24 ఏండ్ల పోరాటం..


Thu,May 16, 2019 01:55 AM

-నాడు తండ్రి.. నేడు కొడుకు..
- పట్టాకెక్కని వారసత్వ భూమి
- విరాసత్‌ కోసం తిరిగీతిరిగి తండ్రి మృతి
-గతేడాది హద్దులు చూపి పంచనామా చేసిన అధికారులు
-రైతుబంధు సాయానికీ నోచుకోని వైనం
- ఇదీ వేమనపల్లి రైతు పతాగిరి శంకర్ ఆవేదన

వేమనపల్లి : నా పేరు పతాగిరి శంకర్‌. మాది వేమనపల్లి. గ్రామ శివారులో మా తాత చిన్నయ్యకు సర్వే నెంబర్‌ 13లో ఐదెకరాల భూమి ఉంది. మా తాతకు ఇద్దరు కొడుకులు. నేను రెండవ కొడుకు కొడుకును. మా పెద్దనాన్న మేదరి(పతాగిరి) లింగయ్య పేరు మీద రెవెన్యూ అధికారులు ఫైనల్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఆ భూమిలో సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాం. మా పెద్దనాన్న 1995లో చనిపోవడంతో అతడి కుమారుడు వెంకటేశ్‌కు ఐదెకరాల భూమిలో అతడి వాటాకు 2.25 ఎకరాలు విరాసత్‌ చేశారు. మా నాన్న మల్లయ్యకు సంబంధించిన 2.15 ఎకరాలకు మాత్రం విరాసత్‌ కాలేదు. దీని గురించి రెవెన్యూ అధికారుల చుట్టూ మా నాన్నా తిరని రోజు లేదు. పోయినప్పుడల్లా రేపు, మాపంటూ తిప్పకున్నరు. తాసిల్‌ ఆఫీస్‌ 25 కిలోమీటర్ల దూరంలో చెన్నూరులో ఉంటది. ఒక్కసారి పోయి రావాలంటే రూ.200 ఖర్చయితది.

పైసలు పోతేపోయినయ్‌ పని కావాలన్నని మా నాన్న పోయేది. ఓసారి తాసిల్దార్‌ లేడనీ, ఆ సారు ఉంటే వీఆర్‌ఓ లేడని చెప్పెటోళ్లు. ఇద్దరుంటే తర్వాత రమ్మని ఆఫీస్‌ చుట్టూ తిప్పుకునేటోళ్లు. గిట్ల తిరిగీతిరిగి మూడేండ్ల క్రితం మా తండ్రి మల్లయ్య చనిపోయిండు. అప్పటినుంచి ఆయనకు రావాల్సిన 2.25 ఎకరాల భూమిని విరాసత్‌ చేయాలని తాసిల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. ఎన్నోసార్లు తాసిల్‌ ఆఫీస్‌ల దరఖాస్తు ఇచ్చిన. పోయినేడాది 2018లో ఏప్రిల్‌ 4 తారీఖు నాడు రెవెన్యూ అధికారుల మోఖా మీద హద్దులు పెట్టి సర్వే నెంబరు 13లో మోఖా మీద ఉన్నమని పంచనామా చేసి పత్రాలు కూడా ఇచ్చిన్రు. కానీ భూ రికార్డుల ప్రక్షాళన చేసినప్పుడు మా భూమి విరాసత్‌ కాలేదు. దీని వల్ల ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుబంధు సాయం రాకుంట పోయింది. అటు బ్యాంకులో లోన్‌ కూడా వస్తలేదు. దయచేసి అధికారులు ఆ భూమిని నా పేరు మీద చేసి నా కొత్త పాసు ఇయ్యాలె. ఆ భూమినే నమ్ముకొని బతుకుతున్న మా కుటుంబానికి న్యాయం చేయాలె

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...