విధులను బాధ్యతగా నిర్వహించాలి


Sun,April 21, 2019 12:17 AM

మంచిర్యాలరూరల్ : ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వహించాలని పోలింగ్ అధికారులు మంచిర్యాల మండల అభివృద్ధి అధికారి అబ్దుల్‌హై ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంపిటిసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఒకే రోజు మూడు విడుతలుగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శిక్షణలో ఎంపీడీఓ అబ్దుల్‌హై మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వెయ్యి ఓటర్లలో ఒక్క టెండర్ ఓటున్నా పోలింగ్ బూత్‌లలో ఓట్ల లెక్కింపు జరుపవద్దనే ఆదేశాలున్నాయని స్పష్టం చేశారు. ఎవరైనా ఓటరు తన ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్‌కు వచ్చే వరకు అప్పటికే తన ఓటును ఎవరైనా వేసి ఉంటే ఆ ఓటును టెండర్ ఓటుగా పరిగణిస్తామని తెలిపారు. టెండర్ ఓటుతో కౌంటింగ్ జరుపవద్దనే నిబంధన ఉన్న కారణంగా టెండర్ ఓటు లేకుండా నిబంధనల మేరకు సక్రమంగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. టెండర్ ఓటు వెయ్యడం జరిగితే ఆ పోలింగ్ స్టేషన్‌లో తప్పు జరిగినట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ స్టేషన్‌లోనికి ఎన్నికల సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లు, ఓటర్లు కూడా మొబైల్ ఫోన్లను తీసుకరాకుండా చూడాలన్నారు. పోలింగ్ సమయంలో ఎన్నికల అధికారులు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి తీసుక వచ్చిన వారికి ఓటు హక్కు ను కల్పించాలన్నారు.

ఎన్నికల విధుల నిర్వాహణలో అధికారులు పారదర్శకంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ నిర్వాహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని తెలిపారు. ఓటింగ్ బ్యాలెట్ పద్ధతిలో ఉన్నందున పోలింగ్ ప్రారంభం నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తించాలన్నారు. ఎన్నికల శిక్షణలో ఎంపీడీఓ అబ్దుల్‌హైతో పాటు జడ్పీటీసీ ఎన్నికల మాస్టర్ ట్రైనర్ ఎండీ కలీం అమ్మద్, ఎంపీటీసీ ఎన్నికల శిక్షకులు లక్ష్మణ్, దత్తు మూర్తి, రాజమల్లు, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, రాథోడ్ రమేశ్, ఎన్నికల అధికారులున్నారు.

దండేపల్లి : మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో విధులు నిర్వహించే మండల సిబ్బందికి దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మాస్టర్ ట్రైనర్ శనివారం శిక్షణ నిర్వహించారు. దండేపల్లి మండల పరిధిలోని పీఓ, ఏపీలు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో విధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారులు శిక్షణతో మరింత పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పోలింగ్ అధికారులకు శిక్షణ అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పీఓలు, ఏపీలున్నారు.

జన్నారం : మే నెలలో జరుగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాంటి అవకతకలు జరుగకుండా విధులను సక్రమంగా నిర్వహించాలని పీఓ, ఏపీఓలకు మండల ప్రత్యేకాధికారి ఎంఎం ఖాన్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఒక రోజు శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. ఎంపీటీసీలు బ్యాలెట్ పేపర్ పింక్(గులాబి), జడ్పీటీసీ బ్యాలెట్ పేపర్ వైట్(తెలుపు)కలర్‌లో ఉంటుందని, ఓటు వేయడానికి వచ్చినవారికి ఎడమ చేతి మధ్యవేలికు ఇండెబుల్ ఇంక్‌ను పెట్టాలని, బ్యాలెట్ బాక్స్‌లను ఓపెన్ చేయడంతో పాటు సీజ్ చేసే విధానాలపైన ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అరుణారాణీ, ఎంఈవో నడిమెట్ల విజయ్‌కుమార్, కట్ట రాజమౌళి, 130మంది ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...