డబ్బులిస్తే పనైపోయేది...


Fri,April 26, 2019 12:58 AM

- బాధిత రైతుతో రెవెన్యూ అధికారుల మాట
- ఏడాదిగా పాస్‌బుక్ కోసం తిరుగుతున్న షేక్ మునీర్
- కలెక్టర్, ట్రెయినీ కలెక్టర్, తాసిల్దార్‌కు చెప్పినా ఫలితం లేదు..
- రైతుబంధు రూ.20 వేలు కోల్పోయాడు
- రైతుబీమాకు అనర్హుడిని చేశారు..
- కలెక్టర్ నుంచి ఆర్డర్ రావాలన్నరు..
- ధర్మగంటను ఆశ్రయించిన అన్నదాత

దండేపల్లి : నమస్తే ధర్మగంట అవినీతి రెవెన్యూ అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. అధర్మ పరులను పరుగులు పెట్టిస్తున్నది. ప్రతి గ్రామం, పట్టణం, కూడళ్లు, హోటళ్లు, నలుగురు రైతులు కలిసినా దీనిపైనే చర్చ. ఈ క్రమంలో బాధిత రైతులు కూడా నేరుగా ధర్మగంటను ఆశ్రయిస్తున్నారు. విలేకరులకు, ఆఫీసులకు తమ వద్ద ఉన్న సాక్ష్యాలకు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో లక్షెట్టిపేటకు చెందిన రైతు షేక్ మునీర్ తనకు పాస్ బుక్ రాక ఏడాదికాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. గురువారం ఉదయం ఓ హోటల్ వద్ద నమస్తే పేపర్ చూసి విలేకరిని ఆశ్రయించాడు. తన బాధను చెప్పుకున్నాడు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండుసార్లు రైతుబంధు డబ్బులు
రూ.20 వేలు నష్టపోయాను అని చెప్పుకుంటే అప్పుడున్న అధికారులకు రూ.10 వేలు ఇస్తే పనై పోయేది గదా అని పని చేయకుండా ఉచిత సలహాలు ఇస్తున్నారని తెలిపాడు. ఆ రైతు దీనగాథ ఆయన మాటల్లోనే..

నా పేరు షేక్ మునీర్. మాది మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మస్తాన్‌గూడ. నాకు దండేపల్లి మండలం కుందేళ్లపహాడ్ శివారుల్లోని సర్వే నంబర్ 37/10/1లో 2.27 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 30 ఏండ్ల నుంచి నేను సాగు చేసుకుంటున్న. దీనికి సంబంధించి పాత పట్టాదార్ పాస్ పుస్తకం కూడా ఉంది. గతంలో బ్యాంకు నుంచి రుణం కూడా తీసుకున్న. 2009 నుంచి ఇప్పటివరకు పంట రుణం క్లియర్ చేశా. ఒకసారి రుణం మాఫీ కూడా అయింది. భూ రికార్డుల ప్రక్షాళన పేరిట అధికారులు తీరని అన్యాయం చేశారు. అన్ని ఆధారాలు ఉన్నా నూతన పాస్ పుస్తకం ఇవ్వకపోగా, ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నరు. ఏడాది నుంచి కలెక్టర్, ట్రెయినీ కలెక్టర్, తాసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. కొత్త పట్టాదార్ పాస్ పుస్తకం కొరకు చెప్పులరిగేలా తిరుగుతున్నా దయ చూపడం లేదు. లక్షెట్టిపేటలో ఉండే నేను దండేపల్లి తాసిల్దార్ కార్యాలయానికి ఇప్పటివరకు యాబై సార్లకుపైగా వచ్చా. కలెక్టర్‌కు దగ్గరికి కూడా ఎన్నోసార్లు వెళ్లి కలిశా. తాసిల్దార్ కార్యాలయానికి వచ్చినప్పుడల్లా తాసిల్దార్ అందుబాటులో ఉండకపోవడం, వీఆర్వో రాకపోవడం.. అందరూ ఉంటే చేద్దాం.. చూద్దాం.. తర్వాత రమ్మనడం.. చేసేవారు.

నూతన పట్టాదార్ పాస్ పుస్తకం అందకపోవడంతో రైతుబంధు డబ్బులు రెండు విడతలుగా రాలేదు. ఇప్పటివరకు దాదాపు రూ.20 వేలకుపైగా నష్టపోయా. రైతు బీమాకు అనర్హుడిని అయ్యా. కొత్త పాస్ పుస్తకం లేకపోవడంతో బ్యాంకోళ్లు పంట రుణం ఇవ్వడం లేదు. ప్రతీ సారి ఆఫీసుకు రావడంతో సొంత పనులు చేసుకోలేక ఆర్థికంగా నష్టపోతున్న. అధికారులను గట్టిగా అడిగితే నీ పని కానివ్వం. ఫైలు పక్కకు పెట్టేస్తం అంటున్నారు. గత అధికారులకు డబ్బులు ఇచ్చి ఉంటే పనై పోయేది. రైతుబంధు డబ్బులు కూడా వచ్చేవని అంటున్నరు. ఇంకా కలెక్టర్ నుంచి ఆర్డర్ రావాలని అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అసలు నాకు పాస్ బుక్ వస్తుందన్న నమ్మకం లేదు. కలెక్టర్, అధికారులు కరుణించి పాస్ బుక్ ఇవ్వండి.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...