అదృష్టం ఎవరికో !


Fri,April 19, 2019 11:52 PM

- అభ్యర్థుల జాబితాపై కసరత్తు మొదలు
- దృష్టి పెట్టిన మంత్రి అల్లోల, ఎమ్మెల్యేలు
- రెండు, మూడు రోజుల్లో సీఎంకు అందజేత
- ఎమ్మెల్యేల చుట్టు తిరుగుతున్న ఆశావహులు
- విపక్ష పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జన
- గ్రామాల్లో జోరందుకున్న విందులు

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల సంద డి నెలకొంది. నేడో, రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుండగా... మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. దీంతో ఆశావహులు షెడ్యూల్ వచ్చే లోపు తమ టికెట్లను ఖరారు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీలో టికెట్ల వేట జోరందుకుంది. ఇప్పటికే గ్రామాల్లో పట్టు ఉన్న వారు, మండలాల్లో పేరున్న వారు, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వారు తమ అదృష్టాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రెండు, మూడు రోజులుగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టారు.

ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించడంతో.. అభ్యర్థులు ఎవరుంటే బాగుంటుందనే విషయంపై కసరత్తు జోరందుకుం ది. రెండు రోజులుగా మంత్రి అల్లోలతో పాటు ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల అభ్యర్థులపై దృష్టి పెట్టా రు. మండలాల వారీగా ముఖ్య నాయకులతో స్థానిక ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 567ఎంపీటీసీ, 66జడ్పీటీసీ స్థానాలు, 66ఎంపీపీ పదవులున్నాయి. నిర్మల్ జిల్లాలో 18జడ్పీటీసీ, 18ఎంపీపీ పదవులతో పాటు 156ఎంపీటీసీ స్థానాలున్నాయి. మంచిర్యాల జిల్లాలో 16జడ్పీటీసీ, 16ఎంపీపీ పదవులతో పాటు 130ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 17ఎంపీపీ, 17జడ్పీటీసీ స్థానాలు, 158ఎంపీటీసీ స్థానాలున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 123ఎంపీటీసీ, 15జడ్పీటీసీ, 15ఎంపీపీ పదవులున్నాయి. అధికార పార్టీలో వీటికి పెద్ద సంఖ్యలో ఆశావహులు ఉన్నారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడం తో.. అభ్యర్థుల ఖరారును అధినేత కేసీఆర్, రాష్ట్ర నాయకత్వానికే వదిలేశారు. అభ్యర్థులు ఎవరనే విషయంలో జిల్లా నుంచి ఎమ్మెల్యేలు సిఫారసు చేయనున్నారు. జిల్లా నుంచి వచ్చిన జాబితా ప్రకా రం రాష్ట్ర నాయకత్వం అభ్యర్థులను ప్రకటించనున్నారు. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి.. సీఎం కేసీఆర్‌కు పంపాలని ఎమ్మెల్యేలు కసరత్తులో వేగం పెంచారు. ఇప్పటికే ఆయా మండలాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులతో పాటు ఎంపీపీలుగా ఎవరుంటే బాగుంటుందనేది అందరి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఒకే పేరు ఉన్న చోట ఇబ్బంది లేకపోగా.. రెండు, మూడు పేర్లు ఉన్న చోట గ్రామ, మండల నాయకులందరి అభిప్రాయాలను సేకరించి జాబితా తయారు చేస్తున్నారు. ఏకాభిప్రాయం వచ్చిన చోట ఒకే పేరు సిఫారసు చేస్తుండగా.. ఏకాభిప్రాయం రాని చోట రెండు, మూడు పేర్లు పంపే అవకాశాలున్నాయి. అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేసినా.. అంతా కలిసి కట్టుగా పని చేయాలని ఎమ్మెల్యేలు అందరిని సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాలు, మండలాలపై స్పష్టత రాగా.. కొన్ని గ్రామాలు, మండలాలపై కసరత్తు నడుస్తోంది. సోమవారం నాటికి జాబితాలు సిద్ధం చేసి.. రాష్ట్ర నాయకత్వానికి పంపే అవకాశాలున్నాయి. మరోవైపు గ్రామా ల్లో మందు, విందు రాజకీయాలు జోరందుకున్నాయి. తమకు టికెట్ వచ్చేందుకు మద్దతు ఇచ్చే వారందరిని గ్రూపుగా తయారు చేసుకుని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిల వద్దకు వెళ్తున్నారు. ఇప్పటికే ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిత్యం పల్లెల్లో విందులు జోరుగా సాగుతున్నాయి. విపక్ష పార్టీల్లోనూ అభ్యర్థులు ఎవరనే దానిపై కసరత్తు చేపట్టినా.. చాలా చోట్ల ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితులు లేవు. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో.. అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు విపక్షాల్లో అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవంతో పోటీ చేయటం కంటే.. ఊరుకుండి పోవటమే మేలనే భావనతో చాలా మంది విపక్ష నాయకులున్నారు. దీంతో ఆర్థికంగా బలంగా ఉన్న వారిని ఎంచుకునే పనిలో పడ్డారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...