మొత్తం 2,40,814 మంది పురుష ఓటర్లు ఉండగా.. 1,83,582 మంది పురుష ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. దీంతో 76.23 శాతం మంది పురుష ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. జిల్లాలో 2,47,005 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 1,87,352 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో మహిళల 75.85 శాతం పోలింగ్‌ నమోదయింది. ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగం చేసుకోగా.. పోలింగ్‌ శాతంలో మాత్రం పురుషులదే ఎక్కువగా నమోదయింది. ఇతరుల విషయానికొస్తే 25 మంది ఓటర్లుండగా... ఇందులో ఇద్దరు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ ప్రక్రియ ముగియటంతో.. ఇక ఫలితాలు ప్రకటనే మిగిలింది. ఇప్పటికే అభ్యర్థుల గ్రామాలు, కుటుంబాలు, వార్డులు, సామాజిక వర్గాలవారీగా ఓట్ల లెక్కలో మునిగి తేలుతున్నారు. ఈ నెల 27న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉండగా.. మరో 11రోజుల పాటు వేచి చూడాలి. ఈ నెల 27న అభ్యర్థుల భవితవ్యం తేలిపోతుండగా.. అప్పటి వరకు తీవ్ర ఉత్కంఠ తప్పేలా లేదు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...