మద్దిమాడ కాల్పుల ఘటనకు 31 ఏళ్లు


Wed,April 24, 2019 01:56 AM

-నేడు చేనేని భీమయ్య వర్ధంతి
కాసిపేట : మద్దిమాడ కాల్పులు జరిగి బుధవారానికి 31 ఏళ్లు అవుతుంది. ఆదివాసీ గిరిజనులు గూడు నిర్మించుకునేందుకు అడవికి వెళ్లి కట్టెలు తెచ్చుకోగా వారిని అడ్డుకొని అమానుషంగా కాల్పులు జరిపి తుపాకీ తూటాలకు ఒకరిని బలి తీసుకొని ఆరుగురిని గాయపర్చిన ఘటనకు నేటికి 31 ఏళ్లు. ఇప్పటికీ మరిచిపోలేని ఆ చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ నాటి కాల్పుల్లో మృతి చెంది న అమరుడు చేనేని భీమయ్య గిరిజన పోరాట ప్రతిమను గుర్తు చేసుకుంటూ ఆదివాసీ గిరిజనులు ప్రతి ఏడాది ఏప్రిల్ 24న భీమయ్య వర్ధంతిని సాంప్రదాయ పద్దతిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాసిపేట మండలం దేవాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మద్దిమాడ గ్రామస్తులు 1988లో అప్పటి ప్రభుత్వం పూరి గుడిసెల్లో ఉండవద్దనీ, ప్రతి ఒక్కరూ పెంకుటిల్లు నిర్మించుకోవాలనీ, ప్రతి కుటుంబానికి గూన పెంక మం జూరు చేసి సరఫరా చేసింది. గూన పెంక రావడంతో ప్రభుత్వ సూచన మేరకు గిరిజనులు నూతనంగా పెంకుటిళ్లు నిర్మించుకునేందుకు పాత గుడిసెలు తొలిగించి నూతనంగా నిర్మించేందుకు అవసరమైన కర్ర కోసం అడవికి వెళ్లారు. అడవి నుం చి ఎడ్ల బండ్లలో కర్ర తెస్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డగించారు.

లాల్‌గూడ, మద్దిమాడ గ్రామాల మధ్య ఆపి కర్రను అధికారులు తెచ్చిన లారీల్లో తరలించే ప్రయత్నం చేయగా గిరిజనులు అందరూ ఏకమై వాదనకు దిగారు. దీంతో వెనుతిరిగిన అటవీ శాఖ అధికారులు పోలీసులను వెంట బెట్టుకొని వచ్చారు. కర్ర నింపిన లారీలకు గిరిజనులు ఎడ్ల బండ్లను అడ్డుపెట్టారు. వాదనలు జరుగుతున్న క్రమంలో అధికారులు మహిళలపై దౌర్జన్యం చేస్తూ దాడికి దిగారు. దీంతో ఆగ్రహించిన మద్దిమాడ గ్రామ గిరిజనులు ఎదురు దాడికి దిగడంతో ఎటువంటి హెచ్చరికలు లేకుండా పోలీసులు కాల్పులు జరపగా చేనేని భీమయ్య అనే యువకుడు కా ల్పుల్లో మృతి చెందా డు. చెడ్మెకి కుద్దు, చెడ్డెకి భీంకావు, టేకం శంక ర్, బద్ది పాపయ్య, మాడావి మారు భా యి, మాడవి జైతులకు తూటాల గాయాలయ్యాయి. కడుపులో తూటా దిగి పేగులు బయటకు వచ్చినా లుంగితో కట్టుకొని గిరిజన పోరాట ప్రతిమ చూపిన భీమయ్య ను గిరిజనులు గుర్తు చేసుకుంటూ మద్దిమాడ గిరిజన గ్రామస్తులతో పాటు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఏప్రిల్ 24న భీమయ్య వర్ధంతిని సాంప్రదాయ పద్దతిలో ఘనంగా నిర్వహిస్తున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...